సోనియా సభ.. అభ్యర్థులకు క్షోభ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న’ చందంగా సోనియా సభ ఇద్దరు నేతల రాజకీయ భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. అధినేత్రి రాకతో ఓట్లు రాల్చుకోవచ్చనే ఆశించిన సదరు అభ్యర్థులు.. గెలుపు వాకిట బోల్తా పడడమేకాకుండా చివరకు అన ర్హత వేటును తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి దాపురించింది. ఏప్రిల్ 27న చేవెళ్లలో జరిగిన భారీ బహిరంగసభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు.
అధినేత్రి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం భారీగా జనసమీకరణ చేపట్టింది. సభను విజయవంతం చేసేందుకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేసింది. సుమారు 700పైగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని జనాలను సభకు తరలించింది. కేవలం దీని కోసమే రూ.85 లక్షలను ఆర్టీసీకి చెల్లించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే రూ.28 లక్షలు, ఎంపీ రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయడానికి లేదు. అయితే, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొనే సభల వ్యయం విషయంలో కొన్ని సడలింపులున్నాయి. ఈ భరోసాతోనే బస్సుల అద్దెలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెల్లించింది.
అసలేం జరిగిందంటే..
స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే సభల నిర్వహణా వ్యయాన్ని అభ్యర్థుల లెక్కలో చూపకుండా మినహాయింపు ఉంది. అదే సమయంలో సదరు నేత తన ప్రసంగంలో అభ్యర్థుల పేర్లను ఉచ్చరించినా, ఓటర్లకు పరిచయం చేసినా, వేదిక ప్రాంగణంలో అభ్యర్థుల పోస్టర్లు ప్రదర్శించినా ఎన్నికల వ్యయంలో కొంత నిష్పత్తిని సదరు అభ్యర్థి ఖాతాలో జమచేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చేవెళ్లలో జరిగిన సోనియాగాంధీ సభ వీడియో పుటేజీని నిశితంగా పరిశీలించిన వ్యయ పరిశీలకులు.. ప్రచార సభ ఖర్చును రూ. కోటిగా తేల్చారు.
ఈ మొత్తాన్ని అభ్యర్థుల పద్దులో చేర్చాల్సివుంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల అభ్యంతరంతో ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. వ్యయ పరిశీలకుడి అభిప్రాయంతో ఏకీభవించిన ఈసీ.. సభ వ్యయాన్ని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులందరి ఖాతాలో జమచేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల సమర్పించిన లెక్కలను మదింపు చేసిన పరిశీలకులు.. ఆ రోజు సభలో పాల్గొన్న సభ్యుల ఖాతాలో రూ.14.30 లక్షల చొప్పున జమ చేశారు. శేరిలింగంపల్లి అభ్యర్థి భిక్షపతియాదవ్ సభకు రాకపోవడంతో ఈ వాతను తప్పించుకున్నారు. ఎంపీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి సహా మిగతా ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థుల పద్దులో ఈ లెక్కను చూపారు.
ప్రసాద్, మల్‌రెడ్డికి చిక్కులు?
చేవెళ్ల సభ పరిణామాలను ముందుగా ఊహించని కాంగ్రెస్ అభ్యర్థులిద్దరిని తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల వ్యయాలను సమర్పించలేదనే కారణంతో కొన్నేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని 9 మంది అభ్యర్థులు ఇప్పటికే కోల్పోయారు. వీరిలో వికారాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగిన మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధినేత్రి సోనియా ఎన్నికల ఖర్చును తమ ఖాతాలో జమ చేయడంతో మరో ఇద్దరికి కష్టం కాలం వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లు ప్రసాద్‌కుమార్, మల్‌రెడ్డి రంగారెడ్డిల ఎన్నికల వ్యయ పరి మితి మించిపోయింది. నిర్దేశిత రూ.28 లక్షల్లో కేవలం రూ.14-18 లక్షల వరకు చూపిన వ్యయానికి ఎన్నికల పరిశీలకులు ఓకే చేసినప్పటికీ, సోనియా సభ ఖర్చును వీరి ఖాతాలోకూడా కొంత మొత్తా న్ని జమచేయడం వీరికి క్షోభను మిగిల్చింది. చేవెళ్ల సభ వ్యయం విషయంలో అనుసరించాల్సిన పద్ధతిపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరిగిన కమిటీ చర్చించింది.
అనంతరం ఈ సభ వ్యయాన్ని సమంగా లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులకు పంచాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే ఎంతో కొంత ఖర్చు పెట్టిన వీరికి, ఈ వ్యయం జమ కావడం పరిమితి దాటినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ప్రజాప్రతినిథ్య చట్టం 1951 సెక్షన్ 77 ప్రకారం మూడు నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదని అధికారవర్గాలు అంటున్నాయి. ఈసీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ ఈ తరహా కేసులో అనర్హత వేటు పడలేదని, అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని స్పష్టంచేశాయి. వ్యయ వివరాలను నేడోరేపో ఈసీఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచే అవకాశం ఉందని ఓ ఎన్నికల అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు అధికారులు నిరాకరించారు.