బంగారు తెలంగాణ కోసమే...
టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నామన్న గుత్తా, వివేక్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సహకరించాలనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌నాయక్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఓటర్లు ఒత్తిడి తెచ్చారు: గుత్తా
కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధాకరంగానే ఉందని గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావు పేర్కొన్నారు. అయితే పార్టీలోని అంతర్గత కలహాలు, నాయకుల మధ్య విబేధాలతో తాము తీవ్రంగా కలత చెందామన్నారు. సీనియర్ల మధ్య అంతర్గత విభేదాలు నాయకులను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నాయని గుత్తా ఆరోపించా రు. వీటి వల్ల పార్టీ బలహీనపడుతోందన్నా రు. షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీని కాపాడుకునే పరిస్థితి కాంగ్రెస్‌కు వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాలంటూ తన ఓటర్లు ఒత్తిడి తెచ్చారని గుత్తా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించానని...ఎంపీగా పోటీ చేయడానికి పార్టీ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ దేవతగా గుత్తా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. సమయం, సందర్భాన్ని బట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పదవులు ఇస్తామని టీఆర్‌ఎస్ ఇప్పటిదాకా తనకు కమిట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. జిల్లాలో ఏర్పాటవుతున్న యాదాద్రి పవర్‌ప్లాంటు, నల్లగొండ జిల్లా అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించారు.
పథకాలు ఆకర్షించాయి: వివేక్
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. పార్టీలోకి వస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అడిగారని వెల్లడించారు. పార్టీలో ఇప్పటిదాకా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్‌ను తాను కలవలేదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు.