దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఆడియన్స్ను మెప్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో సినిమాలు చేయాలని చాలామంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక్కడ అవకాశం దక్కించుకుని, ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తున్న హీరోయిన్స్పై కథనం.
డబుల్ ధమాకా
కన్నడ ‘కేజీఎఫ్’ మూవీలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు హీరోయిన్ శ్రీనిధీ శెట్టి. ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి ప్రస్తుతం రెండు స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్ 3 (హిట్ 3)’. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృదులగా హీరోయిన్ పాత్రను శ్రీనిధీ శెట్టి చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది.
ఇక శ్రీనిధి ఓ హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘హిట్ 3, తెలుసు కదా’... ఇలా ఒకేసారి రెండు సినిమాలతో డబుల్æధమాకాగా శ్రీనిధీ శెట్టి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.
పదేళ్ల తర్వాత...
నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు వస్తున్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ . ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవికా మోహనన్ , నిధీ అగర్వాల్ హీరోయిన్స్గా చేస్తున్నారు. మాళవికాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో మాళవిక ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని తెలిసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ‘రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదని, కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన ఓ స్పోర్ట్స్ డ్రామా ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్)లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా చేయాల్సింది. 2019 వేసవిలో ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇలా... టాలీవుడ్‌కి మాళవిక రాక ఆలస్యమైంది.
రీమేక్‌తో ఎంట్రీ
ప్రముఖ తమిళ దర్శక–నిర్మాత శంకర్ కుమార్తె అదితీ శంకర్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ మూవీలో అదితీ శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్గా చేస్తున్నారు. కాగా అదితీ శంకర్‌కు ‘భైరవం’ తెలుగులో తొలి చిత్రం. డా. జయంతి లాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గత ఏడాది మేలో రిలీజైన తమిళ హిట్ మూవీ ‘గరుడన్ ’కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం’ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.
ఫౌజీకి జోడీగా...
స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మూవీ ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడం అనేది చిన్న విషయం కాదు. ఈ అవకాశం యంగ్ హీరోయిన్ ఇమాన్వీకి దక్కింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ అండ్ పేట్రియాట్రిక్ మూవీగా ‘ఫౌజి’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇమాన్వీకి ఫస్ట్ మూవీ ఇదే. హైదారాబాద్ శివార్లలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో ఇమాన్వీ పాల్గొంటున్నారు. ప్రభాస్, ఇమాన్వీలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇమాన్వీకి కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇమాన్వీ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ‘ఫౌజీ’ మూవీలో అవకాశం కల్పించారట.
కాంతార అమ్మాయి
కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ‘తమ్ముడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారని తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్ నటిస్తున్నారు.
లైలా మరో లీడ్ రోల్‌లో కనిపిస్తారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ శివరాత్రికి థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు’ సినిమా విడుదలపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.
మ్యూజికల్ మ్యాజిక్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘΄పొన్నియిన్ సెల్వన్ ’ మూవీలో ఐశ్వర్యా రాయ్ యంగ్ రోల్ చేసిన నటి సారా అర్జున్ గుర్తుండే ఉంటారు. ఈ యంగ్ హీరోయిన్ స్ట్రయిట్‌గా తెలుగులో చేస్తున్న మూవీ ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ డ్రామా మూవీలో సారా అర్జున్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.
కాలేజ్ ఫెస్టివల్ కోసం నలుగురు టీనేజర్లు ఓ ఒరిజనల్ సాంగ్‌ను కంపోజ్ చేయాలనుకునే ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశమని సమాచారం. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చు తుండటం విశేషం. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.
అచ్చ తెలుగు అమ్మాయి
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లోని సినిమాలతో ఇలియానా వంటి హీరోయిన్ ్స తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కాగా ఆయన డైరెక్షన్ లో రానున్న తాజా చిత్రంతో వీణా రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఈ మూవీని గీత నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన వీణా రావుకు కూచిపూడి డ్యాన్స్లోనూ ్రపావీణ్యం ఉందని, మేకర్స్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు.
ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ‘లైలా’ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ నెల 14న ‘లైలా’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆకాంక్ష. ‘తేరా యార్ హూ మై, కేసరి వీర్’ చిత్రాలతో పాటు దర్శకుడు మిలిప్ జవేరి డైరెక్షన్ లోని మరో మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ చిత్రాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇలా ఇటు తెలుగు అటు బాలీవుడ్‌లో ఒకే టైమ్‌లో ఆకాంక్ష ఎంట్రీ ఖరారు కావడం విశేషమనే చెప్పుకోవాలి.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న హీరోయిన్స్ మరికొందరు ఉన్నారు. ఇంకొంత మంది హీరోయిన్స్ తెలుగుకు వచ్చేందుకు కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment