వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావులపై వీహెచ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు.
పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్‌కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు.
పదవులకు రాజీనామా చేయాలి...
కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్‌ఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు.