బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
హైదరాబాద్ : తమపై దాడి చేసి గాయపరిచిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ - జవహర్కాలనీలో నివాసముంటున్న మొనాలిసా అనే హిజ్రా బోనాల పండుగ రోజున మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది.
తనపై నమిత అనే మరో హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చిందని మొనాలిసా భావించింది. ఆ క్రమంలో నమితపై మోనాలిసా గురువారం రాత్రి రౌడీలతో దాడి చేయించింది. ఈ దాడిలో నమిత చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై గత మూడు రోజులుగా ముగ్గురు హిజ్రాలను రౌడీలు కిడ్నాప్ చేసి బాలానగర్‌లో ఓ గదిలో ఉంచి తీవ్రంగా హింసించారు. ఈ నేపథ్యంలో హిజ్రాలు బంజారాహిల్స్ పీఎస్కు చేరుకుని మొనాలిసాను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.