banjara hills police station
-
ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!
బంజారాహిల్స్(హైదరాబాద్): ‘మనం ఊరెళ్లిన సమయంలో నీ స్నేహితుడు మన ఇంటికి వచ్చి కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. రాత్రంతా ఇంట్లోనే నిద్రించాడని’భార్య తన భర్తకు చెప్పింది. చేసింది నా స్నేహితుడే కదా పోనీలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ⇒ బంజారాహిల్స్ రోడ్ నం.5లోని ఓ బస్తీలో నివసించే భార్యాభర్తలు తమ 14 ఏళ్ల కూతురితో పాటు మిగతా ఇద్దరిని ఇంట్లోనే వదిలేసి ఈనెల 17వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. రాత్రి ఆమె భర్త స్నేహితుడు మోహన్‌సింగ్, సోను బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇంట్లోనే మద్యం సేవించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న బాలిక(14) గదిలోకి వెళ్లిన సోను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నోరు నొక్కి అక్కడే పడుకున్నాడు. ఆమె అరవడానికి ప్రయత్నించగా బెదిరించాడు. తెల్లవారుజామున 6గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ⇒ ఇంటికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఇదే విషయాన్ని బాధిత తల్లి తన భర్త దృష్టికి తీసుకొచి్చంది. వచ్చింది నా స్నేహితుడే కదా అంటూ భర్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితురాలు తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపట్ల చర్యలు తీసుకోవలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మోహన్‌సింగ్, సోనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Banjara Hills: అక్కా అంటూ పరిచయం చేసుకుని...
బంజారాహిల్స్(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్‌లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్‌గా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. అదే కంపెనీ బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్‌పై నిద్రకు ఉపక్రమించింది. అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే, తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోవడం పట్ల కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ నన్ను మూడు గంటలకు ఫిర్యాదు తీసుకోవడానికి రమ్మన్నారు. నేను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’’ అంటూ మండిపడ్డారు.‘‘నా ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చాను. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నేను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ ప్రవర్తన తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారు...పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది. కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత, సంతోష్ రావు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. -
మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..
బంజారాహిల్స్: మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నాను..నీ నెంబర్‌ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను..మీ పేరు, మీ నాన్న పేరు ఇదే కదా? అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్త రకంగా చక్కటి ప్లాన్‌తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమకపెట్టి రూ.35 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లో నివసించే స్వాగతారాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడి అశోక్‌కుమార్ శర్మకు తాను రూ.2000 బాకీ ఉన్నానని, వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు. తన పేరు, తండ్రి పేరు కరెక్ట్‌గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన రూ.10,000 ఒకసారి, రూ.20,000 ఒకసారి మీ అకౌంట్‌కు పంపించాను, నీకు మెసేజ్ వచి్చంది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే రూ.12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున రూ.40,000 పంపాను..రెండు వేలు కట్ చేసుకుని రూ.38 వేలు తనకు తిరిగి జీపే చేయాలని ఆమెను తికమకపెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓ వైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు..ఈ గొడవలోనే రూ.38 వేలు బదిలీ చేసింది.మరుక్షణంలోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.38 వేలు వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్ అవర్) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచి్చనవి నకిలీ మెసేజ్‌లు అని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్‌ను ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంట సేపట్లోనే గోల్డెన్ అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. -
ట్యాపింగ్ లింక్స్
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది. స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
Sowmya Janu: దాడి చేసింది సినీనటి సౌమ్య జాను
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోంగార్డుపై దాడికి పాల్పడింది సినీనటి సౌమ్యజాను గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన ఓ మహిళ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడిపై దాడికి పాల్పడింది. పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా సంఘటనకు కారణమైన మహిళను సినీనటి సౌమ్య జానుగా గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా అందుబాటులో లేదని తెలిపారు. ఆమె సెల్ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయన్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సౌమ్యజాను సంఘటన అనంతరం ఓ చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో తాను అత్యవసర పనిపై వెళుతూ రాంగ్రూట్లో వచి్చనట్లు అంగీకరించారు. అయితే తనను అక్కడ విధుల్లో ఉన్న పోలీసు బూతులు తిట్టినందునే తాను ఎదురుదాడి చేయాల్సి వచి్చందన్నారు. తాను అతని లైఫ్ జాకెట్ చించలేదని తెలిపారు. తాను కూడా హోంగార్డుపై ఫిర్యాదు చేస్తానన్నారు. తనను పోలీసులు విచారణకు పిలవలేదని ఆమె స్పష్టం చేశారు. -
ఆ కేసు కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ఇతర కేసుల మాట ఎలా ఉన్నా.. అత్యాచారం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులకు మాత్రం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. బాధితురాలిని వెంటనే భరోసా సెంటర్‌కు పంపడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా తోడయ్యే వాటి విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే బంజారాహిల్స్ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పని చేసి, లంచం ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదై, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారి తీరు మాత్రం దీనికి భిన్నం. తన వద్దకు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయడం మాట అటుంచి ‘పెద్దలైన’ నిందితులతో కలిసి ఆమెనే బెదిరించాడు. ఈ కారణంగానే దారుణమైన ఉదంతానికి సంబంధించిన ఈ కేసు నమోదు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయడంతో పాటు సదరు ఇన్స్పెక్టర్ను నిందితుడిగా చేర్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అప్పట్లోనే ఫిర్యాదు చేసిన బాధితురాలు... జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ మురళీ ముకుంద్, ఆయన కుమారుడు ఆకర్ష్ కృష్ణ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివసిస్తున్నారు. వీరి వద్ద పని చేస్తున్న ఓ దళిత యువతిపై (22) అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గత ఏడాది జూన్‌లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న మురళీ ముకుంద్ కుటుంబీకులు ఈ కేసు నమోదు కాకుండా చూడటానికి ఆ బాధితురాలినే బెదిరించాలని పథకం వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ప్రోద్భలంతో ముకుంద్ కుటుంబీకులు బాధితురాలిపై ఓ ‘చిత్రమైన కేసు’ పెట్టారు. ఆమె తమ ఇంట్లో పని చేస్తూ ఐఫోన్‌లోని సిమ్‌కార్డులు తస్కరించినట్లు అందులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును బాధితురాలికి చూపించిన సదరు ఇన్స్పెక్టర్ బెదిరింపులకు దిగారు. ముకుంద్ కుటుంబీకులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. ఆమెకు జరిగిన అన్యాయానికి రేటు... అక్కడితో ఆగకండా ఆ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. పలుమార్లు ఆమెకు ఫోన్ చేసిన సదరు అధికారి పదేపదే బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమెకు జరిగిన అన్యాయానికి రూ.1.7 లక్షల రేటు కట్టిన ఇన్స్పెక్టర్ ముకుంద్ కుటుంబీకుల నుంచి ఆ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు సదరు అధికారికి భారీ మొత్తమే ముకుంద్ కుటుంబీకుల నుంచి అందినట్లు తెలిసింది. ఈ ఖాకీ బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని మిన్నకుండిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరిణామాలతో ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు విషయాన్ని అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశాల మేరకు ఈ కేసును మహిళ భద్రత విభాగం అధికారులకు అప్పగించారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వాస్తవాలు.. తమ దర్యాప్తులో భాగంగా మహిళ భద్రత విభాగం బాధితురాలిని సంప్రదించింది. ఆమె నుంచి వాంగ్మూలం సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఇన్స్పెక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ భద్రత విభాగం అధికారులు నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బంజారాహిల్స్ మాజీ ఇన్స్పెక్టర్పై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టంలో ఓ కీలకాంశం ఉంది. ఈ ఆరోపణల కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిన, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యాచారం కేసును దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మురళీ ముకుంద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మాజీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకునే అంశానికి అనివార్య కారణాల నేపథ్యంలో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఏడేళ్లకే పోలీసయ్యాడు!
బంజారాహిల్స్: ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు కేన్సర్ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది. కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్ యూనిఫాంలో స్టేషన్లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి స్టేషన్లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు. -
బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు...
బంజారాహిల్స్: బార్బర్ షాప్‌కు మసాజ్‌కు వెళ్లిన యువకుడి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... టోలిచౌకి ఎండీ లైన్స్‌లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదిత్య తొడలపల్లి టోలిచౌకి ఐఏఎస్ కాలనీలో ఉన్న అవిద్స్ బార్బర్ షాప్‌కు మసాజ్ కోసం వెళ్లారు. మసాజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూడగా మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదు. సుమారు రూ. 80 వేల విలువ చేసే బంగారు గొలుసును మసాజ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గాలిపటం వెంట పరుగెత్తి... దారితప్పిన బాలుడు .. ఆ తర్వాత!
బంజారాహిల్స్: తెగిన గాలిపటం కోసం పరుగులు తీస్తూ ఓ బాలుడు తప్పిపోయిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా సీసీ కెమెరాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన సింహాద్రి, అనసూయ దంపతులకు వినోదకుమార్ అనే 9 ఏళ్ల కొడుకు ఉండగా సంక్రాంతి పండుగకు 3 రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో వుండే అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం వినోద్ తన తల్లి, అమ్మమ్మ తోకలిసి కేబీఆర్ పార్క్ వైపు వచ్చారు. అంతలోనే ఓ పతంగి తెగి గాలిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొద్దిసేపట్లో తల్లి గమనించి కొడుకు కోసం గాలించింది. అక్కడే ఉన్న పోలీసులకు చెప్పి అంతటా వెతికింది. కేబీఆర్ పార్క్ ఇంటర్‌సెప్టర్ 10 మెయిన్ గేట్ పోలీసు పీసీలు అక్షయకుమార్, మహేష్ కుమార్, హెచ్‌జీలు దినకర్, నరేష్, కృష్ణంరాజు స్పందించి పార్కు చుట్టూ గాలించారు. అనంతరం సీసీ కెమెరాల్లో పరిశీలించారు. అదే సమయంలో బాలుడు ఓ చోట కనిపించాడు. వెంటనే బాలుడిని గుర్తించి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓవైపు నెమళ్లు ఇంకోవైపు పతంగులు చూసి ఆనందంలో మునిగిపోయి వాటిని పట్టుకోవడానికి పరుగెత్తానని వినోద్ తెలిపారు. -
బంజారాహిల్స్ పీఎస్ ఎదుట హిజ్రాల హంగామా.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హంగామా సృష్టించిన 20 మందికిపైగా హిజ్రాలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని ఇందిరానగర్‌కు చెందిన సోనా రాథోడ్ బృందానికి, ఐడీపీఎల్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మోనాలిసా టీం మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. సోనా రాథోడ్ టీంపై మోనాలిసా దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ వారు ఆదివారం బంజారాహిల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతోపాటు కిరోసిన్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు సోనా రాథోడ్‌తోపాటు స్వీటి, చందుబాయి, జోయ, రోషిని, వైశాలి, లక్కీ, పుష్ప తదితర 20 మందికిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీసులు పరారీలో ఉన్న హిజ్రాలను పట్టుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో వారికోసం గాలించి పది మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రోజా, వసు, హిమ, అన్షు, నందు, లక్ష్మి, వైష్ణవి, స్పందన, జోయ, రియా ఉన్నారు. ప్రధాన నిందితురాలు సోనా రాథోడ్, బుల్బుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. Extortion in Hyderabad: Third gender groups fight over who is original and who is fake and stage dharna infront of Banjara Hills police. Extortion of money by such groups increases a lot in Hyderabad.#Hyderabad #Thirdgender pic.twitter.com/OiJP1z1bYz — Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2022 కాగా గత కొద్ది కాలంగా హిజ్రాల తీరుపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. కూడళ్లతోపాటు ఏదైనా ఫంక్షన్ జరిగినా, షాప్ ఓపెనింగ్ జరిగినా అక్కడికి వచ్చి వాలుతున్నారని ఫిర్యాదులు అందడం, ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు హిజ్రాలతోపాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు ఆటోవాలాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం తలెత్తింది. చదవండి: నడిరోడ్డుపై మహిళ ప్రసవం.. మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన -
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్షి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జండాలతో, కర్రలతో రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పింది. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపించారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
సినిమా విడుదల పేరుతో మోసం చేశారు, కత్తితో బెదిరించారు: నిర్మాత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్‌లోని పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్ బాలుపై ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నువ్వంటే ఇష్టం... నాతో ఉండిపో’.. వివాహితకు సినీ కెమెరామెన్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: వివాహితను వేధింపులకు గురిచేస్తున్న కెమెరామెన్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి శ్రీనివాస్(49) సినీ పరిశ్రమలో కెమెరామెన్‌గా, యాడ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. పలు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటికి ఎదురుగా వివాహిత(39) తన భర్త, పిల్లలతో కలిసి 2007 నుంచి ఉంటోంది. శ్రీనివాస్ కుటుంబంతో పరిచయం ఉన్న బాధితురాలిని కొన్ని నెలలు గా తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంటిముందు నిలబడి గట్టిగా కేకలు వేయడం, సదరు మహిళ గురించి చెడుగా మాట్లాడటంతో కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మద్యం మత్తులో అలా ప్రవర్తిస్తుంటాడని భావించిన వివాహిత భర్తతో పాటు కుటుంబసభ్యులు పలు మార్లు మందలించినా ఏ మాత్రం మార్పురాకపోగా వేధింపులు తీవ్రమయ్యాయి. నువ్వంటే ఇష్టం.. నాతో ఉండిపో.. అంటూ రోడ్డుమీదనే అటకాయించడం, తనమాట వినకపోతే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానంటూ బెదిరిస్తున్నా డు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌పై ఐపీసీ 354(డి), 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ -
‘క్రాక్ సినిమా కథ నాదే.. నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదు’
సాక్షి, బంజారాహిల్స్: రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కథ తనదేనని తనను మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు ఇతర యూనిట్ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఓ రచయిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... అల్వాల్‌లో నివాసం ఉంటున్న శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారు. ఏడాదిన్నర క్రితం రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నదేనని సదరు నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు, హీరోలకు ఫిలించాంబర్ నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్యమూర్తి గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాత మధుసూదన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి -
పబ్ డ్రగ్స్ కేసు ఎఫెక్ట్: బంజారాహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కొత్త సీఐగా నాగేశ్వరరావును నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పబ్ కేసులో నిర్లక్ష్యం వహించిన సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. మరో వైపు ఏసీపీ సుదర్శన్‌కు కూడా ఛార్జిమెమో ఇచ్చారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. కాగా, కొత్తగా నియమితులైన సీఐ నాగేశ్వరరావు డ్రగ్ ఆపరేషన్‌లో కీలక పాత్ర వహించారు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో టోని అరెస్ట్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ కేసుపై పోలీస్ అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించారు. చదవండి: డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాద నిందితులకు బెయిల్
బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరి మృతికి కారకులైన ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గత నెల 6న తెల్లవారుజామున బజార్ రోహిత్‌గౌడ్, సాయిసోమన్, కోసరాజు వెంకటేష్‌లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో మద్యం తాగి ఆ మత్తులో కారులో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్– 3లోని రెయిన్బో ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు ఆస్పత్రి ఉద్యోగులను కారుతో ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు ప్రమాదానికి కారణమైన రోహిత్‌గౌడ్, సాయి సోమన్లపై ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో నిందితుడు కోసరాజు వెంకటేష్ పరారయ్యాడు. అతనిపై ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు పోలీసులకు దొరక్కుండా కోర్టులో లొంగిపోయాడు. ముగ్గురికీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం ముగ్గురూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై సంతకాలు చేయాలని షరతు విధించింది. -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సి కల్యాణ్ పేరుతో షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో పరిచయం కాస్త ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం కలిసి ఉందామంటే అతడు నిరాకరించడంతో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది. యువతి తాను ఉంటున్న వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో దుగ్యాల ఐశ్వర్య (20) నివసిస్తుండేది. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండేది. అయితే కొంతకాలం కిందట మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆశిర్ గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన ఐశ్వర్యను హైదరాబాద్ శివారులోని సంఘీ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులు కలిసి ఉన్నారు. అయితే ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఏ పనీ చేయని ఆశిర్ రెడ్డి నిన్ను పోషించలేడు అని ఐశ్వర్యను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. తన భర్తను దూరం చేశారని ఐశ్యర్య అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. దీంతో హైదరాబాద్‌కు వచ్చి వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే తాను కుటుంబసభ్యులను ఒప్పిస్తానని నమ్మ బలికిన ఆశిర్ ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆశిర్‌కు చెప్పి కలిసి ఉందామని విషయాన్ని ప్రస్తావించింది. ఈ విషయం ఆశిర్ దాటవేస్తూ వస్తున్నాడు. ఆమె ఒత్తిడి చేస్తుండడంతో ‘నాకు కొంత సమయం కావాలి’ అని ఆశిర్ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే ఆమెకు గర్భం తీసి వేయించాడు (అబార్షన్). ఆశిర్‌తో ఎలాగైనా తేల్చుకోవాలని ఐశ్వర్య వారి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ కుటుంబసభ్యులు ఐశ్వర్యను దారుణంగా అవమానించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. కొన్ని రోజులుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్- 3లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో నివసిస్తోంది. ఆ మనస్తాపంతోనే మంగళవారం తెల్లవారుజామున ఐశ్వర్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు కొన్ని సెల్ఫీ వీడియోలను ఐశ్వర్య తీసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆశిర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. భూమి వివాదాన్ని సెటిల్ చేస్తా అంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు తెలిపారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాగా లండన్‌లో ఆర్కిటెక్చర్ విద్యనభ్యసించిన కత్తి కార్తీక తెలంగాణ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టులను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేసు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్షణాల్లో బంగారం సంచి మాయం!
సాక్షి, హైదరాబాద్: సేల్స్‌మన్ నిర్లక్ష్యం కారణంగా కిలోన్నర బంగారం మాయమైన సంచలన ఘటన బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్‌బాగ్‌లోని వీఎస్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపులో ఓ కస్టమర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చారు. వాటిని ప్రదీప్ అనే సేల్స్‌మన్ స్కూటీపై తిరిగి వీఎస్ నగల దూకాణానికి తీసుకెళుతున్న క్రమంలో బంగారం సంచి మిస్సయింది. బంజారాహిల్స్‌లో రోడ్డుపై వరదనీటిని దాటే క్రమంలో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల బ్యాగు కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత దీనిని గుర్తించిన ప్రదీప్ వెనక్కి వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. వీఎస్ గోల్డ్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సేల్స్‌మన్ ప్రదీప్‌ను విచారిస్తున్నారు. సేల్స్‌మన్ ప్రదీప్ బ్యాగ్ పడిపోయిందని చెప్పిన చోట పోలీసులు వెతకగా.. ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన బ్యాగు పక్క బిల్డింగ్‌లో ఉన్న చెత్త బుట్ట వద్ద దొరికింది. కానీ దాంట్లో బంగారు ఆభరణాలు మాత్రం లేవు. బంగారు ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ‘మీ ఒక్కరోజు రాబడి..నాకు మూడునెలల ఆదాయం’) -
కరోనా పరీక్షల్లో నెగెటివ్.. సీటీ స్కాన్‌లో పాజిటివ్
హైదరాబాద్: కరోనా చెలగాటం సామాన్యులకు ప్రాణసంకటం.. ముందు నిద్రాణంగా ఉండి ఆ తర్వాత పంజా విసురుతోంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని కరోనా పరీక్ష చేయించుకుంటే ముందు నెగెటివ్ అని వస్తోంది.. ఆ తర్వాత సీటీస్కాన్లో అది పాజిటివ్‌గా తేలి ప్రాణాలు తీస్తోంది. ఈ విధంగానే ఓ ఏఎస్ఐని కబళించింది. కరోనాతో పోరులో చివరికి ఆయన కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ్‌కుమార్(55) ఏఎస్ఐగా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలోనూ ఆయన రేయింబవళ్ళు సేవలందించారు. ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. సీటీ స్కాన్‌లో పాజిటివ్ అని.. కరోనా కాకపోవచ్చని భావించిన ప్రేమ్‌కుమార్ ఎర్రగడ్డలోని నీలిమా ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు ప్రేమ్‌కుమార్‌కు íసీటీ స్కాన్ తీశారు. ఈ స్కాన్‌లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కరోనా వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఉండొచ్చని భావించిన వైద్యులు ఆయనను కోవిడ్ ఆస్పత్రుల్లో చేరాలని సూచించగా మళ్లీ నేచర్ క్యూర్ ఆస్పత్రికి వెళ్ళారు. నెగెటివ్ వచ్చిన వారికి ఇక్కడ వైద్యం చేయడం కుదరదని, ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు లేవని ఆస్పత్రివర్గాలు చెప్పడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చేరిన కాసేపటికే ఆక్సిజన్ సరఫరా సరిగా లేక ప్రేమ్‌కుమార్ కళ్ల ముందే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ వద్ద భద్రతాకార్డుపై చికిత్స అందించే సౌకర్యంలేదని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారుల చొరవతో అపోలో ఆస్పత్రిలో బెడ్ దొరికింది. అక్కడ ప్రేమ్‌కుమార్‌కు మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. సోమవారం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రేమ్‌కుమార్ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. -
కట్నం కోసం వేధింపు.. ప్రేమికుడిపై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం ఇస్తేనే పెళ్లి అంటూ పీటముడి వేసి వేధిస్తున్నందుకు ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని ఓ బస్తీలో నివసించే యువతి(22) డీ మార్ట్ మాల్లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రెండేళ్లుగా స్థానికంగా నివసించే లక్ష్మణ్‌ను ప్రేమిస్తోంది. ఈ నెల 2వ తేదీన లక్ష్మణ్ ఆమెను పెళ్లి విషయంలో మాట్లాడుకుందామని పిలిపించాడు. మాటల సందర్భంలో రూ.10 లక్షలు కట్నంగా ఇస్తే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వెళ్లిపో అని చెప్పాడు. అంత డబ్బు తామిచ్చుకునే పరిస్థితిలో లేమని ఆమె చెప్పింది. తెల్లవారి మళ్లీ ఆమె లక్ష్మణ్‌కు ఫోన్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా ఇప్పుడే.. చచ్చిపో అంటూ లక్ష్మణ్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రమనస్థాపానికి గురై తన ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి గమనించి వెంటనే అప్రమత్తమై అపోలో ఆస్పత్రికి తరలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు లక్ష్మణ్‌పై ఐపీసీ సెక్షన్ 417, 420, వరకట్న నిషేధిత చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేశాం: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు శుక్రవారం చేసిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసినట్టు వెస్ట్ జోన్ డీసీపీ సుమతి మీడియాకు వెల్లడించారు. రవిప్రకాశ్‌తో పాటు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్(ఏబీసీఎల్) మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఏబీసీఎల్ కంపెనీ చెందిన దాదాపు రూ.18 కోట్ల నిధులను సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించినట్టు తెలిపారు. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి తెలిపారు. -
పోలీసుల అదుపులో రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తిపై బంజరాహిల్స్ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వి రవిప్రకాశ్ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్ డ్రా చేశారు. అలాగే డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్ క్లిఫోర్డ్ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్ కంపెనీని టేకోవర్ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్ అండ్ కోపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
ఒక దొంగ..66మంది పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే సంచలనం సృష్టించిన రెండు భారీ చోరీ కేసుల్లో నిందితుడొక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన తీరు, సీసీ ఫుటేజీలో నిందితుడి ఆనవాళ్లు ఒకేరకంగా ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడి నడక, ఇళ్లల్లోకి చొరబడిన విధానం, చేతులకు వేసుకున్న గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ ఒకేరకంగా ఉండటంతో ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒక్కరేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. జులై 22న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–28లో ఉంటున్న విల్లామేరీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లోకి దొంగ పక్కింటి ప్రహరీ దూకి నేరుగా మొదటి అంతస్తులోకి చేరుకున్నాడు. కిటికీ డోరుతీసి లోపలికి ప్రవేశించి రూ.లక్ష నగదు, రూ.25 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలను దొంగిలించాడు. ఫెలోమినా ఇంటి చుట్టూ 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ రెండు కెమెరాల్లో మాత్రమే నిందితుడి జాడ కనిపించింది. దీని ఆధారంగానే పోలీసులు దొంగకోసం గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్‌లో.... బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని రియల్టర్ తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఆగస్టు 27న భారీ చోరీ జరిగింది. నిందితుడు ఇంటి వెనకే ఉన్న జపనీస్ గార్డెన్ ప్రహరీ దూకి వెనుకాల గ్లాస్ డోర్ తెరుచుకొని సరాసరి బెడ్రూమ్లోకి వెళ్లి కబోర్డులో ఉన్న సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలను మూటకట్టుకొని వచ్చినదారిన ఉడాయించాడు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో 14 సీసీ కెమెరాలు ఉండగా కేవలం రెండింట్లో మాత్రమే నిందితుడి జాడ కనిపిస్తోంది. మిగతా కెమెరాలన్నీ అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయడం వల్ల నిందితుడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదు. అయితే గేటులోకి రావడం, లోపలికి ప్రవేశించడం అన్నీ కనిపిస్తుండటంతో కొంత సమాచారం లభ్యమైంది. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తే ఫిలోమినా ఇంట్లోనూ ఇదే తరహా లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు దొంగతనాలకు దగ్గరి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో పాటు రెండు సీసీ ఫుటేజీల్లోనూ అతడి నడక ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ రెండు దొంగతనాలు ఒక్కడే చేసినట్లుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న 150 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. పరిసర పోలీస్స్టేషన్ల పరిధిలోనూ దొంగతనం జరిగిన సమయాన్ని ప్రమాణికంగా తీసుకొని సీసీ కెమెరాలు వడపోస్తున్నారు. రెండు పోలీస్స్టేషన్ల పరిధిలోని క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటి వరకు 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు దొంగ ఇంట్లోనే ఉన్నట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టం కావడంతో అంతకుముందు ఆ తర్వాత ప్రధాన రోడ్డులో రాకపోకలపై పోలీసులు దృష్టి సారించారు. మొత్తానికి రెండు దొంగతనాలకు పాల్పడిన దొంగ కోసం 66 మంది పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
బిగ్‌బాస్ నిర్వాహకులకు నోటీసులు
బంజారాహిల్స్ : స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్–3 కార్యక్రమంపై ఫిర్యాదుల నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని స్టార్ మా కార్యాలయ అడ్మిన్హెడ్ శ్రీధర్‌కు బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 13న సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ శ్యామ్‌తో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్ అగ్రిమెంట్ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఆరోపించారు. బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తారంటూ ప్రశ్నించడం తదితర అంశాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు శ్యామ్‌తో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు స్టార్ మా కార్యాలయం అడ్మిన్ శ్రీధర్‌కు నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సూచించారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక, ఎంపిక నిబంధనలు, శ్యామ్‌తో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర, తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించి సమాధానం ఇస్తామని శ్రీధర్ పోలీసులకు తెలిపారు. అయితే శ్యామ్, రవికాంత్, రఘు, శశికాంత్‌లతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టార్ మా కార్యాలయం నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు నిజంగానే ఆ ఛానల్‌కు సంబంధం లేరా? అన్నది నోటీసులో ఇచ్చే సమాధానాన్ని బట్టి స్పష్టం కానుంది. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అయితే, సైబర్ క్రైం పోలీసులకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు. డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఫోర్జరీ చేసిన విధానం కూడా వివరించారు. కానీ, దేనికోసం ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇక మూడో రోజు విచారణకు గురువారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. నిన్న కూడా తీరు మారలేదు. రవిప్రకాశ్ పోలీసుల ప్రశ్నలకు స్పందించలేదు. పైగా విచారణ అధికారులను బెదిరించే యత్నం చేశారు. ‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు మీకూ టైమ్ వస్తుంది’ అన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. -
తారాచౌదరి బావ అరెస్ట్
బంజారాహిల్స్: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులపై కన్నేసి ఇబ్బందులకు గురి చేసిన మేన బావపై సినీ నటి తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు చావా రాజ్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఉదయ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి ఇంటికి 2016 నవంబర్‌లో వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్ అతని సోదరి సుజాత ఇద్దరూ వచ్చారు. తారా చౌదరిని పెళ్లి చేసుకుంటానని రాజ్‌కుమార్ చెప్పగా నీకు ఇంతకు ముందే పెళ్ళి అయింది కదా ఎలా చేసుకుంటావంటూ ఆమె ప్రశ్నించింది. మొదటి భార్యకు విడాకులు ఇస్తాడని అతని సోదరి సుజాత చెప్పింది. అందుకు తారా చౌదరి ఒప్పుకోకపోవడంతో రాజ్‌కుమార్ ఆమెను బెదిరించి లోబర్చుకున్నాడు. అనంతరం గణపతి కాంప్లెక్స్ సమీపంలోని ఆమె అపార్ట్మెంట్లోనే ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్‌కుమార్ ఆమె ఆస్తులను అమ్మి డబ్బు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాడు. అందుకు తారాచౌదరి నిరాకరించడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. రెండేళ్లుగా తాము భార్యాభర్తల్లా కలిసి ఉన్నామని తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఈ నెల 10న తారా చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ స్టేషన్‌కు వచ్చి ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తుండటంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం గుంటూరులో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్ పీఎస్ వద్ద హిజ్రాల ఆందోళన
-
పోలీసుస్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు
హైదరాబాద్: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్(24) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 7న బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్‌కుమార్, సోదరుడు సాయికుమార్ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్‌కుమార్‌లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీ‹శ్.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్‌కు ఫోన్ చేశారు. కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్‌కు రమ్మన్నారు. మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సతీశ్.. మరోసారి మామకు ఫోన్ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్‌ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. -
బంజారాహిల్స్‌లో కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు మంటలార్పి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు.. ముషిరాబాద్ చెందిన సతీష్ (28) అనే యువకుడికి బంజారాహిల్స్ దేవరకొండ బస్తీకి చెందిన ఓ యువతితో వివాహమైంది. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ యువతి తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో ఆమె తండ్రి మనోజ్, సతీష్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సతీష్.. తన మామ మనోజ్‌ను బ్లాక్మెయిల్ చేశాడు. అతను ఎంతకీ స్పందిచకపోవడంతో బుధవారం పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కు వచ్చిన సతీష్.. ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ఇసుక సాయంతో మంటలార్పి ప్రాణాలు రక్షించారు. ప్రస్తుతానికి ప్రాణపాయం తప్పిందని, తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బంజారాహిల్స్‌లో కలకలం
-
ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తోంది
హైదరాబాద్: తనపై అసత్య ఆరోపణలు చేసిన మదర్ థెరిసా ఫౌండేషన్ ప్రతినిధి కొమురెల్లి విజయలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ చీఫ్ విప్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను సదరు మహిళను లైంగికంగా వేధించానంటూ దుష్ప్రచారం చేసిందని, తన అపార్ట్మెంట్ వద్దకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 8 నెలలుగా తప్పుడు ప్రచారం చేస్తూ తనను సమాజంలో కించపరిచేలా ప్రవర్తిస్తోందని, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని తెలిపారు. తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లో తన సోదరుడికి ఉద్యోగం ఇప్పించాల ంటూ విజయలక్ష్మి తొలిసారిగా తనను కలిసిందని అవకాశం ఉంటే కల్పిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఆ తర్వాత మదర్‌థెరిసా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరుతో తనను కలసి ఆర్థిక సాయం కోరిందన్నారు. తాను కొంత ఆర్థిక సహాయం సంస్థకు అందించానని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసి తనను ఆఫీస్‌లో కలసిందని చెప్పారు. లైంగికంగా కలుద్దామంటూ పలుమార్లు తనపై ఒత్తిడి తేగా అందుకు తాను ఒప్పుకోలేదని అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టిందన్నారు. ఓ పత్రికలో ఇటీవల మాయలేడి పేరుతో ఓ కథనం రాగా అది ఈ మహిళ గురించేనని తెలుసుకున్నట్లు చెప్పారు. కొందరు నేతలు ఆమెకు అండగా నిలుస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేస్తోందన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసు నమోదు చేశారు. -
కత్తి మహేశ్‌ను అరెస్ట్ చేసిన పోలిసులు
-
పోలీసుల అదుపులో మాధవి లత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం చాంబర్ ఎదుట మౌనదీక్ష చేసిన హీరోయిన్ మాధవి లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. బుధవారం ఉదయమే ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్న మాధవి లత.. తలకు, దుస్తులకు నల్లరంగు రిబ్బన్లు ధరించి కార్యాలయం ముందు బైఠాయించారు. పవన్ అభిమానులు సైతం ఆమెతో కలిసి దీక్షలో కూర్చున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు కూడా ఆమెకు మద్దతుపలికినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లోనూ దీక్ష కొనసాగింపు: కొద్ది రోజుల కిందట ఇదే ఫిలిం చాంబర్ ముందు నటి శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దరిమిలా నేటి మాధవి లత దీక్షపై చాంబర్ వర్గాలు ఆందోళన చెందినట్లు తెలిసింది. మాధవి మౌనదీక్షకు కూర్చున్న కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టిన హీరోయిన్.. స్టేషన్లోనూ మౌనదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు: కాస్ట్ కౌచింగ్‌పై గళమెత్తి, దానిని చర్చనీయాంశంగా మార్చిన నటి శ్రీరెడ్డి.. ఇటీవలే నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే. తమ అభిమాన హీరోను దూషించిన నటి శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీ లతకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న పవన్ అభిమానులు.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
యాంకర్‌కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌లోని ఓ న్యూస్ ఛానెల్లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ నెల 24న కార్యాలయంలోకి వచ్చి తనతో రాకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడని తెలిపింది. మూడేళ్ల క్రితం కూడా సదరు రవీందర్ తనను వేధింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారని విడుదలై వచ్చిన తర్వాత మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించింది. పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమే కావాలి: పెళ్లిచేయకుంటే కోర్టుకెళతా..
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరం ప్రేమించుకున్నాం..పెళ్లి చేసుకోవాలనుకున్నాం..పెద్దలుకూడా ఒప్పుకున్నారు.. ఇపు డు ఆమెపెళ్లి వద్దంటోంది.. ఆమె కోసం విదేశీ ఉద్యోగాన్నే వదులుకున్నా.. ఇపుడు నా పరిస్థితేంటి అంటూ ఓ యువకుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. ఫిలింనగర్‌లోని దుర్గాభవాని నగర్లో నివసించే ఎలక్ట్రీషియన్ జామ మహేష్ (24) రెండేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(22)ని ప్రేమిస్తున్నాడు. పెళ్ళికి ఇద్దరి కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే ఏమైందో.. ఏమో ఇప్పుడు ఆ యువతి పెళ్లిచేసుకోనంటోంది. దీంతో మహేష్ విస్తుపోయాడు. బతిమాలినా ఒప్పుకోకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఆమె కోసం ఎన్నో త్యాగాలుచేశానని విదేశాల్లో ఉద్యోగం వస్తే కూడా ఆమె వద్దన్నదని వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరుగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ -
కొడుకు చనిపోయాడనుకుని.. తనువు చాలించిన మాతృమూర్తి
మాట వినడంలేదనే కోపంలో కుమారుడిని గట్టిగా లాగిన తల్లి విసురుగా వెళ్లి మంచంకోడుకు తల తగిలి స్పృహ తప్పిన బాలుడు కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడని భయపడి ఆత్మహత్య బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన హైదరాబాద్: ఆడుకునేందుకు బయటకెళ్లిన కుమారు డు ఆలస్యంగా ఇంటికి చేరడం.. చెప్పిన మాట వినకపోవడంతో ఆ తల్లికి పట్టరాని కోపం వచ్చింది. కుమారుడిని గద్దించేందుకు గట్టిగా లాగడంతో అతను వెళ్లి మంచంకోడుకు తగిలి స్పృహ తప్పాడు. రక్తపు మడు గులో పడి ఉన్న కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడేమోననుకుని భయపడిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. హృదయవిదారకమైన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబగం గ్రామానికి చెందిన జి.సునీత(23), జి.ఈశ్వర్రావు దంపతులు. బంజారా హిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఈశ్వర్.. రెండు రోజుల క్రితం వైజాగ్ వెళ్లాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు నిహార్, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం నిహార్ బయటకు వెళ్లగా.. అతడి కోసం సునీత అంతటా గాలించినా ఎక్కడా ఆచూకీ లేదు. దీంతో ఇంటి ముందే ఏడుస్తూ కూర్చుంది. ఐదు గంటల తర్వాత నిహార్ ఇంటికి వచ్చాడు. దీంతో కోపం పట్టలేక సునీత కొడుకును లోపలికి ఈడ్చుకెళ్లి స్నానం చేయాలని చెప్పింది. వినకపోవడంతో నిహార్‌ను గట్టిగా లాగింది. విసురుగా లాగడంతో నిహార్ తలకు మంచంకోడు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కొడుకు ఎంతకూ కదలకపోయేసరికి సునీత భయపడింది. తీవ్ర మానసిక సంఘర్షణకులోనై చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి కళ్లు తెరిచిన నిహార్ లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ తల్లి కనిపించింది. అమ్మా.. అమ్మా అంటూ పిలుస్తూ ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు గమనించారు. చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి ఔనంది... కూతురు కాదంది
హైదరాబాద్(బంజారాహిల్స్): తన కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసిన గంటలోనే అలాంటిదేమీ లేదని తననెవరూ వేధించడం లేదంటూ కూతురు ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకెళ్లిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన విక్కీ అనే యువకుడు తన కూతురును వెంటపడుతూ వేధిస్తున్నాడని ఓ మహిళ శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను వేధించడం లేదని ఆయన వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తన ఇష్ట్రపకారమే మాట్లాడుతున్నానంటూ సదరు యువతి పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. కూతురి మాట ప్రకారం పోలీసులు విక్కీని వదిలిపెట్టగా ఆమె స్వయంగా సదరు యువకుడిని బయటికి తీసుకురావడం విశేషం. -
'చిన్నారుల కేసు విచారణ వేగం పెంచాం'
హైదరాబాద్: ఇద్దరు మైనర్ విద్యార్థుల ఘర్షణ కేసులో విచారణ ముమ్మరం చేశామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని అన్నారు. విచారణ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అని గేలి చేయడంతో ఆ కుర్రాడు తనను టీచ్ చేస్తావా అని మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీంను ఇంటికి వెళ్లిన తర్వాత నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్కూల్లో చిన్నారుల ఫైట్.. ఒకరి మృతి
- టోలిచౌకీలో ఘటన హైదరాబాద్: హేళనలతో బడిలో చిన్నారుల మధ్య రగిలిన వివాదం దాడులకు కారణమైంది. చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివి... ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అంటూ గేలి చేశాడు. దీంతో కోపం పట్టలేని ఆ విద్యార్థి... నన్ను టీజింగ్ చేస్తావా అంటూ తరగతి గదిలోనే ఇబ్రహీం మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీం... కాసేపటి తరువాత లేచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తనకు మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. వారు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం చూడగా చిన్నారికి దెబ్బ తగిలినచోట బాగా వాపు వచ్చింది. కంగారెత్తిన తల్లిదండ్రులు ఇబ్రహీంను వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించి, వివరాలు తెలుసుకున్నారు. -
హీరో వేణుపై కేసు నమోదు
హైదరాబాద్ : అద్దె ఇంటికి ఇచ్చిన అడ్వాన్స్ రూపంలో ఇచ్చిన నగదును తిరిగివ్వకుండా వేధిస్తున్నారంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు వేణు తొట్టెంపుడి దంపతులపై ఇరాన్‌కు చెందిన మహిళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ ఫాతేమీ బేగంపేటలో వైద్యురాలుగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని జీపీ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 302ను ఏడు నెలల క్రితం సినీ నటుడు వేణు తొట్టెంపుడి నుంచి అద్దెకు తీసుకుంది. ఈ ప్లాట్ నెలసరి అద్దె రూ.29,300కాగా అద్దెకు దిగే ముందు మూడు నెలల అడ్వాన్స్ కింద రూ.88 వేలు చెల్లించింది. అయితే ఈ నెల 8వ తేదీన తాను ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ఆమె యజమాని వేణుకు తెలిపింది. ఫ్లోరింగ్‌పైన చిన్న బీటలు ఏర్పడ్డాయని వాటిని సరి చేసి ఇవ్వాలని అప్పటిదాకా అడ్వాన్స్ ఇచ్చేది లేదంటూ వేణుతో పాటు ఆయన భార్య అనుపమ చౌదరి కరాకండిగా చెప్పారు. దీంతో వైద్యురాలు ఫాతేమీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు హీరో వేణును సంప్రదించారు. టెనెంజ్ ఫిర్యాదు వివరాలతో పాటు వేణు నిర్ణయాన్ని అడిగారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని వేణు నిర్ణయించుకుని... ఫాతేమీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు హీరో వేణు రాజీకి రావడంతో ఈ గొడవ సద్దుమణిగిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసు వాపస్ తీసుకోగా కొన్ని గంటల ఈ డ్రామాకు తెరపడింది. -
పోలీసులకు చెమటలు పట్టిస్తున్న యువతి
హైదరాబాద్ : కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించాలని స్టేషన్ ముందు బైఠాయించడమే కాకుండా... అర్దరాత్రి స్టేషన్ వద్ద నిద్రమాత్రలు మింగి బంజారాహిల్స్ పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందో యువతి. వివరాలు... దిల్‌షుక్‌నగర్‌లో నివసించే ఒక యువతి గతేడాది షాదీ డాట్‌కామ్‌లో వరుడి కోసం వెతుకుతుండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎస్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఎన్.విజయ్‌దీప్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. యువతిని విజయ్‌దీప్ తన వెంట తిప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 5న ఇద్దరికీ పెళ్లి చేసేందుకు ఇరువురి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. యువతి తల్లిదండ్రులు రూ. 10 లక్షల నగదు, రూ. 25 లక్షల విలువ చేసే ప్లాట్ ఇవ్వడానికి అంగీకరించారు. పెళ్లి పనులు జరుగుతుండగా విజయ్‌దీప్ ఆమె తనకు నచ్చలేని పెళ్లికి నిరాకరించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాద చేయగా విజయ్‌దీప్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే విజయ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆయనతోనే తనకు పెళ్లి జరిపించాలంటూ సదరు యువతి పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అది తమ పని కాదని పోలీసులు పేర్కొంటుండగా రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం రాత్రి 12 గంటలకు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులకు ఎటూ పాలుపోవడం లేదు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, నిందితుడిపై కేసు కూడా నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
నా కూతురితో రాజీ కుదిరింది
సినీ నటి తనూష తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్ : తన కూతురికి తనకు మధ్య రాజీ కుదిరిందని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తాము ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నామని సినీ నటి తనూష అలియాస్ స్వాతిరెడ్డి తల్లి కె.నాగేంద్రమ్మ వెల్లడించారు. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... చిన్నచిన్న అభిప్రాయ భేదాల వల్ల తాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. స్వాతికి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో భయపడి కేసు పెట్టానని, అంతకుమించి తన కూతురిపై ఎలాంటి కోపం లేదని నాగేంద్రమ్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వాతి హీరో సచిన్‌జోషి పక్కన హీరోయిన్గా నటిస్తోందని, రెండు రోజుల్లో ఆ సినిమా షూటింగ్‌కు హాజరవుతుందన్నారు. -
తల్లిని చంపిన కొడుకు
ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేస్తోందని దారుణం బంజారాహిల్స్: మంచానపడ్డ తల్లిని ఓ దుర్మార్గుడు కర్కశంగా చంపేశాడు. ఇంట్లోనే మలమూత్ర విసర్జన చేస్తోందని ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాది ప్రాణం తీశాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని దోబీఘాట్ ప్రాంత వాసి కె.రాణీబాయి (70) వృద్ధాప్యం వల్ల మంచం పట్టింది. అవసాన దశలో ఉన్న తల్లికి సేవలు చేయాల్సిన కొడుకు కరణ్‌సింగ్ ఆమెను పట్టించుకోకపోగా.. కొంత కాలంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. అన్నం కూడా పెట్టడంలేదు. ఎప్పుడు చస్తావని తరచూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన రాణీబాయి నాలుగైదు రోజుల నుంచి లేవలేని పరిస్థితిలో పడుకున్న చోటే మల మూత్రవిసర్జన చేస్తోంది. దీంతో కోపం పట్టలేక కరణ్‌సింగ్ తల్లిని నేలకేసి కొట్టడంతో పాటు తలను గోడ కేసి బాదాడు. దీంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కరణ్‌సింగ్ సహజ మరణం పొందిందని చుట్టుపక్కల వారిని నమ్మించి బుధవారం అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే, రాణీబాయిని కొడుకు కొట్టడంతోనే చనిపోయిందని ఆమె సోదరుడు రమేష్‌సింగ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కరణ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. -
డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు
నందినగర్: నాలుగు రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. -
కూతుర్ని కాటేసిన తండ్రి
బంజారాహిల్స్ : కన్న తండ్రే కీచకుడై కూతురిని కాటేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే బాలిక (14) 9వ తరగతి చదువుతోంది. ఆమెను తండ్రి సయ్యద్ రషీద్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు రోజులు క్రితం బాలిక నిద్రిస్తున్న సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాధిత బాలిక రెండు రోజులుగా బాధను గుండెల్లోనే దాచుకుంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి కూతుర్ని తీసుకొని బంజారాహిల్స్ ఠాణాకు వచ్చి భర్తపై ఫిర్యాదు చేసింది. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
హైదరాబాద్ : తమపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ - జవహర్కాలనీలో నివాసముంటున్న మొనాలిసా అనే హిజ్రా బోనాల పండుగ రోజున మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. తనపై నమిత అనే మరో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చిందని మొనాలిసా భావించింది. ఆ క్రమంలో నమితపై మోనాలిసా గురువారం రాత్రి రౌడీలతో దాడి చేయించింది. ఈ దాడిలో నమిత చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై గత మూడు రోజులుగా ముగ్గురు హిజ్రాలను రౌడీలు కిడ్నాప్ చేసి బాలానగర్‌లో ఓ గదిలో ఉంచి తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలో హిజ్రాలు బంజారాహిల్స్ పీఎస్‌కు చేరుకుని మొనాలిసాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాధితులు పట్టిచ్చారు.. పోలీసులు వదిలేశారు..
బంజారాహిల్స్: పోలీసు కస్టడీ నుంచి సెంట్రీ కళ్లు కప్పి నిందితుడు పరారైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని కౌశిక్ సొసైటీలో రాజస్తాన్‌కు చెందిన నసీర్ రాజ్‌పుత్ ఎస్ఆర్ సర్జికల్స్, ఈఎస్ఆర్ గార్మెంట్స్ పేరుతో కంపెనీ కార్యాలయం తెరిచి ఉద్యోగాల పేరుతో పలువురిని లక్షలాది రూపాయల మేర టోకరా వేసి కుటుంబం సహా పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నసీర్ రాజ్‌పుత్‌ను రాంచీలో పట్టుకున్నారు. అతడిని శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజ్‌పుత్ తరచూ మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లసాగాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో సెంట్రీ, విధి నిర్వహణలో ఉన్న జమేదార్ నరేష్ కళ్లు కప్పి పరారయ్యాడు. పోలీసులు గాలించినా దొరకలేదు. కాగా, పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడానికి తామంతా డబ్బులు జమ చేసి పోలీసులను విమానంలో రాంచీ వెళ్లేందుకు సహకరించామని, తీరా చూస్తే నిందితుడిని వదిలేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచీలో నిందితుడితోపాటు అతడి కుటుంబ సభ్యులు పట్టుబడ్డారని, వారంతా ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. అలాగే నిందితుడు పట్టుబడ్డ సమయంలో రూ. 70 లక్షలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టి సారించారు. నిందితుడి పరారీలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. -
కేబీఆర్ పార్క్‌లో స్మగ్లర్లు అరెస్ట్
-
కేబీఆర్ పార్క్‌లో స్మగ్లర్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్‌లో ఐదుగురు గంధం స్మగ్లర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... గత రాత్రి కేబీఆర్ పార్క్‌లోని గంధం చెట్లను ఐదుగురు స్మగ్లర్ల నరికివేస్తుండగా... అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు చాకుచక్యంగా వ్యవహారించి ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్మగ్లర్లను పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. గత కొంతకాలంగా కేబీఆర్ పార్క్‌లో గంధపు చెట్లు అపహరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్క్ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గురువారం రాత్రి ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్‌లో దాదాపు 200 గంధపు చెట్లు ఉన్న సంగతి తెలిసిందే. -
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్‌పై ఫిర్యాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును విరుద్ధంగా దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారులో ప్రయాణించినందుకు తెలుగు యువత నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. నగర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారు వాడారని ఆరోపించారు. కాగా దిగ్విజయ్‌పై కేసు నమోదు చేయలేదని, ఈ విషయాన్ని విచారిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ విషయంపై డిగ్గీరాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల్ని అడగాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఎర్రబుగ్గ కార్లను వాడాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారు పదవుల్లో లేని దిగ్విజయ్ ఎర్రబుగ్గ కారు వాడటం వివాదాస్పదమైంది.