ఆర్మీలో పనిచేసిన గట్టివాడు ఉత్తమ్
ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు
సాక్షి, హైదరాబాద్: అరెస్టులు చేస్తామంటే ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భయపడరని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తుంటే తెలంగాణలో సీఎం కేసీఆర్, తమిళనాడులో సీఎం జయలలిత కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జైలుకు పోవడం కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదని, ఒక్కరిని అరెస్టు చేస్తే లక్షల మంది కార్యకర్తలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలంటూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయారని గుర్తుచేశారు. మహారాష్ట్రకు లాభం చేసే ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ఇక్కడ సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమన్నారు.
ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలేయండి: మల్లు రవి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసం, అబద్ధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అసహనంతో కాంగ్రెస్‌పార్టీ నేతలను సన్నాసులని తిట్ల పురాణానికి దిగుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించే ఓపిక లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్‌కు సూచించారు.