కొడుకు చనిపోయాడనుకుని.. తనువు చాలించిన మాతృమూర్తి
మాట వినడంలేదనే కోపంలో కుమారుడిని గట్టిగా లాగిన తల్లి
విసురుగా వెళ్లి మంచంకోడుకు తల తగిలి స్పృహ తప్పిన బాలుడు
కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడని భయపడి ఆత్మహత్య
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన
హైదరాబాద్: ఆడుకునేందుకు బయటకెళ్లిన కుమారు డు ఆలస్యంగా ఇంటికి చేరడం.. చెప్పిన మాట వినకపోవడంతో ఆ తల్లికి పట్టరాని కోపం వచ్చింది. కుమారుడిని గద్దించేందుకు గట్టిగా లాగడంతో అతను వెళ్లి మంచంకోడుకు తగిలి స్పృహ తప్పాడు. రక్తపు మడు గులో పడి ఉన్న కొడుకు ఎంతకీ కదలకపోవడంతో చనిపోయాడేమోననుకుని భయపడిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. హృదయవిదారకమైన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబగం గ్రామానికి చెందిన జి.సునీత(23), జి.ఈశ్వర్‌రావు దంపతులు. బంజారా హిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఈశ్వర్.. రెండు రోజుల క్రితం వైజాగ్ వెళ్లాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు నిహార్, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం నిహార్ బయటకు వెళ్లగా.. అతడి కోసం సునీత అంతటా గాలించినా ఎక్కడా ఆచూకీ లేదు. దీంతో ఇంటి ముందే ఏడుస్తూ కూర్చుంది. ఐదు గంటల తర్వాత నిహార్ ఇంటికి వచ్చాడు. దీంతో కోపం పట్టలేక సునీత కొడుకును లోపలికి ఈడ్చుకెళ్లి స్నానం చేయాలని చెప్పింది.
వినకపోవడంతో నిహార్‌ను గట్టిగా లాగింది. విసురుగా లాగడంతో నిహార్ తలకు మంచంకోడు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కొడుకు ఎంతకూ కదలకపోయేసరికి సునీత భయపడింది. తీవ్ర మానసిక సంఘర్షణకులోనై చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి కళ్లు తెరిచిన నిహార్ లేచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ తల్లి కనిపించింది. అమ్మా.. అమ్మా అంటూ పిలుస్తూ ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు గమనించారు. చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.