challapalli
-
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
చల్లపల్లి: లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన టైలర్ మహమ్మద్ ఇనాయతుల్లా (ఛన్నా) ఏకైక కుమారుడు మహమ్మద్ బాబ్జాన్ (31)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. పదకొండు నెలల బాబు ఉన్నాడు. బాబ్జాన్ వృత్తి రీత్యా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని విజయ పాల ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల లోన్ యాప్‌ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించాలని నిత్యం లోన్ యాప్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల బాబ్జాన్ తండ్రికి లోన్ యాప్ వారు ఫోన్ చేసినపుడు అప్పు ఉంటే చెల్లిస్తామని చెప్పారు. అయినప్పటికీ అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడుతూ.. నిత్యం వేధింపులు కొనసాగించారు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాబ్ జాన్ సోమవారం రాత్రి విజయవాడలోని తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెల్‌ఫోన్ వాడడు.. సీసీ కెమెరాకు చిక్కడు.. శ్మశానంలోనే తిండి, నిద్ర..
సాక్షి, మచిలీపట్నం: అతని వయసు వయస్సు 28.. చేసిన దొంగతనాలు 127.. నమోదైన కేసులు 54.. ఎక్కకెళ్లినా ఒక్కడే వెళ్తాడు.. కనీసం సెల్‌ఫోన్ కూడా వాడడు.. పోలీసులకు ఏ ఒక్క క్లూ వదలడు.. సీసీ కెమెరాకూ దొరకడు.. చదువుకున్న వ్యక్తీ కాదు.. కానీ చాలా స్మార్ట్. శ్మశానాన్నే అడ్డాగా చేసుకుని తన పంథా కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి.. ఆకతాయిగా కోడిపుంజును దొంగిలిండంతో తొలిసారి జైలు కెళ్లాడు.. ఆపై దొంగతనాన్నే వృత్తిగా మార్చుకుని.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చల్లపల్లి పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి: భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జిలో షాకింగ్ ఘటన.. ఇదీ నేపథ్యం.. ఈ దొంగ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన వాడు. పేరు తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య. వయస్సు 28. తన పదో ఏటే తండ్రి మరణించాడు. రెండేళ్ల తర్వాత అదే గ్రామంలో పందెం కోళ్లను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లిదండ్రులు లేక అనాథగా మారిన సూర్యని ఎ. కొండూరు మండలం మాధవవరంలో ఉన్న తన అమ్మమ్మ చేరదీసింది. చదువు మీద దృష్టి పెట్టని సూర్య దొంగతనమే మేలని భావించి.. ఆ దిశగానే అడుగులు వేశాడు. చోరీలు ఇలా.. మొదట కోళ్లను దొంగలించి జైలు పాలైన సూర్య.. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకున్నాడు. అందులో భాగంగా చేతికి గ్లౌజ్‌లు ధరించడం మొదలు పెట్టాడు. ఇక సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం ఎలా చేయాలనే దానిపై కూడా తనకుతానుగానే ఆలోచించుకుని.. ఎవరూ లేని నివాసాలే లక్ష్యంగా చోరీలు చేస్తుండేవాడు. అందుకోసం ముందుగా ఓ బైక్‌ను తస్కరించడం.. దానిపై వారం పాటు వీధుల్లో తిరిగి.. డబ్బులు, నగలు ఉన్న వారి నివాసాలను గుర్తించడం చేసేవాడు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవా? పరిశీలించేవాడు. ఆ తర్వాత కుటుంబీకులు తాళం వేసి ఎప్పుడు బయటకు వెళ్తారా? అని ఎదురుచూసేవాడు. కుటుంబీకులు బయటకు వెళ్లాక చేతికి గ్లౌజ్‌లు ధరించి నివాసాల్లోకి చొరబడేవాడు. ఒకవేళ అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ముందే పనిచెయ్యకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అనంతరం నివాసంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దొంగలించి సురక్షితంగా వెలుపలకు వచ్చేసేవాడు. ఇలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ దొంగతనాలపై 47 కేసులు నమోదయ్యాయి. గతనెల 17న ఖమ్మం జైలు నుంచి బయటకు వచ్చిన సూర్య, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, కృష్ణా జిల్లా గుడివాడ, చల్లపల్లి దొంగతనాలు చేశాడు. దీంతో ఇతనిపై మొత్తం 54 కేసులు నమోదయ్యాయి. శ్మశానమే నివాసంగా.. దొంగతనం చేసిన ఆభరణాలు, నగదుతో ఎక్కడో ఓ చోట గదిలో ఉంటే పోలీసులకు దొరికిపోతానేమోనని సూర్య శ్మశానాన్ని ఎంచుకున్నాడు. ఎవరికీఅనుమానం రాని శ్మశానంలో వాటిని గొయ్యితీసి దాచిపెడతాడు. చిన్నతనం నుంచే రాటుదేలిన సూర్య ఎటువంటి భయాలు, పట్టింపులు లేకుండా అక్కడే నిద్రిస్తాడు. అంతకు ముందు మద్యం, భోజనం తెచ్చుకుని ఫుల్‌గా లాగించి పడుకుంటాడు. ఉదయం లేచి యథావిధిగా వీధుల్లో తిరగటం, సినిమాలకు వెళ్లటం చేస్తుంటాడు. బంధువులు ఉన్నా.. సూర్యకు బంధువులు ఉన్నా.. వారితో ఎటువంటి సత్సంబంధాలు నెరిపేవాడు కాడు. ఎప్పుడైనా అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి వచ్చేసేవాడు. చివరగా కృష్ణా జిల్లా చల్లపల్లి సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు చాకచక్యంగా సూర్యను పట్టుకుని అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 17లక్షలు విలువ చేసే బంగారు, రూ. 2లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకుని అతని దొంగతనాలకు చెక్‌పెట్టారు. -
చీటింగ్ కేసులో టీడీపీ నేత అరెస్ట్
చల్లపల్లి(అవనిగడ్డ): ఎన్నారై ముసుగులో అమెరికాలో నివసించే వారికి చెందిన పొలాన్ని వేరొకరికి అమ్మేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అడ్డంగా దొరికిపోయాడు. 2014లో జరిగిన ఈ మోసంపై పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో నిజం నిగ్గుతేలడంతో చల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండల పరిషత్ లక్ష్మీపురం–2వ సెగ్మెంట్‌కు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న టీడీపీ నేత, చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరానికి చెందిన వేపూరి సాంబశివరావు (శివయ్య) అదే పంచాయతీ చింతలమడకు చెందిన మరో టీడీపీ నేత నూకల శ్రీనివాసరావుతో కలిసి మోసానికి పాల్పడ్డారు. మచిలీపట్నం శివారు వాడపాలెంకు చెందిన నల్లూరి వెంకటేశ్వరరావు కుమారులు నల్లూరి సత్యసురేష్, నల్లూరి నాగసతీష్‌లకు చెందిన వాడపాలెం, పెదయాదరల్లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2014లో రామానగరానికి చెందిన టీడీపీ నాయకుడు వేపూరి సాంబశివరావు, చింతలమడకు చెందిన నూకల శ్రీనివాసరావు తామిద్దరూ నాగ సతీష్, సత్య సురేష్‌లుగా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి, నకిలీ పొలం డాక్యుమెంట్లు సృష్టించి విజయవాడకు చెందిన జాలాది శ్రీమన్నారాయణ కుమారుడు హేమచంద్‌కు విక్రయించారు. ఈ విక్రయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించారు. తమకు చెందిన భూమి వేరొకరు తప్పుడు ఆధారాలు, బోగస్ గుర్తింపు కార్డులు, నకిలీ డాక్యుమెంట్లతో వేరొక చోట రిజిస్ట్రేషన్ చేయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుసుకున్న బాధితులు 2019లో బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో రిజిస్ట్రేషన్ జరిగింది చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు కేసును చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. కేసును రీ–కన్స్ట్రక్షన్ చేసి దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు గుర్తించిన పోలీసులు చీటింగ్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, వేరొక వ్యక్తులను తాముగా చూపి మోసానికి పాల్పడిన నేరం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు వేపూరి సాంబశివరావు అలియాస్ శివయ్య, నూకల శ్రీనివాసరావులను చల్లపల్లి సీఐ ఎన్.వెంకట నారాయణ అరెస్ట్ చేసి మొవ్వ ఏజెఎఫ్‌సీఎం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించి అవనిగడ్డ సబ్ జైలుకు తరలించారు. -
ఆదిత్య హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు..
తెలిసి తెలియని వయసులో విద్యార్థులు తప్పటడుగులు వేస్తున్నారు. క్షణికావేశాలకు లోనై జీవితాలనే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. మధురానుభూతులు నింపుకోవాల్సిన బాల్యంలో హత్యలు చేసి కటకటాల పాలవుతున్నారు. పసి హృదయంలో కర్కశత్వం నింపుకొని అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారు. సాక్షి, కృష్ణా : ఇప్పటి వరకు విద్యా సంస్థల వసతిగృహాల గదుల్లో చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవరూ ఊహించని ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పదిహేనేళ్ల విద్యార్థి తొమ్మిదేళ్ల విద్యార్థిని హత్య చేయడం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో చదివే మూడో తరగతి విద్యార్థిని క్రూరంగా గొంతు కోసి చంపాడు. చిన్నపాటి వాగ్వాదం నేపథ్యంలో హత్య జరగడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లలపై నేరప్రవృత్తి ప్రభావంతో మనస్తత్వంలో వస్తున్న మార్పులే ఈ విపరీతాలకు కారణమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ వాతావరణం సరిగాలేక.. ప్రపంచంలో మనకు తప్ప మరే దేశానికి లేని గొప్పవరం భారతీయ కుటుంబ వ్యవస్థ. మారుతున్న సమాజ పోకడల నేపథ్యంలో ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం కూడా ఈ విపరీత ధోరణులకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక ఎవరో ఒకరి దగ్గర పెరగడం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలతో పిల్లల మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తున్నాయి. పెద్దల అప్యాయత, అనురాగం లభించక వారిలో సున్నితత్వం లోపిస్తోంది. పిల్లల్లో తెలిసి తెలియని వయసులో మొలకెత్తుతున్న నేరప్రవృత్తిని గుర్తించి, నిలువరించలేకపోవడం కూడా వారు మరింత చెడిపోవడానికి కారణమవుతోంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. మీడియా ప్రభావం.. సినిమా, టీవీ, సోషల్‌మీడియాల్లో ప్రసారమవుతున్న హింసాత్మక దృశ్యాలు పిల్లల కంట పడి వారి మానసిక స్థితిలో మార్పును తెస్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు చూసిన వీరు కుంగుబాటు, యాంగ్జైటీ, ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక సమస్యల బారిన పడతారని అధ్యయనాల్లో తేలింది. బ్లూవేల్ గేమ్స్, సిని మాల్లో హింసాత్మక దృశ్యాలు, నిజమైన క్రైమ్ సీన్స్‌ను ఆసక్తిగా చూడటానికి ప్రధాన కార ణం సున్నితత్వం సన్నగిల్లడమేనని తెలుస్తోంది. సిని మాల్లో అశ్లీల దృశ్యాలపై సెన్సార్షిప్ ఉన్నట్లే, శ్రుతి మించిన హింసాత్మక ఘటనలపైనా నిబంధనలు ఉండాలని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. చల్లపల్లి హత్య ఘటనలో నిందితుడైన విద్యార్థి సినిమా ఫక్కీలో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. హత్యకు ఉపయోగించిన చాకు కడగడం, దుస్తులను బ్యాగులో దాచడం, ఏమీ తెలియని అమాయకుడిలా న టించడం ఇవన్నీ చూస్తే తను ఎంతలా ఆలోచించాడో తెలుస్తోంది. ఇలాంటివన్నీ పిల్లలు సినిమాలు, సీరియల్స్‌లో తరుచూ చూసే ఘటనలే. చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య నైతిక విలువలు నేర్పకపోవడమే పిల్లలు ఎదగాల్సిన రీతిలో ఎదగకపోవడంతో వారిలో యాంటీ సోషల్ బిహేవియర్ పెరుగుతుంది. ఇది తొలి దశలో గుర్తించకపోవడంతో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌గా మారుతుంది. సరైన వాతావరణంలో పెరగకపోవడం, తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలు దక్కకపోవడం కూడా వారిని కర్కశత్వంగా మారుస్తుంది. ప్రతీకార మనస్తత్వం పెరిగి చిన్నచిన్న గొడవలకు సైతం దాడులు చేసి తప్పు చేస్తున్నారు. వీటిని ప్రాథమిక దశలో కనుగొని నివారించడానికి ప్రతి హాస్టల్, విద్యా సంస్థల్లో సైకాలజిస్ట్‌ను నియమించాలి. వారికి నైతిక విలువలు, క్రమశిక్షణ వంటి విషయాలను నేర్పి మంచి మార్గంలో పయనించేలా చేయవచ్చు. – టీఎస్ రావు, మానసిక నిపుణుడు, విజయవాడ పరిపక్వత లేకపోవడమే 13–15 ఏళ్ల మధ్య పిల్లలు మానసిక పరిస్థితి వింతగా ఉంటుంది. పూర్తి పెద్దల మాదిరిగా ఆలోచించరు, పూర్తి పిల్లలవలే ప్రవర్తించరు. మెదడు పూర్తిగా పరిపక్వత చెందని స్థితి. భావోద్వేగాలను నియంత్రించే వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల తీవ్ర ఉద్వేగాలకు లోనై ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తిస్తారు. అటువంటి సమయంలో చుట్టూ ఉన్నవారు గుర్తించి వారికి ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పాలి. కొన్నిసార్లు పక్క వారు రెచ్చగొట్టడం వల్ల కూడా వారు నేరాలకు పాల్పడేలా చేస్తాయి. కుటుంబంలో నేర ప్రవృత్తి ఉన్న వారు ఉండటం కూడా వారిని ప్రభావితం చేస్తుంది. – ఇండ్ల విశాల్, చైల్డ్ సైకాలజిస్ట్, విజయవాడ -
'చిన్న గొడవకే హత్య చేశాడు'
సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్లో మంగళవారం బాత్రూమ్లో అనుమానాస్పద స్దితిలో మృతి చెందిన ఆదిత్య మర్డర్ మిస్టరీని 24 గంటల్లోనే ఛేదించినట్టు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. తనను దూషించాడన్న కారణంతో అదే హాస్టల్లో ఉంటున్న పదవ తరగతి విద్యార్థే, ఆదిత్యను హత్య చేసినట్లు తెలిపారు. రెండురోజుల క్రితం హాస్టల్లో బట్టలు ఉతుకుతున్న ఆదిత్యకు, పదవ తరగతి విద్యార్థికి మధ్య చిన్న గొడవ జరిగిందని, ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆదిత్య, పదవ తరగతి విద్యార్థిని దుర్భాషలాడారని, ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటివ్‌గా తీసుకునే సదరు విద్యార్థి.. ఆదిత్య మాటలను మనసులో పెట్టుకొని ఎలాగైనా అతన్ని హత్య చేయాలని భావించాడని ఎస్పీ తెలిపారు. ‘సోమవారం అర్థరాత్రి ఆదిత్య ఉంటున్నరూమ్లోకి వెళ్లి బాత్రూమ్ వరకు తోడుగా రావాలని పిలిచాడు. ఇదే అదనుగా భావించి బాత్రూమ్కు వచ్చిన ఆదిత్య పీక నులిమి చంపాలని ప్రయత్నించాడు. అప్పటికి చావకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆదిత్య గొంతు కోసి, హాస్టల్ గోడ దూకి పారిపోయాడు. మరునాడు తెల్లవారుజామున ఎవరికి అనుమానం రాకుండా హాస్టల్‌కు చేరుకొని.. తాను బయటికి వెళ్లాలని, రాత్రి హాస్టల్‌కు రాలేదని నిందితుడు వాచ్‌మెన్‌కు తెలిపాడు. ఆదిత్య హత్యకు ఉపయోగించిన కత్తిని, బట్టలను డాగ్ స్క్వార్డ్ పసిగట్టడంతో, హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకొని సైకాలజీ కౌన్సెలింగ్ నిర్వహించాం. హత్య చేసిన విద్యార్థి తండ్రికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి పిల్లలపై సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. హత్య చేసిన తర్వాత ఎలా జాగ్రత్త పడాలో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు’ అని ఎస్పీ రవీంద్రనాధ్ తెలిపారు. -
దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ
సాక్షి, అవనిగడ్డ : చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య(8) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సోమవారం ఆదిత్యతో జరిగిన గొడవ కారణంగా పథకం ప్రకారం చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పెన్సిల్ చెక్కే బ్లేడ్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదో తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఆదిత్యను బాత్రూమ్కు తోడు తీసుకు వెళ్లి అనంతరం బ్లేడ్‌తో గొంతు కోశాడు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు, ఆదిత్య కొన్నిరోజులు కలసి పడుకున్నారు. అయితే అతడి వికృత చేష్టలకు భయపడి ఆదిత్య అతడి దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక నిందితుడితో పాటు హాస్టల్ వార్డెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సస్పెండ్ చేశారు. -
‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’
సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన దాసరి ఆదిత్యది(8) హత్యేనని అడిషినల్ ఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాత్రి రెండు గంటల తర్వాత ఈ హత్య జరిగిందని వెల్లడించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆయుధాలు లభించలేదన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి హాస్టల్ వాచ్మెన్ డ్యూటీలో లేడని, సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషినల్ ఎస్పీ వెల్లడించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసు విచారణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని అడిషినల్ ఎస్పీ సత్తిబాబు పేర్కొన్నారు. (చదవండి : హాస్టల్లో అమానుషం ; బాత్రూంలో మృతదేహం) హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం మూడోతరగతి విద్యార్థి ఆదిత్య మృతిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ డిప్యూటీ డైరెక్టర్ రమాభార్గవి స్పందించారు. హాస్టల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. హత్య జరిగిన రాత్రి హాస్టల్లో వాచ్మెన్, వార్డెన్ లేరన్నారు. బయట వ్యక్తులు లోపలికి రావడం వల్లే ఈ హత్య జరుగొచ్చనే అనుమానం తనకు ఉందన్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసులు విచారణలో నిందితులెవరో తెలుస్తుందని రమా భార్గవి అన్నారు. మరిది, వాచ్మెన్పై అనుమానం వాచ్‌మెన్‌తో కలిసి తన మరిదే తన కొడుకును హత్య చేశారని ఆదిత్య తల్లి ఆదిలక్ష్మీ ఆరోపించారు. వారిద్దరిపైనే తమకు అనుమానం ఉందన్నారు. తన బిడ్డకు జరినట్లు ఏ బిడ్డకు జరుగొదంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
చిన్న చూపేల బాబూ!
సాక్షి, అవనిగడ్డ : ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన గ్రామంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలోని డ్రైనేజీ అధ్వానంగా దర్శనమిస్తోంది. 2016 నవంబర్ 11న గ్రామాన్ని సందర్శించిన అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బైపాస్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ బైపాస్ రోడ్డుతో పాటు, మండల పరిషత్ కార్యాలయం నుంచి 6వ నంబరు కాలువ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. కొంతకాలానికే గ్రామం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తామని ప్రకటించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయమని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రూ.11.50 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం బైపాస్ రోడ్డు డ్రైనేజీ అయినా అభివృద్ధి చేసి ఉంటే, గ్రామంలో కొంతమేర అయినా సమస్య పరిష్కారం జరిగుండేది. లక్ష్మీపురం కేంద్రంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి లక్ష్మీపురంలో యుద్ధప్రాతిపదికన హెవీ బోర్లు వేయించారు. పనులు, కార్యాచరణ కానరాలేదు. దీంతో అభివృద్ధి మాటలకే పరిమితమైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
బైక్ చక్రంలో చీర చుట్టుకుని..
చల్లపల్లి: ప్రమాదం ఏ రూపంలో అయినా ఎదురు కావచ్చు.. మృత్యువు ఎలాగైనా రావచ్చు... ఇలాంటి అనుకోని ఘటనే చల్లపల్లిలో జరిగింది. ద్విచక్ర వాహనం చక్రంలో చీర చుట్టుకుని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణాజిల్లా భావదేవరపల్లికి చెందిన అరజా ఝాన్సి (64) భావదేవరపల్లి నుంచి అవనిగడ్డ వైపు బైక్‌పై వస్తున్నది. అయితే దురదృష్టవశాత్తు 9వ వార్డు పెట్రోల్ బంకు వద్దకు రాగానే చక్రంలో చీర చుట్టుకుపోవడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి ఝాన్సి మృతదేహం దగ్గర కూలబడి కన్నీటి పర్యంతమయ్యాడు. సంఘటనాస్థలంలో పోగైన జనం ప్రమాదం గురించి తెలుసుకుని కంటతడి పెట్టారు. చీర, చుడీదార్ ధరించి దిచక్రవాహనాలపై ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రమాదం సూచిస్తోందని పేర్కొన్నారు. -
క్యాబేజీ మట్టిపాలు
చల్లపల్లి : పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు..అమ్ముకుందామంటే మార్కెట్ సౌకర్యం లేదు..పంటను ట్రాక్టర్‌తో దున్నేందుకు సిద్ధమయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్లముందే మట్టిలో కలిసిపోతుండటంతో గుండె బరెవెక్కింది. ఇంటికి వెళ్లిపోయాడు. చక్కని క్యాబేజీ కాయలు ట్రాక్టర్ కింద పడి నలిగిపోతుంటే చూసిన స్థానికులు కొందరు పరుగున వచ్చారు. నాలుగు కాయలు కోసి పేదవారికి పంచిపెడతామని కోరటంతో ఆ రైతు అంగీకరించాడు. అప్పటికే ఎకరంన్నర మేర పంట నుజ్జునుజ్జవగా, మిగిలిన పంటను స్థానికులు కోసుకెళ్లారు. చల్లపల్లికి చెందిన రైతు పిన్నమనేని పాండురంగారావు (పసి) రెండు ఎకరాల పొలం రూ.46వేలు నగదు కౌలుకు తీసుకుని రూ.80వేలు పెట్టుబడితో క్యాబేజీ పండించారు. కానీ మార్కెట్లో ఎటు చూసినా కూలీ, రవాణా ఖర్చులకు కూడా డబ్బు రాని పరిస్థితి కనిపించింది. మంగâళవారం పంటను ట్రాక్టర్‌తో తొక్కించేశారు. మిగిలింది ఉచితంగా ఇచ్చేశారు. -
పిల్లలతో సహా కానిస్టేబుల్ ఆత్మహత్య
చల్లపల్లి : తన ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లిలో శుక్రవారం వెలుగు చూసింది. మోపిదేవి మండలం పెదప్రోలుకు చెందిన యదలపల్లి రమేష్ (38) అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇతనికి కార్తీక్ (7), శ్రావ్య (4) పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి తన ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిన రమేష్... ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోడూరు మండలం సాగరసంగమం వద్ద రమేష్ బైక్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సముద్ర తీరంలో రమేష్, శ్రావ్యల మృతదేహాలు లభించాయి. కార్తీక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రమేష్ పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
చర్లపల్లిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
-
విషజ్వరంతో ఒకరు మృతి
చల్లపల్లి (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మరో వ్యక్తి విషజ్వరంతో చనిపోయాడు. చేపలవేట, వ్యవసాయ కూలిపనులు చేసుకునే గ్రామానికి చెందిన తిరుమలశెట్టి బాబూరావు(48)కి నెల రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. తొలుత స్థానికంగా చికిత్స పొంది తగ్గకపోవడంతో మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స తీసుకున్నాడు. అక్కడ వైద్య సేవలు అందించిన డాక్టర్లు విషజ్వరం వల్ల లోపల లివర్ దెబ్బతిందని చెప్పడంతో కొద్దికాలం వైద్యశాలలో ఉన్న బాబూరావు తరువాత స్వగ్రామానికి వచ్చాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వైద్యశాలలో ఉండి వైద్యం చేయించుకోలేక మందులు తెచ్చుకుని వాడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటలకు తన స్వగృహంలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో ఈ నెల 4న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన విషయం విదితమే. మరుసటి రోజు గ్రామంలో పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎవరూ విషజ్వరాల వల్ల చనిపోలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబూరావు మరణంతో గ్రామస్తులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. -
ఆ ఊరికి ఏమైంది?
వణుకుతున్న కొత్తమాజేరు ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని జ్వరం రెండున్నర నెలల్లో 18 మంది మృత్యువాత సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామం భయంతో వణికిపోతోంది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో విష జ్వరం (లక్షణాలు) సోకిన 18 మంది మ్యత్యువాత పడటం, చిన్నా పెద్దా తేడా లేకుండా జ్వరం పట్టిపీడిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సుమారు రెండు వేల జనాభా కలిగిన గ్రామంలో ప్రస్తుతం ప్రతి రెండు ఇళ్లకు ఒకరు చొప్పున జ్వరంతో బాధపడుతూ మంచాన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలిసిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే రెండుసార్లు గ్రామాన్ని సందర్శించారు. సమస్య తీవ్రతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మొదట్లోనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. మే నెలలోనే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదైనా.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు స్పందించి విషయం వెలుగులోకి తెచ్చిన తర్వాతే ఒకరిద్దరు మంత్రులు మొక్కుబడిగా గ్రామాన్ని సందర్శించారు. నెలరోజుల క్రితం ప్రభుత్వం తూతూ మంత్రంగా ఓ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. రెండురోజుల పాటు నలుగురైదుగురు వైద్యులు, ఏఎన్ఎంలతో హడావుడి చేసినా ప్రస్తుతం ఏ ఒక్క వైద్యుడూ లేకుండా నామమాత్రంగా నడుస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కొత్తమాజేరును సందర్శించాలని నిర్ణయించుకున్నారు. తగ్గినట్టే తగ్గి.. జ్వరాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెట్టడం, తక్కువ వ్యవధిలోనే ఎక్కువమంది మరణించడం గ్రామస్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన జంజనం జయలక్ష్మి జూలై 13వ తేదీన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మరుసటి రోజే ఆమె భర్త జంజనం శ్రీరాములు మరణించడంతో గ్రామంలో మరింత అలజడి రేగింది. గత మే 11 నుంచి జూలై 23 వరకు 18 మంది మరణించారు. ఒక్క మే నెలలోనే 9 మంది మరణించారు. కలుషిత జలాలే జ్వరాలకు కారణమని చెబుతున్న జిల్లా వైద్యాధికారులు.. జ్వరాల వల్ల మరణాలు సంభవించినట్లు పేర్కొనకుండా వేరే వ్యాధుల వల్ల చనిపోయినట్టుగా నమోదు చేస్తున్నారు. కలుషిత జలాలే కారణం జ్వరాల నేపథ్యంలో గుక్కెడు నీళ్లు తాగాలంటేనే గ్రామస్తులు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఓ చెరువు, ఆ చెరువు నీరు ఆధారంగా ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ (నామమాత్రపు ధరకు) గ్రామం తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. పదెకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. కాలువ ద్వారా వచ్చిన నీరు చెరువులోకి చేరటం తప్ప బయటకుపోయే వీల్లేదు. చెరువు పక్కనే ఉన్న ఫిల్టర్బెడ్లు పాడైపోవటంతో నీళ్లు సక్రమంగా శుద్ధికాని పరిస్థితి ఉంది. పైగా గత జనవరిలో తాగునీటి అవసరాల కోసం.. కాలువలకు నీటిని నిలిపివేశారు. ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు కలుషితమైంది. చెరువు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లపై అధికసంఖ్యలో కోతులు చేరుతున్నాయి. అవి చెరువులోకి దిగడం, కొన్ని చెరువులోనే పడి మృతిచెంది వాటి కళేబరాలు నీటిలోనే ఉండిపోవటంతో నీరు మరింత కలుషితమైంది. ఇక చెరువు పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది. చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ నిర్వహణకు నిధులు అంతంతమాత్రంగా ఉండటం, ప్లాంట్‌లో పరికరాలు సక్రమంగా లేకపోవటం, నీరు శుద్ధి చేసినట్లే ఉన్నా నీటిలోని బ్యాక్టీరియా, ఇతరత్రాలు అలాగే ఉండిపోతున్నాయని ఇటీవల నీటి శాంపిల్స్‌కు చేసిన పరీక్షలో తేలింది. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కొత్తమాజేరులో 2,216 మంది జనాభా ఉండగా పురుషులు 1,113, మహిళలు 1,103 మంది ఉన్నారు. గ్రామస్తులు మూడు నెలలుగా జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. చెరువును శుద్ధి చేసే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యహరించింది. కోతులు చెరువులో పడి చనిపోతున్నాయని తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువులో నీరు కలుషితమైందని తెలిసినా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న చేతిపంపు, గ్రామశివారులోని పొలాల్లో ఉన్న బోరు పాయింట్ల ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు వీలున్నా ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. అన్నం పెట్టే కొడుకు, కోడలు దూరమయ్యారు నా కొడుకు శ్రీరాములు, కోడలు జయలక్ష్మి 12 గంటల వ్యవధిలోనే చనిపోయారు. కొడుకు, కోడలు చేనేత పనిచేసి నన్ను, నా మనుమరాలు సీతమ్మను సాకేవారు. నాకిప్పుడు 80 ఏళ్లు. నేనెలా బతకాలి? మనవరాలిని ఎలా చూడాలి? - జంజనం నాగేశ్వరమ్మ జ్వరం నా భార్యను పొట్టనపెట్టుకుంది నాతో పాటు నా భార్య మాణిక్యం, కుమారుడు పోతురాజు జ్వరం బారిన పడ్డాం. మాణిక్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా దారిలోనే చనిపోయింది. - మోతుకూరి గురవయ్య వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం.. కొత్తమాజేరులో కలుషిత నీరు సరఫరా అవుతోందని గుర్తించి అక్కడి పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఈలోగానే ఎక్కువమంది విషజ్వరాల బారిన పడ్డారు. మే నుంచి జూలై వరకు 17 మంది చనిపోయారు. అయితే జ్వరం కారణంగానే చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. పరిస్థితులు చక్కబడే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తాం. - ఆర్.నాగమల్లేశ్వరి, డీఎంహెచ్‌వో -
జగన్‌తోనే సంక్షేమ రాజ్యం
చల్లపల్లి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఏనాడూ విద్యుత్, గ్యాస్ ధరలు పెంచలేదని ఆయన వారసుడు, ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఆనాటి మంచిరోజులు వస్తాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణరావునగర్‌లో మంగళవారం గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని సింహాద్రి చేపట్టారు. ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచినా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వాటిని భరించి ప్రజలపై భారం పడకుండా చూసిందన్నారు. తన పాలనలో విద్యుత్‌చార్జీలు పెంచబోనని స్పష్టం చేసిన వైఎస్ మాటతప్పలేదు, మడమ తిప్పలేదని సింహాద్రి గుర్తుచేశారు. ఆయన తనయుడు, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడతారన్నారు. పార్టీ మండల కన్వీనర్ చండ్ర వెంకటేశ్వరరావు, మహిళా క న్వీనర్ వల్లూరి ఉమ, పట్లణ కన్వీనర్ వెనిగళ్ళ తారకజగదీష్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు షేక్ నజరానా, మద్దాల వీరాస్వామి, గోవాడ రాము, మశీదు కమిటీ అధ్యక్షుడు అబ్ధుల్ గఫార్, ఆరోవార్డు సభ్యుడు తోట నాగేశ్వరరావు, నాయకులు మల్లంపాటి సీతారామయ్య, ఆకుల శ్రీనివాస్, యన్నం చంద్రశేఖర్, మురాల చిన్ని పాల్గొన్నారు. తెలుగురావుపాలెంలో ఘంటసాల : మండలంలోని తెలుగురావుపాలెంలో మంగళవారం సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌కుమార్ సర్కార్ తుంగలో తొక్కి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి ఆ పార్టీతో కుమ్మకై ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజలను వంచించిన ఆ రెండు పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి ప్రజలకోసం పోరాడుతున్న వైఎస్సార్ సీపీని ఆదరించాలని కోరారు. పార్టీ మండల కన్వీనర్ వేమూరి వెంకట్రావ్, బీసీ కన్వీనర్ చింతా రామచంద్రరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కడవకొల్లు నరసింహారావు, స్థానిక నాయకులు తాడికొండ శ్రీను, సింహాద్రి శ్రీను, అట్లూరి శ్రీనివాసరావు, కాట్రగడ్డ శ్రీనివాస్ చక్రవర్తి, అట్లూరి రాము, రావి రాంబాబు, జాస్తి వెంకటేశ్వరరావు, వినిగళ్ళచైతన్య, పర్యతనేని రామకృష్ణ, న్యాయవాది తాడిశెట్టి రాంబాబు, వెనిగళ్ళ శ్రీధర్, మునిపల్లి నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.