చల్లపల్లి(అవనిగడ్డ): ఎన్నారై ముసుగులో అమెరికాలో నివసించే వారికి చెందిన పొలాన్ని వేరొకరికి అమ్మేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అడ్డంగా దొరికిపోయాడు. 2014లో జరిగిన ఈ మోసంపై పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో నిజం నిగ్గుతేలడంతో చల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండల పరిషత్ లక్ష్మీపురం–2వ సెగ్మెంట్‌కు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న టీడీపీ నేత, చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరానికి చెందిన వేపూరి సాంబశివరావు (శివయ్య) అదే పంచాయతీ చింతలమడకు చెందిన మరో టీడీపీ నేత నూకల శ్రీనివాసరావుతో కలిసి మోసానికి పాల్పడ్డారు.
మచిలీపట్నం శివారు వాడపాలెంకు చెందిన నల్లూరి వెంకటేశ్వరరావు కుమారులు నల్లూరి సత్యసురేష్, నల్లూరి నాగసతీష్‌లకు చెందిన వాడపాలెం, పెదయాదరల్లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2014లో రామానగరానికి చెందిన టీడీపీ నాయకుడు వేపూరి సాంబశివరావు, చింతలమడకు చెందిన నూకల శ్రీనివాసరావు తామిద్దరూ నాగ సతీష్, సత్య సురేష్‌లుగా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి, నకిలీ పొలం డాక్యుమెంట్లు సృష్టించి విజయవాడకు చెందిన జాలాది శ్రీమన్నారాయణ కుమారుడు హేమచంద్‌కు విక్రయించారు.
ఈ విక్రయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించారు. తమకు చెందిన భూమి వేరొకరు తప్పుడు ఆధారాలు, బోగస్ గుర్తింపు కార్డులు, నకిలీ డాక్యుమెంట్లతో వేరొక చోట రిజిస్ట్రేషన్ చేయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుసుకున్న బాధితులు 2019లో బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో రిజిస్ట్రేషన్ జరిగింది చల్లపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు కేసును చల్లపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు. కేసును రీ–కన్‌స్ట్రక్షన్ చేసి దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు గుర్తించిన పోలీసులు చీటింగ్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, వేరొక వ్యక్తులను తాముగా చూపి మోసానికి పాల్పడిన నేరం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు వేపూరి సాంబశివరావు అలియాస్ శివయ్య, నూకల శ్రీనివాసరావులను చల్లపల్లి సీఐ ఎన్.వెంకట నారాయణ అరెస్ట్ చేసి మొవ్వ ఏజెఎఫ్‌సీఎం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించి అవనిగడ్డ సబ్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment