సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇక వారి చేరిక లాంఛనమే అని సమాచారం. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకూలిస్తే సోమవారం వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటారని తెలిసింది. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్‌కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్, పార్టీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. స్పష్టమైన హామీ లభించడంతో ఇద్దరు నేతలు పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇదే సమయంలో వివేక్ సోదరులు టీఆర్‌ఎస్‌తో పొత్తులపై జరిపిన చర్చలు మాత్రం విఫలమయ్యాయని తెలుస్తోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో ఇంకా చర్చలకు తావులేదని దిగ్విజయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరే విషయమైనా, మరే నిర్ణయమైనా సోమవారం వెల్లడిస్తానని ఎంపీ వివేక్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరాలని తనపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉందన్నారు.