
మహమ్మద్ బాబ్‌జాన్ (ఫైల్)
చల్లపల్లి: లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన టైలర్ మహమ్మద్ ఇనాయతుల్లా (ఛన్నా) ఏకైక కుమారుడు మహమ్మద్ బాబ్‌జాన్ (31)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పదకొండు నెలల బాబు ఉన్నాడు. బాబ్‌జాన్ వృత్తి రీత్యా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల లోన్ యాప్‌ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించాలని నిత్యం లోన్ యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల బాబ్‌జాన్ తండ్రికి లోన్ యాప్ వారు ఫోన్ చేసినపుడు అప్పు ఉంటే చెల్లిస్తామని చెప్పారు.
అయినప్పటికీ అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ.. నిత్యం వేధింపులు కొనసాగించారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాబ్ జాన్ సోమవారం రాత్రి విజయవాడలోని తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.