
‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్’ని విజయ్ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్‌లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్‌పై జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్ శంకర్) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్‌కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్‌ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్ అండ్ హానెస్ట్‌తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‌గార్లకు తమిళ్ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.
సెట్స్‌లో షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. రాధామోహన్‌గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్‌కి వచ్చేవారు. విజయ్ కనకమేడలగారు క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్ చరణ్‌గార్లకు నేను బిగ్ ఫ్యాన్‌గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలతోపాటు సవాల్‌తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు.