బాధల బతుకొద్దని.. | Well dismissed the mother of two daughters committed suicide | Sakshi
Sakshi News home page

బాధల బతుకొద్దని..

Published Mon, Apr 11 2016 1:59 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Well dismissed the mother of two daughters committed suicide

ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక.. అఘాయిత్యం

 

రోజూ తాగొచ్చి కొడుతుంటే.. భర్తేకదా అని భరించింది. సొంతూళ్లో ఉన్న నాలుగెకరాల పొలాన్ని సారా కోసం అమ్మేసి నడివీధిలో నిలబెడితే.. ఓర్చుకుంది. చివరికి తలదాచుకునేందుకు గూడులేకుండా చేసినా.. తట్టుకుంది. ఇద్దరు బిడ్డలను తీసుకుని దుర్భర స్థితిలో పుట్టింటికి చేరుకుంది. అయితే అత్తగారింటికొచ్చినా.. ఆ మందుబాబులో మార్పు రాలేదు. కూలీనాలీ చేస్తే వచ్చిన సొమ్మును తాగుడుకు తగలేయడమే కాకుండా.. భార్యను రోజూ చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. శనివారం అర్ధరాత్రి ఆ వేధింపులు తట్టుకోలేనంత స్థాయికి చేరాయి.. ఇక మనం భరించలేం.. ఇలాంటి వాడితో నిత్యం చస్తూ బతకడం కంటే.. ఒక్కసారిగా వెళ్లిపోవడమే నయమని ఆ ఇలాల్లు నిర్ణయించుకుంది. అంతే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని.. సమీపంలోని బావి వద్దకు వెళ్లింది. ఇంటి నుంచి తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్‌ను చిన్నకూతురుకి తినిపించింది. ఒక్కసారిగా కూతురుని చేతుల్లోకి తీసుకుని బావిలోకి తోసేసింది. అనంతరం పెద్దకూతురితో కలసి నీళ్లలో దూకి తనువు చాలించింది. మద్యం మహమ్మారి కుటుంబాలను ఎంత నిర్దయగా చిదిమేస్తుందో.. తెలియజేసే ఈ హృదయ విదారక ఘటన పీలేరు మండలంలోని మిథులానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

 

పీలేరు :  మద్యానికి బానిసైన వ్యక్తి భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెందింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం మిధులానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుల బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం మిథులానగర్‌కు చెందిన ఎం.దేవేంద్ర, వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె సునీత(32)ను నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మునిశేఖర్‌కు ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారి సంసా రం రెండేళ్లు సాఫీగా సాగింది. వీరికి యశ్విని(7), నవ్య(5) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన మునిశేఖర్ తనకున్న నాలుగు ఎకరాల పొలం అమ్మేశాడు. దీంతో నాయుడుపేటలో బతుకుదెరువు లేకపోవ డం, భర్త ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్న ఆశతో సునీత తన పుట్టినిల్లు అయిన మిథులానగర్‌కు వచ్చేసింది. వారితో పాటు మునిశేఖర్ కూడా ఇక్కడికే వచ్చేశారు. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మునిశేఖర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఐదేళ్లుగా భర్త పెట్టే నరకయాతనను బిడ్డల కోసం భరించింది. శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మునిశేఖర్ భార్య సునీత(32)ను తీవ్రంగా కొట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇద్దరు బిడ్డలతోపాటు ఆదివారం తెల్లవారుజామున ఊరు సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది.


తాను చనిపోతే బిడ్డలను చూసే దిక్కు ఉండదని భావించింది. చిన్నకుమార్తెకు బిస్కెట్ తినిపించి బావిలో తోసేసింది. తరువాత పెద్ద కుమార్తెను ఎత్తుకుని తానూ బావిలో దూకేసింది. సునీత కోసం బంధువులు, తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ తెలియలేదు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిథులానగర్ సమీపంలోని బావిలో నవ్య మృతదేహం తేలింది. దీన్ని గమనించిన గ్రామస్తులు పీలేరు సీఐ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని సునిత, యశ్విని, నవ్య మృతదేహాలను వెలికి తీయించి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సునిత భర్త మునిశేఖర్ పరారీలో ఉన్నాడు. తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో మిథులానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement