vivek
-
ప్రముఖ హాస్యనటుడి గుర్తుగా మొక్కలు నాటిన హీరో
తమిళసినిమా మరిచిపోలేని నటుల్లో హాస్యనటుడు వివేక్ పేరు కచ్చితంగా చోటు చేసుకుంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కాగా ఆయన మూడో సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నటుడు వైభవ్ షూటింగ్ స్పాట్లో మొక్కలను నాటారు. నటుడు వైభవ్ కథానాయకుడిగా తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతోపాటు సెల్మురుగన్ నటిస్తున్నారు. వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ స్థానిక తరమణిలోని ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నిర్వహిస్తున్నారు. కాగా దివంగత హాస్యనటుడు వివేక్ అబ్దుల్ కలాంను మార్గదర్శిగా తీసుకుని గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే ప్రయత్నంలో తమిళనాడులో వేలాది మొక్కలను నాటిన విషయం తెలిసిందే. కాగా నటుడు వివేక్ మూడో సంస్మరణ దినం సందర్భంగా ఆయన్ని గౌరవించేలా నటుడు వైభవ్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు, ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కలిసి 100 మొక్కలను నాటినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి బాటలో తేజస్విని
కోలీవుడ్ దివంగత ప్రముఖ హాస్యనటుడు వివేక్ కుటుంబంలో శుభకార్యం జరిగింది. ఆయన కూతురు పెళ్లి చెన్నైలోని తన నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం అతికొద్దిమంది సమక్షంలో జరిగింది. 2021 ఏప్రిల్‌లో గుండెపోటుతో వివేక్ మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన వివేక్. కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం,రఘువరన్ బీటెక్ చిత్రాలతో వివేక్ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు. మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని ఏడు అడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. భరత్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది. చెన్నైలోని విరుగంబాక్కం వద్ద పద్మావతి నగర్లో ఉన్న వివేక్ నివాసంలోనే తేజస్విని వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగింది. తండ్రి బాటలో తేజస్విని వివేక్‌కు మొక్కలంటే చాలా ఇష్టం.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న వివేక్.. చెన్నై నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కల నాటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యక్రమాన్ని ఇప్పుడు తేజస్విని కూడా కొనసాగిస్తుంది. తన తండ్రి కోరికను నిలబెడుతూ.. తన వంతుగా ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అందులో భాగంగా వారి వివాహానికి హాజరైన అతిథిలకు తేజస్విని దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజస్విని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత వస్తోంది!
కోలీవుడ్‌లో మరచిపోలేని చిత్రాల్లో అళగి ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తంగర్ బచ్చన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హృదయాలను హత్తుకునే కథా, కథనాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. నటుడు పార్తీపన్, నందితాదాస్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఉదయగీత సినీ క్రియేషన్స్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. 2002లో విడుదలైన ఈ వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రం అప్పుట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే కమలహాసన్ నటించిన పంబల్ కే.సంబంధం, అజిత్ హీరోగా నటించిన రెడ్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైన అళగి చిత్రం అన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇళయరాజా సంగీత బాణీలు సంగీత ప్రియులను అలరించాయి. తీరం దాటని పాఠశాల ప్రేమకథా చిత్రంగా అళగి తెరకెక్కింది. ఈ తరం ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం అళగి. ఈ తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో అళగి చిత్రాన్ని 22 ఏళ్ల తరువాత మళ్లీ ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్ది.. ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయకుమార్ తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ తరం యువత చూడాల్సిన కథా చిత్రం అళగి అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడాన్ని దర్శకుడు తంగర్‌బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారన్నారు. దీనికి ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. ఇకపోతే అళగి చిత్రానికి సీక్వెల్‌ను కూడా చేసే ఆలోచన ఉందని నిర్మాత ఉదయకుమార్ చెప్పారు. -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాడు. పాస్‌పోర్ట్‌లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్‌కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
పెళ్లైన గంటల్లోనే భార్యపై దాడి.. వివేక్ బింద్రాపై గృహహింస కేసు
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ వివేక్ బింద్రాపై కేసు నమోదైంది. పెళ్లైన కొన్ని గంటలకే భార్యను వేధింపులకు గురిచేయడంతో పోలీసులు వివేక్ బింద్రాపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. వివేక్ బింద్రాకు యానిక అనే మహిళతో డిసెంబర్ 6న వివాహం జరిగింది. వీరు నోయిడాలోని సెక్టర్ 94 సూపర్ నోవా రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున, బింద్రా అతని తల్లి ప్రభ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు ఆయన భార్య యానికా ప్రయత్నించడంతో బింద్రా ఆమెపై దాడికి దిగాడు. యానిక శరీరంపై పలుచోట్ల గాయాలు కాగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయంపై బాధితురాలు సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టర్ 126 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక వివాహం జరిగిన కొన్ని గంటలకే, బింద్రా యానికను ఒక గదిలోకి తీసుకెళ్లి, ఆమెపై అసభ్యపదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె జుట్టును లాగి, దాడి చేసినట్లు తెలిపారు. యానికా చెవికి గాయం అవ్వడంతో వినికిడి సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. బింద్రా ఆమె ఫోన్‌ను కూడా పగలగొట్టినట్లు చెప్పారు. దీనిపై నోయిడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బింద్రా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దేశంతో పేరు ప్రఖ్యాతలు సాధించినమోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా.. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) సీఈవో కూడా. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత -
ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా
భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్... బీఆర్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు. చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్ ఆరోపించారు. ఆ కంపెనీ నా మిత్రుడిదే... తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్ ఆరోపించారు. రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్ వివరించారు. -
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. కాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో ఫారిన్ ఎక్స్ఛెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద నివాసంతోపాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. రామగుండంలో లిమిటెడ్. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి రూ. 8 కోట్లు డాక్టర్ జి. వివేక్ బ్యాంక్ ఖాతా నుండి M/s విజిలెన్స్ సెక్యూరిటీకి RTGS చేశారు ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ ఖాతా నుంచి హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యుటస్‌గా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వివేక్, అతని భార్య వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ సెక్యూరిటీతో 100 కోట్లు పెట్టబడి పెట్టినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్‌కు పరోక్ష నియంత్రణ ఉన్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా FEMA ఉల్లంఘనలు, పన్ను ఎగవేతలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లెక్కలోని అనేక కోట్ల లావాదేవీలు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, మంచిర్యాల: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, అతని ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. సోమాజీగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న ఫ్రీజ్ చేసిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: తనిఖీల జప్తులో తెలంగాణ టాప్.. ఏకంగా 659 కోట్ల స్వాధీనం -
విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఆ సోదరుల ధనబలం ముందు బీఆర్ఎస్ ప్రతాపమెంత?
ఓ పార్టీ అభ్యర్థి మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్లో తన బలం పెంచుకునేందుకు 30 మందికోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఆ అభ్యర్థికే వారు జై కొట్టడం ప్రారంభించారు. పార్టీ కండువాలు కప్పుకొని రోజువారీగా ప్రచారం చేస్తున్నారు. ఓ వాడలో 30 మందిని మాత్రమే తనవైపు తిప్పుకొనేందుకే సదరు అభ్యర్థి అక్షరాల రూ.2లక్షలు ఖర్చు చేయడం విశేషం. ► ఇదీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి చేసే ఎన్నికల ఖర్చుకు చిన్న ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదుగా మారాయి. జిల్లా పరిఽధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ, ఖానాపూర్ (జన్నారం) ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. సాధారణంగా జనరల్ స్థానంలో బలమైన నాయకులు పోటీలో ఉంటే అధికంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా జనరల్ స్థానం కన్నా బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం పెరిగింది. పోటీలో ఉన్నవారు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా ఎన్నికలు చాలా ఖరీదవుతున్నాయి. ధనబలమున్న గడ్డం సోదరులైన మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్ రంగ ప్రవేశంతో ఎన్నికలు మరింత ప్రియమైపోయాయి. బీఆర్ఎస్ బలం తగ్గకుండా.. చెన్నూర్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థులైన గడ్డం సోదరులకు దీటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ఖర్చు చేయడంలో పోటీ పడుతున్నారు. ప్రచారం, నాయకులు, కార్యకర్తల చేరికలు, బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ బహిరంగసభలు విజయవంతం చేసేందుకు రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకూ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు చేయడమో.. అంతకంటే భారీగా ప్లాన్ చేయడం కోసమో నోట్ల కట్టలు విప్పాల్సి వస్తోంది. మంచిర్యాల నియోజకవర్గం కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు పోటాపోటీగా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థుల హైరానా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. చెన్నూరు టికెట్ తెచ్చుకున్న దుర్గం అశోక్, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ రెండు పార్టీలతో డబ్బుల్లో పోటీపడలేకపోతున్నారు. అయినప్పటికీ తమ స్థాయికి మించి ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ఇక బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారైతే ఈ ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటీ పడలేక, పోటీ నుంచి తప్పుకోలేక ఇబ్బందిగానే ముందుకు సాగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లోనే ఖర్చు తెల్లవారు మొదలు పొద్దుగుంకేదాకా ప్రచారమంతా ఖర్చుతోనే నడుస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలకు జనసమీకరణ, రవాణా, భోజనాలు, మద్యం, ఊరూరా ప్రచార రథాలు, ప్రకటనలు, కరపత్రాలు, కండువాలు, బహిరంగ సభలు, వసతులు తదితర వాటి కోసం రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి రూ.40లక్షల్లోపే ఖర్చు పరిమితి ఉంది. అయితే ఆ పరిమితి వాస్తవానికి ఎప్పుడో దాటిపోయింది. ఇతర పార్టీల నాయకులు తాము పార్టీ మారేందుకు ‘బేరసారాలు’ మొదలుపెట్టాక ఈ ఖర్చు మరింత పెరిగిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలోనూ డబ్బు ప్రవావం ఉంటోంది. ఇక పోలింగ్ సమీపించే కొద్దీ ఈ నోట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుపై పకడ్బందీ నిఘా పెడితే ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడనుంది. -
కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్‌కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో బీజేపీకి వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా నిన్న బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న వివేక్.. రేవంత్ రెడ్డి తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా వివేక్ పార్టీ మారతారని ప్రచారం జరిగినా దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అపాయిమెంట్ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతాయి అన్న వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా పోటీకి దూరం అని చెప్పుకోవడం వెనుక అంతరార్థం మరోలా ఉంటుందన్నది ప్రచారంలో ఉంది. వరుస చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. కీలక నాయకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉపాధ్యక్షునిగా రామస్వామి బలమైన అభ్యర్థి కాగలడని, మంచి మనిషి అని పేర్కొన్నారు. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎవరికి ఆమోదం తెలుపనున్నారనే సందిగ్ధంలో ఆయన ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వివేక్ మంచి మనిషి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతని వద్ద మంచి మేధాశక్తి ఉంది. ఏదో మంచి మార్పును తీసుకురాగలడు. నా కంటే గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఎవరైనా నన్ను బెస్ట్ అధ్యక్షునిగా గుర్తిస్తే.. నేను అతనిలా ఉంటాను' అని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్‌ను 21వ శతాబ్దపు బెస్ట్ ప్రెసిడెంట్‌గా రామస్వామి అభివర్ణించారు. ఈ మాటలు రామస్వామికి ఎంతో ఆధరణను ఇచ్చాయని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు వివేక్ రామస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామస్వామికి ట్రంప్ ఆమోదం తెలపడం వచ్చే ఎన్నికల్లో మంచి ఊపునిచ్చే అంశమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి మూడో స్థానంలో ఉన్నారు. ఇదీ చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’.. తీవ్ర పదజాలంతో ట్రంప్ దూషణ -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ముసలం కొనసాగుతోంది. పార్టీలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం ఇప్పటికే మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పార్టీలో వారికున్న సమస్యలను వివరించినట్టు సమాచారం. మరోవైపు.. నిన్న(ఆదివారం) నాగర్‌కర్నూలులో బీజేపీ సభ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేపీ నడ్డాతో బీజేపీ నేతలు విజయశాంతి, రఘునందన్ రావు, వివేక్ విడివిడిగా మంతనాలు జరిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ నేతల నుంచి ఫిర్యాదుల చేసిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఇక, రాబోయే వారం పది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెలంగాణలో మోదీ పర్యటన అనంతరం.. పార్టీ కీలక మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలకు పదవులు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 600 కార్ల కాన్వాయ్‌తో.. -
వివేకా కేసులో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
-
2024 US Presidential Election: ఎందుకు పోటీ చేస్తున్నానంటే...
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈసారి భారత సంతతీయుల సందడి ఎక్కువగా ఉండేట్టుంది. ఇప్పటికే ఆంట్రప్రెన్యూర్, రచయిత వివేక్ రామస్వామి తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికిగానూ ముందు తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఏమైనా నిండా నలభై ఏళ్లు లేని, కేరళ మూలాలున్న వివేక్ రామస్వామి ఇంత పెద్ద పదవికి పోటీ పడాలని అనుకోవడమే విశేషం. ‘ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి నేను రాజకీయ ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నారు. అమెరికా ప్రస్తుతం జాతీయ అస్తిత్వ సంక్షోభంలో ఉంది. విశ్వాసం, దేశభక్తి, కఠిన శ్రమ వంటివి కుప్పగూలుతున్న క్షణంలో మనం ఒక పరమార్థం కోసం తపిస్తున్నాం. అవగాహనకు సంబంధించిన మన అవసరాలను సంతృప్తిపర్చుకునేందుకు వాతావరణతత్వం, కోవిడ్ తత్వం, జెండర్ భావజాలం వంటి లౌకిక మతాలను కౌగిలించుకుంటున్నాం. కానీ అమెరికన్ అంటే అర్థం ఏమిటనే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు. ఈ మేలుకొలుపు వాదాన్ని (వోక్ ఎజెండా) పలుచన చేసి దాని ప్రాసంగికతను నిర్వీర్యం చేయడం, ఆ శూన్యాన్ని ఉత్తేజకర జాతీయ అస్తిత్వంతో భర్తీ చేయడం రిపబ్లికన్ పార్టీ ప్రథమ ప్రాధాన్యం కావాలి. కానీ దీనికి బదులుగా చాలామంది అగ్రశ్రేణి రిపబ్లికన్లు 1980లలో కంఠస్థం చేసిన నినాదాలను వల్లెవేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించకుండానే వామపక్ష సంస్కృతిని విమర్శిస్తున్నారు. అమెరికాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు, అమెరికా అంటే ఏమిటి అని మనం కొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి రాజకీయ ప్రచారాన్ని మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. 37 సంవత్సరాల ఒక రాజకీయ ఔట్‌సైడర్ భూమ్మీద అత్యున్న తమైన అధికారాన్ని సాధించాలనుకోవడం అహంకారంగానే కనిపించవచ్చు. కానీ, నేను మన జాతి కోసం, అమెరికన్ జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రతిభను పునరుద్ధరించగలిగే జాతి కోసం దార్శని కతలో భాగంగా పోటీ చేస్తున్నాను. మనం ప్రతిభను పునరుద్ధరించాలి. నా తల్లిదండ్రులు ఈ దేశానికి చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, వేలాది అమెరికన్ల జీవితా లను మెరుగుపర్చిన వ్యాపార సంస్థలను రూపొందించిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవేశిస్తున్న వారికి బదులుగా మా తల్లిదండ్రుల వంటి వలస ప్రజలు అవసరం. ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా అమెరికా సరిహద్దులకు భద్రత కల్పించడం, ప్రతిభా ప్రవేశాలకు అనుకూలంగా లాటరీ ప్రాతి పదికతో కూడిన వలస విధానాన్ని నిర్మూలించడం అవసరం. అమెరికాకు వచ్చి విజయాలు పొందినవారి ప్రతిభను మనం తప్పక ప్రోత్సహించాలి. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 20 శాతం మందిని నియమిస్తున్న ఫెడరల్ కాంట్రాక్టర్లు జాతి ప్రాతిపదికన నియామకాలను చేపట్టడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా పూర్వ అధ్య క్షుడు లిండన్ బి. జాన్సన్ కార్యనిర్వాహక ఆదేశం 11246 జారీ చేశారు. దీనివల్ల నల్లజాతి, హిస్పానిక్(స్పానిష్ దేశాలు) ఉద్యోగుల పట్ల అగ్రశ్రేణి కంపెనీలు ఎక్కువ అక్కర చూపుతూ– శ్వేత జాతి లేదా ఆసియన్ అమెరికన్లుగా ఉంటున్న అర్హత కలిగిన అభ్యర్థుల పట్ల అనిష్టం ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి కార్యనిర్వాహక ఆదేశాన్ని రద్దు చేయటమే కాకుండా, అక్రమమైన జాతి ప్రాతిపదిక ప్రాధాన్యాలపై విచారణ జరిపించాలని న్యాయ శాఖను ఆదేశిస్తాను. ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎంపికైనవాళ్లు వాస్తవంగా ప్రభు త్వాన్ని నిర్వహించాలి. కాన్నీ ఎన్నికలలో పాల్గొనని ఆంథోనీ ఫాచీ (అమెరికా ముఖ్య వైద్య సలహాదారు), మెర్రిక్ గార్లండ్ (అమెరికా అటార్నీ జనరల్) వంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరి ప్రవర్తించారు. ఇంకోసారి ఇలాంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరినప్పుడు ఒక అధ్యక్షుడికి రాజ్యాంగం కల్పించిన సాధికారతను నేను తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధత వహిస్తాను; వారిని తొలగిస్తాను. ఫెడరల్ ఉద్యోగులకు కల్పించిన సివిల్ సర్వీస్ సంరక్షణలను అవస రమైతే కార్యనిర్వాహక ఆదేశం ద్వారా రద్దు చేస్తాను. వీటికి బదులుగా నిర్దిష్టకాలం మాత్రమే రక్షణ కల్పించే మేనేజీరియల్ నిబంధనలను తీసుకొస్తాను. దేశాధ్యక్షుడు ఎనిమిదేళ్లకు మించి అధికారంలో ఉండ నప్పుడు,›బ్యూరోక్రాట్లకు కూడా దాన్నే వర్తింప జేయాలి. డబ్బును వృథా చేస్తున్న లేదా కాలం చెల్లిన సంస్థలకు నిధులను నిలిపివేసేలా– 1974 నాటి ‘ఇంపౌండ్‌మెంట్ కంట్రోల్’ చట్టాన్ని రద్దు చేయాలని లేక సవరించాలని అమెరికన్ కాంగ్రెస్‌ను కోరతాను. సంస్కరించడానికి సాధ్యం కాని సంస్థలను మూసివేస్తాను. వాటి స్థానంలో పునాదుల నుంచి కొత్త సంస్థలను నిర్మిస్తాను. ఏ భావాలనూ సెన్సార్ చేయనప్పుడే ఉత్తమ ఆలోచనలు పుట్టుకొస్తాయి. తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రసంగాలను సెన్సార్ చేయడంపై మన ప్రభుత్వం టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అవి అలా చేసేట్టుగా ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది. రాజ్య శక్తులతో కలిసి పనిచేసేలా ఇంటర్నెట్ కంపెనీలు అమెరికన్ రాజ్యాంగ తొలి సవరణకు కట్టుబడి ఉండాలి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో చేసినట్టుగా, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ‘స్టేట్ యాక్షన్ ఫైల్స్’ను బహిర్గత పరుస్తాను. రాజ్యాంగం నిషేధించిన కార్య కలాపాలను చేపట్టేలా కంపెనీలను బ్యూరోక్రాట్లు తప్పుడు పద్ధతుల్లో ఒత్తిడిపెట్టినట్టు తెలిపే ప్రతి ఉదంతం దీని ద్వారా బయటికొస్తుంది. ఇంటర్నెట్‌ని దాటి మన ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అభిప్రాయాల సెన్సార్షిప్ విస్తరించింది. నల్లజాతి, గే లేదా ముస్లింగా ఉంటున్నందుకు మీరు ఎవరినైనా ఉద్యోగం లోంచి తొలగించలేనట్లయితే, రాజ కీయ ప్రసంగం కోసం కూడా మీరు ఎవరినీ ఉద్యోగం లోంచి తొలగించకూడదు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తగా రాజకీయ వ్యక్తీకర ణను ప్రతిష్ఠించడానికి నేను అమెరికన్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాను. విభేదించే అభిప్రాయాలను కలిగివుండే కార్మికులను వివక్ష నుంచి కాపాడటానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న పౌర హక్కులను అమలు చేస్తాను. మత పరమైన వివక్షపై ఉన్న ఫెడరల్ ప్రభుత్వ నిషేధం ఉద్యోగులను ఏ మతానికీ లోబడనీయకుండా యజమానులను కట్టడి చేస్తోంది. కార్పొరేట్ అమెరికాలో వ్యాపించివున్న మేలుకొలుపు వాదానికి ఇది సరిగ్గా సరిపోయేట్టుగా ఉంది. పరస్పరం పంచుకునే సూత్రాల చుట్టూ మన జాతీయ అస్తి త్వాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత, అమెరికాకు అతి పెద్ద విదేశీ ప్రమాదంగా ఉన్న కమ్యూనిస్టు చైనా వికాసాన్ని ఓడించడానికి అవసరమైన దృఢత్వాన్ని సమకూర్చుకోగలం. 1980లలో సోవియట్ యూనియన్ లాగా కాకుండా, చైనా నేడు ఆధునిక అమెరికన్ జీవన శైలికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది. అందుకే మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలి. చైనాను కనీసం తాకకుండా, అమెరికాను వణికిస్తున్న సరికొత్త వాతావరణ మతం చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకించడం ద్వారా మనం ప్రపంచ ఇంధన నాయకత్వాన్ని తిరిగి పొందాలి. తైవాన్ను ఏ విధంగానైనా సరే కాపాడుతూనే సెమీ కండ క్టర్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలి. 16 సంవత్సరాల లోపు పిల్లలు టిక్ టాక్ ఉపయోగించకుండా నిషేధం విధించాలి. కోవిడ్–19ను వ్యాప్తి చెందించడంపై చైనాను జవాబుదారీని చేయ డానికి మనం ఆర్థిక తులాదండాన్ని తప్పకుండా ఉపయోగించాలి. చౌర్యం, వ్యాపారమయ ఎత్తుగడలను చైనా ప్రభుత్వం నిలిపి వేసేంతవరకు అవసరమైతే చైనాలోకి అమెరికన్ కంపెనీలు విస్తరించడాన్ని నిషేధించడానికి కూడా మనం సిద్ధపడాలి. మనం నిజంగా ఎవరం అని తిరిగి ఆవిష్కరించుకున్నట్లయితే మళ్లీ కాలానికి తగినట్టుగా మనం ఎదగగలం. అమెరికా బలం మన భిన్నత్వం కాదు, ఆ భిన్నత్వానికి అతీతంగా మనల్ని ఐక్యం చేస్తున్న ఆదర్శాలే మన బలం. ఈ ఆదర్శాలే అమెరికన్ విప్లవాన్ని గెలిపించాయి, అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని ఐక్యపరిచాయి, రెండు ప్రపంచ యుద్ధాలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలిపించాయి. ఈ ఆదర్శాలు ఇప్ప టికీ స్వేచ్ఛాయుత ప్రపంచం పట్ల ఆశను కలిగిస్తున్నాయి. వీటిని మనం పునరుద్ధరించినట్లయితే మనల్ని ఏ శక్తీ ఓడించలేదు. వివేక్ రామస్వామి వ్యాసకర్త అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడనున్నారు (‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సౌజన్యంతో)