క్రైమ్: స్నేహితుని కోసం ఆన్‌లైన్‌లో రుణం తీసుకుంటే.. వాడు నట్టేట ముంచాడు. రికవరీ యాప్స్ ఏజెంట్లు రాబంధువుల్లా అతనిపై పడి పీక్కుతినే యత్నం చేశారు. ఎటూ పాలుపోని స్థితిలో ఆ స్టూడెంట్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భయంతో తల్లిదండ్రుల్ని క్షమాపణ కోరుతూ లేఖ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కర్ణాటక జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ కాలనీలో మంగళవారం జరిగింది.
యెలహంకలోని ఒక ప్రైవేటు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆరో సెమిస్టర్ చదువుతున్న తేజస్ (22) కాలేజీ టాపర్. మహేష్ అనే స్నేహితుడికి డబ్బు అత్యవరం పడడం.. అతని బలవంతం మేరకు మూడు లోన్ యాప్స్ ద్వారా మనీ తీసుకున్నాడు. అయితే.. మహేష్ హ్యాండిచ్చాడు. ఏడాది నుంచి స్నేహితుడు EMI వాయిదాలు కట్టడం లేదు. రుణం తేజస్ పేరుమీద ఉండటంతో అప్పు ఇచ్చిన కంపెనీల రికవరీ ఏజెంట్లు తేజస్‌ను వేధించసాగారు. చివరకు.. జీవితం మీద విరక్తి చెందిన తేజస్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు డెత్‌నోట్ రాసి ఇంట్లో తల్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అమ్మనాన్న నేను చేస్తున్న దానికి నన్ను క్షమించండి,
నాకు మరో దారి కనిపించడం లేదు.
నా పేరు మీద ఉన్న అప్పు తీర్చడం నా వల్ల కాదు,
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా,
థాంక్యూ, గుడ్ బై
‘‘మా కుటుంబ సభ్యుల నగ్నఫోటోల్ని వైరల్ చేస్తామంటూ వాళ్లు బెదిరించారు. కొందరు స్నేహితులకు మా ఎడిటింగ్ ఫొటోల్ని షేర్ చేశారు. మా ఇంటి ద్గగర ఓ కెమెరాను ఉంచారు. ఆ విషయం మా దృష్టికి రావడంతో.. వేధింపుల గురించి తెలిసింది. 4,00,000 లోన్ నేను చెల్లిస్తానని.. చక్కగా చదువుకోమని నా కొడుక్కి ధైర్యం చెప్పా. అయితే చెల్లిస్తామని చెప్పినా.. రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగలేదు. ఇవాళ ఉదయం నా కొడుకు శవం ఇంటి దగ్గర ఉన్నప్పుడూ కూడా ఓ ఏజెంట్ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఇక్కడి నుంచి గప్‌చుప్‌గా వెళ్లిపోయాడు. ఇది లోన్ యాప్స్ చేసిన హత్యే. సమస్యలేమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి. మీలో మీరే మదనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి అంటూ యువతకు కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తున్నాడు తేజస్ తండ్రి గోపీనాథ్. ఘటనకు సంబంధించి సదరు లోన్ యాప్స్ మీద ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment