
తమిళసినిమా మరిచిపోలేని నటుల్లో హాస్యనటుడు వివేక్ పేరు కచ్చితంగా చోటు చేసుకుంటుంది. తెలుగు చిత్రపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కాగా ఆయన మూడో సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నటుడు వైభవ్ షూటింగ్ స్పాట్‌లో మొక్కలను నాటారు. నటుడు వైభవ్ కథానాయకుడిగా తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. ఆయనతోపాటు సెల్‌మురుగన్ నటిస్తున్నారు. వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ స్థానిక తరమణిలోని ఎంజీఆర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహిస్తున్నారు.
కాగా దివంగత హాస్యనటుడు వివేక్ అబ్దుల్ కలాంను మార్గదర్శిగా తీసుకుని గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే ప్రయత్నంలో తమిళనాడులో వేలాది మొక్కలను నాటిన విషయం తెలిసిందే. కాగా నటుడు వివేక్ మూడో సంస్మరణ దినం సందర్భంగా ఆయన్ని గౌరవించేలా నటుడు వైభవ్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు, ఎంజీఆర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు కలిసి 100 మొక్కలను నాటినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.