సాక్షి, నల్గొండ: కేటీఆర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 అంతస్తుల భవనాలకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఎవరేం పాపాలు చేశారో వారి ఆత్మలకు తెలుసు. ఒకసారి పరిశీలన చేసుకోవాలంటూ గుత్తా వ్యాఖ్యానించారు.
‘‘మూసీ ప్రక్షాళనకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో రేవంత్ దోచుకుంటున్నారనడం తగదు. నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు’’ అని గుత్తా హితవు పలికారు.
అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. అలా ప్రదర్శిస్తే మొన్నటి ఎన్నికల్లో ఏమైంది? మీ స్వార్థం కోసం ౫౦ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు. మీరు చేస్తే సుందరీకరణ అవతలోడు చేస్తే దోచుకోవడమా? రూ. 16500 కోట్లతో మూసీ సుందరీకరణ కు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ కాదా? దేశభద్రత కు ఉపయోగపడే రాడార్ ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా?. రాడార్ విషయంలో జీవోలు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా?’’ అంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.
మూసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన వద్దని చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే దోమలే లోపలికి పోతాయి. నది గర్భంలో ఉన్న ఇళ్లను తొలుత తొలగించాలి. యాభై అంతస్తులు కట్టే వారంతా మట్టిని తవ్వి మూసీలోనే పోస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల జరిగే నష్టం, సెల్లార్లలో తీసిన మట్టి ఎటుపోతుందనేది కూడా హైడ్రా దృష్టి పెట్టాలి’’ అంటూ గుత్తా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment