బంజారాహిల్స్: ఈ చిట్టి పోలీసును చూశారుగా. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జకీర్ హుస్సేన్‌తో ఏదో కేసు గురించి సీరియస్‌గా చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నాడు కదూ. ఇతడి పేరు మోహన్‌సాయి. వయసు ఏడేళ్లు మాత్రమే. కానీ పోలీసయ్యాడు. తన చిరకాల కోరికను ఇలా తీర్చుకున్నాడు. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్దామా.. ఏపీలోని గుంటూరుకు చెందిన బ్రహ్మం, లక్ష్మి దంపతులకు ఏడేళ్ల కుమారుడు మోహన్‌సాయి ఉన్నాడు. నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఈ బాలుడు కేన్సర్ బారిన పడ్డాడు. నగరంలోని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో ఏడాది కాలంగా కుమారుడికి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. తనకు పోలీస్ కావాలని ఉందంటూ తల్లిదండ్రులకు చెబుతుండేవాడు. మోహన్‌సాయి పరిస్థితి చూసి వారి మనసు చలించేది.
కన్నీటి పర్యంతమయ్యేవారు. మోహన్‌సాయి కోరికను ఆస్పత్రి సిబ్బంది ద్వారా తెలుసుకున్న ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను కలిశారు. మోహన్‌సాయి అభిలాషను తీర్చేందుకు వారు అంగీకరించడంతో శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. పోలీస్ యూనిఫాంలో స్టేషన్‌లోకి అడుగుపెట్టిన మోహన్‌సాయికి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జకీర్ హుస్సేన్ సెల్యూట్ కొట్టి స్టేషన్‌లోకి తీసుకువెళ్లారు. బాలుడిని తన సీట్లో కూర్చోబెట్టి ఠాణా పని తీరుపై ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment