సొంత గూటికి వివేక్ బ్రదర్స్
* సోనియాతో చర్చించిన నేతలు
* తిరిగి రావడంపై సానుకూలత
* కోరిన స్థానాలు ఇచ్చేందుకూ ఓకే
* తెలంగాణ ఇస్తే తిరిగొస్తామన్న మాట మేరకే చేరుతున్నాం: ఎంపీ వివేక్, వినోద్
* కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఊహించినట్లుగానే.. ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌లోకి తిరిగొస్తామని మాటిచ్చామని, ఆ మాట మేరకే తిరిగి ఆ పార్టీలో చేరుతున్నామని వారు సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమని.. ఇక తాము సోనియా నేతృత్వంలో కాంగ్రెస్‌కు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. వివేక్‌కు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఖాయమయ్యాయని, దీనిని అధికారికంగా ప్రకటించడమే తరువాయని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సోమవారం వివేక్, వినోద్ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసం లో కలిసి, తిరిగి పార్టీలో చేరే విషయమై చర్చించారు. దీనిపై ఆమె సానుకూలత వ్యక్తం చేయడం, వారు కోరుతున్న స్థానాలను ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో.. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
సోనియాతో భేటీ అనంతరం మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలసి వివేక్, వినోద్ విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. 14 ఎఫ్ రద్దు పోరాటంలో అరెస్టయ్యాం. పార్లమెంట్‌లో సస్పెన్షన్‌కుగురయ్యాం.. దీక్షలు చేశాం.. తెలంగాణ సాధన కోసం చేయని ప్రయత్నం లేదు. ఆ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి తరుణంలో తెలంగాణ కాంక్షను బలంగా చాటేందుకు, ఉద్యమంలో చేరేందుకు పార్టీని వీడాం. మేం పార్టీని వీడాకే అధిష్టానంలో కదలిక వచ్చింది. జూన్ 2న మేం పార్టీని వీడితే.. జూన్ 30న సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు’’’ అని వెల్లడించారు. తెలంగాణపై బీజేపీ సహా అనేక జాతీయ పార్టీలు వ్యతిరేకించినా సోనియా మాటపై నిలబడి ప్రక్రియను పూర్తి చేశారని వివేక్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఇంద్రకర ణ్‌రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత, మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంద్రకరణ్‌రెడ్డికి ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్, కోనేరు కోనప్పకు సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోనప్ప కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు.
ఎందుకు వీడారో.. ఎందుకొచ్చారో!: శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కాంగ్రెస్‌లో చేరడంపట్ల తెలంగాణ పీసీసీ మేనిఫెస్టో ఛైర్మన్ డి.శ్రీధర్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ప్రచార కమిటీ కో-చైర్మన్ షబ్బీర్‌అలీతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక్ కాంగ్రెస్‌ను ఏ సందర్భంలో ఎందుకు వీడారో, మళ్లీ ఎందుకు వచ్చారో ఆయన్నే అడగాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ ఏడాది పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తెలంగాణ కోసం తాము ఎన్నో ఇబ్బందులు, అవమానాలు భరించామని,పార్టీపై నమ్మకంతో కొనసాగినవారే అసలు సిసలైన కాంగ్రెస్‌వాదులన్నారు.