పెళ్లయిన 50 రోజులకే ఆత్మహత్య
లోన్ యాప్ ద్వారా రూ.2 వేలు తీసుకున్న యువకుడు
ఆ మొత్తం చెల్లించినా.. ఇంకా కట్టాలంటూ యువకుడి ఫొటోలు మార్ఫింగ్
వాటిని నవ వధువు, ఆమె బంధువులకు పంపించిన యాప్ నిర్వాహకులు
అవమానం తట్టుకోలేక తనువు చాలించిన యువకుడు
అల్లిపురం (విశాఖ): లోన్ యాప్ వేధింపులకు విశాఖ నగరంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాణిపేట సీఐ బి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తల్లి, తండ్రితో కలసి జీవిస్తున్నాడు. ఇతనికి వివాహమై సుమారు 50 రోజులైంది. సముద్రంలో వేటకు వెళ్లి వస్తుంటాడు.
భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్‌లైన్ యాప్‌లో రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ.. రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్‌ఫోన్‌కు నరేంద్ర, అఖిల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు.
ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా.. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. తర్వాత అఖిల ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్‌చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పటంతో ఇంటికి చేరుకుంది.
తలుపులు కొట్టినా ఎంతకీ తీయక పోవటంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా.. నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు విరగ్గొట్టి నరేంద్రను కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు.
నిందితుల కోసం ప్రత్యేక బృందం
యువకుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
ఆత్మహత్యకు ప్రేరేపించడం, మహిళలను అవమానించడం, నేరపూరిత బెదిరింపు, మరొకరి గుర్తింపును మోసపూరితంగా ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక, అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తదితర నేరాలపై బీఎన్‌ఎస్ 108, 79, 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 (సి), 67(ఎ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుని మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నేరస్తులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment