వీహెచ్ వ్యాఖ్యలతో దుమారం | v.hanumantha rao Insult to ladies | Sakshi
Sakshi News home page

వీహెచ్ వ్యాఖ్యలతో దుమారం

Published Fri, Mar 14 2014 11:13 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

v.hanumantha rao Insult to ladies

చేవెళ్ల, న్యూస్‌లైన్:  తన నోటి దురుసుతో వార్తల్లో ఉండే రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవకాశాల్లో సగం అడగడం కాదు.. సమావేశాలకు మహిళలు హాజరుకావాలంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వేదికపైనుంచే రంగారెడ్డి జిల్లా డీసీసీ మహిళా అధ్యక్షురాలు సదాలక్ష్మికి ఎన్నికల్లో టికెట్ రాదంటూ జోస్యం చెప్పడం అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం సోనియాగాంధీ అభినందన సభ ఏర్పాటుచేశారు.

 ఈ సభలో పలువురి తర్వాత తన ప్రసంగం మొదలుపెట్టిన వీహెచ్.. సోదర, సోదరీమణులంటూ ప్రారంభించారు. ఇక్కడ సోదరి ఒక్కతే ఉందంటూ సదాలక్ష్మిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘మహిళలు తమకు టికెట్లు కావాలంటారు... సభలకేమో ఒక్కరో ఇద్దరో వస్తారు. ఈ రోజు సదాలక్ష్మి ఒక్కరే సభకు వచ్చారు. ఏవమ్మా.. నీవు తప్ప మహిళలెవరూ కనిపించడంలేదు(వ్యంగ్యంగా). ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అని నినదిస్తారు.. అలాంటప్పుడు సమావేశాలకు కూడా సగం మంది మహిళలు రావాలి. నీవు ఒక్కదానివి వచ్చి ఎంత గొంతెత్తి అరిచినా నీకు టికెట్ రాదు(సదాలక్ష్మి వైపు చేయి చూపిస్తూ).. కాంగ్రెస్‌పార్టీ ఇవ్వద్దు. పదిమంది వెంట ఉంటేనే నాయకులమనిపించుకుంటాం. ఒక్కరం వస్తే ఎవరూ గుర్తించరు, గుర్తుపట్టరు. నీకు టికెట్ రానేరాదు’ అని వ్యాఖ్యానించారు. నిండు సభలో డీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిని అంతచులకనగా మాట్లాడటంతో నాయకులంతా నివ్వెరపోయారు.

 మహిళలను గౌరవించే తీరిదేనా..
 వీహెచ్ వ్యాఖ్యలపై సదాలక్ష్మి మండిపడింది. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సభ ముగిసి వీహెచ్ వేదిక దిగుతుండగా ఆమె తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని గమనించిన క్యామ మల్లేష్ తదితరులు ఆమెను సముదాయించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఏదో పెద్దమనిషి అలా అన్నారు.. తప్పుపట్టొద్దంటూ బతిమిలాడటం కనిపించింది. అయినా శాంతించని సదాలక్ష్మి విలేకరుల వద్దకు వచ్చి మాట్లాడుతూ.. హనుమంతరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. తాను ప్రతి సమావేశానికి వందలాది మంది మహిళలతో వెళ్తానని చెప్పారు. చేవెళ్లలో సమావేశం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకురాలు తెలియజేయడంతో కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో సభకు వస్తే హనుమంతరావు ఇలా అవమానిస్తారా అని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో పాల్గొన్న నాయకులు కూడా వీహెచ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement