హైదరాబాద్: అద్దె వివాదంలో ఇంటి యజమానిపైకి ట్రాన్స్ జెండర్లతో పాటు రౌడీలను పంపించి దౌర్జన్యానికి దిగిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో నివాసం ఉంటున్న మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇందుకూరి నిర్మలాదేవికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనక భవనం ఉంది. ఈ భవనాన్ని గత ఏడాది జూన్‌లో ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీకి లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
ముందుగానే అడ్వాన్స్ చెల్లించడంతో పాటు నెలనెలా అద్దె ఇస్తానంటూ ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు, మాజీ ఐఏఎస్ కుమారుడు గొబ్బూరు సాయి కృష్ణకిషోర్ చెప్పారు. కాగా యజమాని నిర్మలాదేవికి, సాయి కృష్ణకిషోర్ మధ్య అద్దె విషయమై గొడవ జరుగుతోంది. దీనికితోడు గతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న అధ్యాస్ జూనియర్ కాలేజీకి సంబంధించిన 16 నెలల అద్దె బకాయిలు ఉండడంతో గత ఫిబ్రవరిలో ఖాళీ చేయించారు.
ఈ నేపథ్యంలో నిర్మలాదేవిని కలిసిన కృష్ణకిషోర్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎన్టీఆర్ భవన్ పక్కనున్న కొత్త భవనాన్ని ఇవ్వాలని కోరాడు. అయితే తనకు గతంలోనే అద్దె సరిగా ఇవ్వలేదని, గతంలో అనేక వివాదాలు ఉన్నందున కళాశాల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని చెప్పింది. అయితే అప్పటికే ఈ భవనాన్ని ఇంటరీ్మడియట్ సెంటర్‌గా ప్రకటించడంతో చివరి క్షణంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏకంగా జిల్లా కలెక్టర్ కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది.
కాగా పరీక్షల అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని నిర్మలాదేవి కోరినా పట్టించుకోకపోవడంతో నాలుగురోజుల క్రితం ఆమె వచ్చి తాళాలు వేసుకుంది. శనివారం మధ్యాహ్నం నిర్మలాదేవి అక్కడ ఉండగా సుమారు 10మంది రౌడీలతో పాటు హిజ్రాలు ఒక్కసారిగా భవనంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించడమేగాక నిర్మలాదేవిని బయటకు తరిమివేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు ట్రాన్స్ జెండర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.