చల్లపల్లి (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మరో వ్యక్తి విషజ్వరంతో చనిపోయాడు. చేపలవేట, వ్యవసాయ కూలిపనులు చేసుకునే గ్రామానికి చెందిన తిరుమలశెట్టి బాబూరావు(48)కి నెల రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. తొలుత స్థానికంగా చికిత్స పొంది తగ్గకపోవడంతో మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స తీసుకున్నాడు. అక్కడ వైద్య సేవలు అందించిన డాక్టర్లు విషజ్వరం వల్ల లోపల లివర్ దెబ్బతిందని చెప్పడంతో కొద్దికాలం వైద్యశాలలో ఉన్న బాబూరావు తరువాత స్వగ్రామానికి వచ్చాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వైద్యశాలలో ఉండి వైద్యం చేయించుకోలేక మందులు తెచ్చుకుని వాడుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటలకు తన స్వగృహంలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో ఈ నెల 4న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన విషయం విదితమే. మరుసటి రోజు గ్రామంలో పర్యటించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎవరూ విషజ్వరాల వల్ల చనిపోలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాబూరావు మరణంతో గ్రామస్తులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
విషజ్వరంతో ఒకరు మృతి
Published Tue, Aug 25 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement