ఆకాష్ మురళి, అదితి శంకర్(డైరెక్టర్ శంకర్ కూతురు) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.మరి సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
దియా(అదితి శంకర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అర్జున్(ఆకాష్ మురళీ). ఆమె చదువుతున్న కాలేజీలోనే చేరి.. ప్రేమ విషయాన్ని చెబుతాడు. మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినా..కొన్నాళ్లకు అర్జున్‌ని ఇష్టపడుతుది. ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తారు. అయితే జాబ్ విషయంలో తన కంపెనీ నుంచి పోర్చుగల్‌కి వెళ్లే అవకాశం వస్తుంది దియాకి. అర్జున్ కూడా వస్తానంటే.. నో చెబుతుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే.. పోర్చుగల్‌కి వెళ్లిన దియా.. ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. ఈ విషయం తెలిసి.. అర్జున్ పోర్చుగల్ వెళ్తాడు. ఎలాగైన ఈ కేసు నుంచి తన ప్రియురాలిని బయటపడేయాలనుకుంటాడు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? దియా ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేసింది? దియా కోసం పోర్చుగల్ వెళ్లిన అర్జున్‌కి తెలిసిన అసలు విషయం ఏంటి? హత్యకు గురైన వ్యక్తికి శరత్ కుమార్, ఖుష్బూలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు దియా, అర్జున్ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ప్రేమ కథలకు టాలీవుడ్‌లో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఇతర భాషలోని లవ్‌స్టోరీ మూవీస్ కూడా ఇక్కడ డబ్బింగ్ అతుంటాయి. ఇలా తమిళ్‌లో హిట్టయిన ప్రేమ కథే ‘ ప్రేమిస్తావా’. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో ఈ ప్రేమ కథను తీర్చి దిద్దారు. కథ ప్రజెంట్ నుంచి పాస్ట్‌లోకి వెళ్తుంది. ప్రైవేట్ కంపేనీలో ఉద్యోగం చేసే అర్జున్.. రియా అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే పోర్చుగల్ వెళ్లడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే గతంలో వీరిద్దరు ఎలా కలిశారు? ప్రేమలో ఎలా పడ్డారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేని రొమాంటిక్ వేలో యూత్‌ని ఆకట్టుకునేలా చూపించారు. ఫస్టాఫ్ అంతా వీరిద్దరి లవ్‌స్టోరీని చూపించి..సెకండాఫ్‌లో వారి మధ్య జరిగే ఘర్షణ, విడిపోవడానికి దారి తీసిన పరిస్థితలు చూపించారు. ద్వితియార్థం మొత్తం పోర్చుగల్‌లోనే సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అంత వరకు కథనం రొటీన్‌గా సాగినా.. క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తదనాన్ని అందిస్తుంది. ఎమోషన్స్ విషయంలో ఇకాంస్త దృష్టిపెట్టి.. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైన తెగించే యువకుడు అర్జున్ పాత్రలో ఆకాశ్ మురళి ఒదిగిపోయాడు. హీరోగా తొలి చిత్రమే అయినా.. కెమెరా ముందు ఆ విషయం తెలియకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక దియా పాత్రలో అదితి శంకర్ ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, ఖుష్బులు మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. దగ్గుబాటి రాజా, కల్కి కొచ్లిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా..తెరపై చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment