పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్‌లకు చెందినవి కూడా చూస్తుంటాడు.
కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది.
ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment