
మరో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఆసియాగా హైదరాబాద్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బిల్డర్ల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో బిల్డర్లు ఎప్పటికీ భాగస్వాములుగానే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. బిల్డర్లకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు. హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో ఆదివారం జరిగిన సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ (సీబీఏ) తొలి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి నుంచి ప్రతీ బిల్డర్ ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి బిల్డర్లు కృషి చేయాలని సూచించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్‌రింగ్ రోడ్డు, కృష్ణా–గోదావరి జలాల తరలింపు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం ఈ అభివృద్ధిని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రజా రవాణా మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ అభివృద్ధి ఇందులో భాగమేనని వివరించారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు సరైన, సమర్థవంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ను మరో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఆసియాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.