V. Hanumanta Rao
-
బీసీ ఓట్ల కోసమే కేసీఆర్ రాజకీయం
మాజీ ఎంపీ వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: బీసీల ఓట్లకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వల వేస్తున్నాడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలు, చేపలు అంటూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయానికి దిగుతున్నాడని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేల్కొనాలని సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని సభకు ఆహ్వానించాలని కోరారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం బీసీ రిజర్వేషన్లపై న్యాయం జరగదని అన్నారు. దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు కూడా హాజరుకాకపోవడం దారుణమన్నారు. ఇది దళిత జాతిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. -
అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులు కోరకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సమగ్రసర్వేలో నమోదైన బీసీ జనాభాను కులాలవారీగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించాలని, అందుకు అనుగుణంగా అవకాశాలను కల్పించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు, బీసీ కమిషన్‌కు లేఖ రాసినట్టుగా తెలిపారు. -
'ఉద్యమాన్ని అణిచేందుకే పవన్ తెరపైకి'
హైదరాబాద్: కాపు ఉద్యమాన్ని అణిచివేసేందుకే జననేత అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై స్పందించని పవన్ ఇంతకాలం ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పవన్‌కు తెలియదా అని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్.. కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ను తిట్టినా, కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినా ఊరుకోమని వీహెచ్ హెచ్చరించారు. -
ఆర్మీలో పనిచేసిన గట్టివాడు ఉత్తమ్
ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: అరెస్టులు చేస్తామంటే ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భయపడరని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తుంటే తెలంగాణలో సీఎం కేసీఆర్, తమిళనాడులో సీఎం జయలలిత కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జైలుకు పోవడం కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదని, ఒక్కరిని అరెస్టు చేస్తే లక్షల మంది కార్యకర్తలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయారని గుర్తుచేశారు. మహారాష్ట్రకు లాభం చేసే ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఇక్కడ సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమన్నారు. ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలేయండి: మల్లు రవి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసం, అబద్ధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అసహనంతో కాంగ్రెస్‌పార్టీ నేతలను సన్నాసులని తిట్ల పురాణానికి దిగుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించే ఓపిక లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. -
స్వార్థ రాజకీయాలకు ‘బంగారు’ ముసుగు
రాజ్యసభ సభ్యుడు వీహెచ్ సాక్షి, హైదరాబాద్: స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారుతున్నవారంతా బంగారు తెలంగాణ అంటూ ముసుగు వేసుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ ఈ రెండేళ్లలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తాగండి, తినండి, పనిచేయకండి అనే రీతిలో ప్రభుత్వం పనితీరు ఉందన్నారు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాలను విస్తృతం చేశారన్నారు. కేసీఆర్ వాగ్దానాలు, వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల నుంచి తప్పుకుంటానన్న జానారెడ్డి ప్రకటనతో కార్యకర్తలు ఐధైర్యపడతారన్నారు. -
వారి చర్య మాతృద్రోహం
గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్‌రావులపై వీహెచ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నంతకాలం పదవులను అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీపై నిందలు వేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్న గుత్తా, వివేక్, వినోద్, భాస్కర్రావులది మాతృద్రోహమని ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతర్గత ప్రజాస్వామ్యం కేవలం కాంగ్రెస్ లోనే ఉందని, టీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎంతుందో త్వరలోనే వారికి తెలుస్తుందన్నా రు. పార్క్ హయత్ పక్కన ఉన్న స్థలాన్ని దక్కించుకోవడానికి వివేక్, వినోద్, సాగునీటి పనుల కాంట్రాక్టుల కోసం గుత్తా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. గుత్తా విలువ లు, ఆత్మను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేకు న్నా ఎంపీ టికెట్ వచ్చే లా సహకరించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డిలకు ద్రోహం చేసి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ మారడం వ్యభిచారంతో సమానమని చెప్పిన గుత్తా ఇప్పుడు ఎలా మారుతున్నారన్నారు. దమ్ముంటే ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేసి పోటీ చేయాలని వీహెచ్ సవాల్ విసిరారు. పార్టీ మారే నాయకులు పందికొక్కులకన్నా ప్రమాదకరమని, వారి అసలు స్వరూపం కేసీఆర్‌కు కూడా త్వరలోనే తెలుస్తుందని వీహెచ్ హెచ్చరించారు. పదవులకు రాజీనామా చేయాలి... కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్లో చేరనున్న ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ వెంటనే పదవులకు రాజీనామా చేయాలని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, పదవుల కోసమే వారు పార్టీలు మారుతూ బంగారు తెలంగాణ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ మారడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మోసం చేయడమేనన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నా రు. మిషన్ భగీరథ అక్రమాలపై 120 కిలోల పేపర్లను సేకరించిన గుత్తా టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. -
మీరు తెలంగాణ పై దృష్టిపెట్టండి: మాదాసు గంగాధరం
- వీహెచ్ కు ఏపీసీసీ ఉపాధ్యక్షుడి సలహా - పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంతో ముడిపెట్టదన్న గంగాధరం హైదరాబాద్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమంలోకి లాగవద్దని తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంత రావుకు ఏపీ సీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు ఉద్యమం కేవలం ముద్రగడ కుటుంబ సమస్య కాదని అన్నారు. కాగా.. వీహనుమంత రావు సీనియర్ ఎంపీగా పనిచేశారని.. ఆయన తెలంగాణ శ్రేయస్సుపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి.. పవన్ కళ్యాణ్ ను కాపు ఉద్యమానికి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని అన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదని, ఆంధ్ర ప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందన్నారు. ముద్రగడ దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నాటకీయ పరిణామాల మధ్య వీహెచ్ అరెస్టు
రాజమహేంద్రవరం క్రైం : రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావును, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఓ ప్రముఖ హోటల్లోనుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముద్రగడను కలిసి తీరుతానని భీష్మించిన వీహెచ్‌ను, హర్షకుమార్‌ను, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కొత్త సీతారాములును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. ముందుగా వీహెచ్ హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో కొవ్వూరు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ ఆయనను కారులో తీసుకువచ్చారు. ఉదయం టిఫిన్ చేసేందుకు కిందకు దిగిన సమయంలో ఆయన పోలీసుల కంటపడడంతో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసి హనుమంత రావును ముద్రగడ పద్మనాభాన్ని కలవకుండా అడ్డుకున్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో హర్షకుమార్ తనయుడు జి.వి శ్రీరాజ్, రాజమహేంద్రవరం సిటీ కాపు యువత నాయకులు అడపా రాజు, రాజమహేంద్రవరం రూరల్ కాపు యువత నాయకులు పసుపులేటి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారమే
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఒకప్పుడు నాయకులు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండేవారు. ఒకే నాయకుడిని నమ్ముకునేవారు. ఇప్పుడు బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు. పొద్దునో షర్టు.. రాత్రికో షర్టు.. అన్నట్టుంది పరిస్థితి. పార్టీలు మారడమంటే రాజకీయ వ్యభిచారం చేసినట్టే..’’ అని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన ఫారూఖ్ హుస్సేన్ టీఆర్ఎస్లో చేరడం బాధాకరమన్నారు. అలాగే తొలి నుంచీ కాంగ్రెస్‌లో లేని పువ్వాడ అజయ్ కుమార్‌ను పిలిచి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఆయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయారన్నారు. పార్టీ వరుస ఓటములపై సమీక్షించాలని పీసీసీ నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని పదేపదే కోరినా దిగ్విజయ్‌సింగ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి పట్టించుకోలేదని వీహెచ్ విమర్శించారు. ఇప్పటికైనా అందరం ఏకతాటిపై నిలిచి చర్చించుకుంటే సమస్య తీరుతుందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటివి జరిగితే మధ్యవర్తులు ఉండేవారని, ఇప్పుడు మధ్యవర్తులూ లేరన్నారు. తప్పులను సమీక్షంచుకోవడం మంచి పద్ధతని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపించిందని అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీ ఉన్నా అందులోనే సమన్వయం లేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడుగురితోనే సమన్వయ కమిటీ ఉండేదని, ఇప్పుడు 31 మంది ఉన్నా పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. -
సోనియాతో వీహెచ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని శనివారం ఆమె నివాసంలో కలిశారు. వచ్చే జూన్‌లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లి సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో ఓబీసీ రిజర్వేషన్లపై పోరాడానని, పదవిలో ఉన్నా, లేకున్నా బీసీల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తానని వివరించారు. పార్టీ అభివృద్ధి కోసం ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లపై పోరాడతానని చెప్పారు. వీహెచ్ వెంట భార్య చంద్రకళ, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వలసపోవడంపై టీపీసీసీ, సీఎల్పీ సీరియస్‌గా తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో, వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటనే అంశాలపై పార్టీ సీనియర్లతో చర్చించాలన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టి సారించాలని కోరారు. -
రైతుల కన్నా ఎమ్మెల్యేలే ముఖ్యమా?
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలను పెంచడం ఎంతవరకు సబబు అని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం మాట్లాడుతూ.. తీవ్రమైన కరువు, రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రజాప్రతినిధుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను హర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రాజీవ్ సేవలను ప్రచారం చేయాలి
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఖమ్మం: భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న ఖమ్మంలో ఆవిష్కరించే రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ భారత ప్రధానిగా పనిచేసిన కాలం స్వర్ణయుగం అన్నారు. టెలీకం, శాస్త్రీయ రంగంలో ప్రపంచదేశాల్లోనే భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆయన కాంస్య విగ్రహాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఖమ్మంలో 21న చేపట్టే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్ల య్య హాజరవుతారని తెలిపారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన రాజీవ్‌గాంధీ సేవలను కొనియాడాల్సిన అవస రం ఉందన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వా డ అజయ్‌కుమార్ మాట్లాడుతూ వి ద్య, వైజ్ఞానిక రంగాల్లో రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కొత్తా సీతారాములు, ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, శేఖర్, బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. -
నల్లడబ్బు, వదలని జబ్బు!
జస్టిస్ జీవన్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసి, నివేదికను నేరుగా తమకే అందచేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. నల్లధనం విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆ బృందం అభిప్రాయపడింది. నల్లధనం వెలికితీతకు బీజేపీ ప్రభుత్వం తాజాగా కమిటీని నియమించింది. ఇది కొత్త ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఈ 67 సంవత్సరాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు కమిటీ లను నియమించింది. అవి నివేదికలు ఇవ్వడం, వాటిని అటకెక్కించడం మామూలైపోయింది. ఆ కమిటీల సిఫారసులు అమలు పరిస్తే ఎంతోమంది పార్టీ నాయకుల, మంత్రుల తలలు తెగిపడవలసి వస్తుందని కాంగ్రెస్ భయం. అయితే పలువురు ప్రజా నాయకులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రతి పక్షాలు ఆందోళన చేయడంతో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు, 2012లో కాబోలు, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అది భారతీయులు విదేశాల్లో, ముఖ్యంగా స్విస్ బ్యాం కుల్లో దాచుకున్న సంపద గురించి మాత్రమే. రాజే అవినీతిపరుడైతే..... దేశంలో ఎన్ని లక్షల కోట్ల నల్లధనం ఉందో మొన్నటి ఎన్నికల్లో వెల్లడైంది. అభ్యర్థులందరూ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారంటూ పత్రికల్లో వచ్చిన లెక్కలు అంచనాలే. అదంతా నల్లధనమే. ఈ నల్లధనం గురించి ప్రభుత్వాలు ఎందుకు కమిటీలు వెయ్యవు? కేంద్రప్రభుత్వం దేశంలో ఉన్న నల్లధనం గురించి కూడా ఒక కమిటీని నియమించాలి. బీజేపీ ప్రభుత్వం నియమించిన కమిటీ విదేశాల్లో చట్టరీత్యా, చట్ట వ్యతిరేకంగా దాచిన నల్లధనం గురించినదే. ఈ నల్లధనం విలువ ఎంతో వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లెక్కలు విడుదల చేశాయి. ఫిబ్రవరి, 2012లో సీబీఐ డెరైక్టర్ ఇచ్చిన గణాంకాల ప్రకారం విదేశాల్లో దాచిన నల్లధనం విలువ 500 బిలియన్ డాలర్లు. ఇతర అన్ని దేశాల వారి కన్న భారతీయులే ఎక్కువ ధనం దాచుకొన్నారని స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ అధికారులు 2011లోనే చెప్పారు. అయితే ఆ అధికారులే ఇవి తప్పుడు లెక్కలన్నారు గానీ, నిజమైన లెక్క చెప్పలేదు. 2011లో హెచ్ఎస్బీసీలో అకౌంట్లు ఉన్న 782 మంది పేర్లు ప్రభుత్వానికి చేరాయని, వాటిని వెల్లడించబోమని ప్రభుత్వం చెప్పింది. అయితే ఒక శ్వేత పత్రాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం స్విస్ ప్రభుత్వం నిర్ధారించిన లెక్కల ప్రకారం భారతీయులు స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం 22.95 బిలియన్ రూపాయలు. భారతీయులు నల్ల ధనాన్ని ఒక్క స్విస్ బ్యాంకులోనే కాదు, ఇంకొన్ని చిన్నచిన్న దేశాల్లో కూడా దాచి పెడుతున్నారు. స్విస్ బ్యాంకు సహా, ఇలాంటి దేశాల్లో దాచిన నల్లధనం విలువ అంచనా 500 బిలియన్ డాలర్లని సీబీఐ డెరైక్టర్ ఫిబ్రవరి 2012లో వెల్లడించారు. అప్పుడే ఒక సందర్భో చితమైన సామెతను ఉటంకించారు. ‘రాజు అవినీతిపరుడైతే, ఆ దేశ ప్రజలు కూడా అంతే’. సుప్రీంకోర్టు మండిపాటు విదేశాల్లో నల్లధనాన్ని దాస్తున్న భారతీయుల పేర్లను బహిర్గతం చేయరాదని ప్రభుత్వం తీసుకున్న వైఖరిపై మాజీ న్యాయశాఖ మంత్రి, ఇతరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి పేర్లు ఎందుకు ప్రకటించడం లేదని జనవరి, 2011న సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఓ ఆరు నెలలు ఆగి, జస్టిస్ జీవన్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రత్యేక పరిశోధనా బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, నివేదికను నేరుగా తమకే అందచేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. నల్లధనం విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నదని ఆ బృందం అభిప్రాయపడింది. అధికారంలో ఉండి, డబ్బు చేసుకొని విదేశ బ్యాంకుల్లో దాచింది కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, వారిని బలపరిచే వ్యాపార, కార్పొరేట్లే. మరి, కాంగ్రెస్ తన కంటిని తానే పొడుచుకొంటుందా? అయినా సుప్రీంకోర్టు ఆదేశాన్ని కాదనలేరు. జర్మనీ ప్రభుత్వం పంపిన 26 మంది పేర్లను మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. తేనెతుట్టెను కదల్చడం ఇష్టం లేకనే! జస్టిస్ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు నల్లధనం వ్యవహారంలో ప్రభుత్వం ఎం త మెతక వైఖరినవలంబిస్తున్నదో గుర్రాల వ్యాపారి హసన్ అలీ వ్యవహారం చూస్తే తెలుస్తుంది. విదేశీ బ్యాంకుల్లో 380 బిలియన్ డాలర్లు దాచినట్లు వెల్లడై దేశ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అతన్ని అరెస్టు చేసింది. ఎప్పుడో 2007లోనే ఆదాయపు పన్ను శాఖ అతని ఇంటి మీద దాడిచేసింది కూడా. అయితేనేం, ప్రభుత్వం తదనంతరం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోలేదు. ఇటీవలే ఈ ఫైల్ కదిలిందని వార్త. ఇలాంటి నేరాల పరిశోధనకు ఒకటి రెండూ కాదు, కేంద్ర పరిధిలోనే సుమారు పది సంస్థలున్నాయి. అయితే, ఒకస్థాయి అధికారులు, మంత్రుల విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా, కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఒకవేళ విచారణకు అనుమతిస్తే, లేని తుట్టెను కదిలించినట్లవుతుంది. అందుకనే అంతా గప్‌చుప్. అధికార పార్టీల బండారం ఏ విషయం గురించైనా ప్రజల ఒత్తిడి మేరకో, తక్షణ చర్య తీసుకోవాల్సి వస్తే నో, ఆ సమస్య పరిష్కారం దిశగా ఓ కమిటీ వేయటం ప్రభుత్వాల అలవా టు. ఆ కమిటీ ఓ నివేదికను సమర్పిస్తుంది. పరిశీలిస్తున్నాం అంటుంది ప్రభు త్వం. ప్రజలు మరచిపోతారు. ఫైలు అటకెక్కుతుంది. ఆ కోవలోనిదే జూన్ 2011న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ అధిపతి ఎం.సి. జోషి నాయక త్వంలో నియమించిన కమిటీ. ఇది జనవరి 2012న నివేదికను అందజేసింది. ఆ కమిటీ కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టింది. ఈ రెండు పార్టీలు ఎన్నికలలో రూ.1,000-1,500 కోట్లు ఖర్చు చేస్తాయి. కానీ, అధికారికంగా చూపించే వ్యయం కాంగ్రెస్ రూ. 500 కోట్ల్లు, బీజేపీ రూ. 200 కోట్లు. నేరం రుజువైతే చట్టంలో ఉన్న శిక్షా కాలాన్ని పెంచాలి. ఒక జాతీయ పన్నుల ట్రిబ్యునల్‌ను నియమించాలి. ఇలాంటి కొన్ని సూచనలు చేసినా, చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం కూడా పన్ను రేటు పెంచితే దొంగదారులు వెతుకుతారని, తగ్గిస్తే ప్రభుత్వ నియమాలు పాటిస్తారని చెప్పింది. ఇది కార్పొరేట్లు, బడా వ్యాపార సంస్థలకు అను కూలం. మొదట్లో పన్నురేటు సుమారు 80 శాతం ఉండగా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించే వారి ఒత్తిడి మేరకు సుమారు 30 శాతానికి తగ్గించింది. అయినా నల్లధనం పేరుకు పోతూనే ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నల్ల ధనం మోత బాగా వినబడుతోంది. ఇవి శ్వేతపత్రం సూచనలు. ఈ సూచ నలు నల్లధనం సృష్టిని నిరోధించగలవా? ‘నల్లధనం నిల్వలను స్వచ్ఛం దంగా ప్రకటించండి, మినహాయింపులిస్తాం!’ అని ఇదివరకో ప్రభుత్వం చెబితే, దానికి స్పందన దాదాపు శూన్యం. ఇదీ క్లుప్తంగా నల్లధనం నేపథ్యం. అక్షింతల మీద అక్షింతలు విదేశాల్లో నల్లధనం దాచుకొన్న వారిని రక్షించడానికి కాంగ్రెస్ నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాలు, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా వ్యవహరించినందుకు ఫలితమే 2014 ఎన్నికల్లో ప్రజ లిచ్చిన తీర్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన ఈ తీరు మీదే ఇటీవల సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. జూలై 2011లోనే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి నల్లధనాన్ని వెనక్కు రప్పించమని ఆదేశించినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. పైగా ‘సిట్’ ఏర్పాటు ఆదేశాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అప్పుడే ‘నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తే ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవచ్చు. తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అలాగే ‘మీరు విఫలమైతే కోర్టు ఆ పని చేయాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది కూడా. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో! సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత బీజేపీ ప్రభుత్వానికి మరోదారి లేక సిట్ ఏర్పాటును వెంటనే ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ను చావగొట్టడానికి బీజేపీ ప్రభుత్వానికి అంది వచ్చిన ఆయుధమిది. ఎటొచ్చీ విదేశాల్లో నల్లధనం దాచిన వారిలో కార్పొరేట్ సంస్థలున్నాయి. వాళ్లు కోట్లు ఖర్చు పెట్టి వారి అభ్యర్థిని ప్రధానిగా గెలిపించుకున్నారు. సిట్ తాను ఇవ్వబోయే తీర్పులో ఆ కార్పొరేట్ల పేర్లను ఉదహరిస్తే ప్రధాని ఏం చేస్తారో చూడాలి. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) వి.హనుమంతరావు -
నాడు అంజయ్య.. నేడు హనుమన్న
కాంగ్రెస్ పార్టీ, అందులోనూ గాంధీ కుటుంబం ప్రతిసారీ తెలుగు నాయకులను, పార్టీకి వీర విధేయులుగా ఉన్నవాళ్లను తీవ్రంగా అవమానిస్తూనే ఉంది. పదహారణాల కూలీని అని గర్వంగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో అప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేని రాజీవ్ గాంధీ తోసి పారేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న వి.హనుమంతరావు (వీహెచ్)కి కూడా సరిగ్గా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా రాహుల్ గాంధీ పాల్గొంటున్న సభా వేదికపైకి ఆయనను పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్‌కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్‌ను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకొని, ఓ పక్కన మౌనంగా నిలబడిపోయారు. రాహుల్ గాంధీయే తలచుకుంటే వీహెచ్ లాంటి నాయకులకు వేదికపైకి అనుమతి లభించడం పెద్ద కష్టం కాదు. కానీ, రాహుల్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని వీహెచ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గాంధీ కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరికీ వీహెచ్ బాగా పరిచయం అని చెబుతారు. అంత సన్నిహిత సంబంధాలున్న నాయకుడిని కూడా ఇప్పుడు కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేశారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వీహెచ్ వ్యాఖ్యలతో దుమారం
చేవెళ్ల, న్యూస్‌లైన్: తన నోటి దురుసుతో వార్తల్లో ఉండే రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవకాశాల్లో సగం అడగడం కాదు.. సమావేశాలకు మహిళలు హాజరుకావాలంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వేదికపైనుంచే రంగారెడ్డి జిల్లా డీసీసీ మహిళా అధ్యక్షురాలు సదాలక్ష్మికి ఎన్నికల్లో టికెట్ రాదంటూ జోస్యం చెప్పడం అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం సోనియాగాంధీ అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో పలువురి తర్వాత తన ప్రసంగం మొదలుపెట్టిన వీహెచ్.. సోదర, సోదరీమణులంటూ ప్రారంభించారు. ఇక్కడ సోదరి ఒక్కతే ఉందంటూ సదాలక్ష్మిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘మహిళలు తమకు టికెట్లు కావాలంటారు... సభలకేమో ఒక్కరో ఇద్దరో వస్తారు. ఈ రోజు సదాలక్ష్మి ఒక్కరే సభకు వచ్చారు. ఏవమ్మా.. నీవు తప్ప మహిళలెవరూ కనిపించడంలేదు(వ్యంగ్యంగా). ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అని నినదిస్తారు.. అలాంటప్పుడు సమావేశాలకు కూడా సగం మంది మహిళలు రావాలి. నీవు ఒక్కదానివి వచ్చి ఎంత గొంతెత్తి అరిచినా నీకు టికెట్ రాదు(సదాలక్ష్మి వైపు చేయి చూపిస్తూ).. కాంగ్రెస్‌పార్టీ ఇవ్వద్దు. పదిమంది వెంట ఉంటేనే నాయకులమనిపించుకుంటాం. ఒక్కరం వస్తే ఎవరూ గుర్తించరు, గుర్తుపట్టరు. నీకు టికెట్ రానేరాదు’ అని వ్యాఖ్యానించారు. నిండు సభలో డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిని అంతచులకనగా మాట్లాడటంతో నాయకులంతా నివ్వెరపోయారు. మహిళలను గౌరవించే తీరిదేనా.. వీహెచ్ వ్యాఖ్యలపై సదాలక్ష్మి మండిపడింది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సభ ముగిసి వీహెచ్ వేదిక దిగుతుండగా ఆమె తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని గమనించిన క్యామ మల్లేష్ తదితరులు ఆమెను సముదాయించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఏదో పెద్దమనిషి అలా అన్నారు.. తప్పుపట్టొద్దంటూ బతిమిలాడటం కనిపించింది. అయినా శాంతించని సదాలక్ష్మి విలేకరుల వద్దకు వచ్చి మాట్లాడుతూ.. హనుమంతరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. తాను ప్రతి సమావేశానికి వందలాది మంది మహిళలతో వెళ్తానని చెప్పారు. చేవెళ్లలో సమావేశం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకురాలు తెలియజేయడంతో కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో సభకు వస్తే హనుమంతరావు ఇలా అవమానిస్తారా అని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో పాల్గొన్న నాయకులు కూడా వీహెచ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.