మాజీ 'హోం' వారసుల ఓటమి....
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కీలక నేతల వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన యువనేతలకు నిరాశే మిగిలింది. తమ కుటుంబ పెద్దలు ప్రజలకు చేసిన మేలు.. యువతలో ఉన్న ఇమేజీపై ఆశలతో ఎన్నికల బరి లోకి దిగినప్పటికీ చేదు అనుభవమే ఎదురైంది. చేవెళ్ల పార్లమెంటు బరిలో దిగిన ఇరువురు వారసులకు ఇదే పరిస్థితి కనిపించింది. రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి ఇంద్రారెడ్డి, సబితారెడ్డిల కుమారుడు కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రితో పాటు పలు కీలకపదవులు చేపట్టిన తూళ్ల దేవేందర్‌గౌడ్ పెద్ద కుమారుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ టీడీపీ తరపున బరిలోకి దిగారు. పార్టీ క్యాడర్‌తో రంగంలోకి దిగిన ఇరువురు కుటుంబ పెద్దల పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు.
దాదాపు తమకు గెలుపు ఖాయమని భావించిన ఇరువురికి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఘోరపరాజయం ఎదురైంది. మరోవైపు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బండారు లక్ష్మారెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడైన లక్ష్మారెడ్డి.. ఈసారి అన్న రాజిరెడ్డి పోటీనుంచి తప్పుకోడంతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. చివరకు బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు.