పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్‌ ఆత్మహత్య | Deputy Sarpanch committed suicide due to police harassment | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్‌ ఆత్మహత్య

Published Mon, Jun 10 2024 5:03 AM | Last Updated on Mon, Jun 10 2024 5:03 AM

Deputy Sarpanch committed suicide due to police harassment

నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూత 

వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతితో రెంటపాళ్లలోఉద్రిక్తత

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఉప సర్పంచి, వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (37) నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. అతడి మృతితో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈనెల 4న పాకాలపాడు పీఏసీఎస్‌ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్‌కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు. 

సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఈనెల 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్‌ మంగర్స్‌ బైండోవర్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. మధ్యా­హ్నం ఎన్నికల ఫలితాలు ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై, ఎస్సీ కాలనీపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పింది. 

పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయన ఫోన్‌ మాట్లాడబోతుండగా పోలీ­సులు ఫోన్‌ లాక్కున్నారు. ఈ నెల 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాజే‹Ùకుమార్‌ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్‌ వద్దకు పంపాడు. 

తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఈనెల 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి 14వ మైలు వద్ద తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు ఆదివారం మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదును ట్యాంపరింగ్‌ చేశారు. 

నాగమల్లేశ్వరరావు మృతి వార్తతో రెంటపాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, అంబటి అల్లుడు ఉపేష్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు నల్లబోతు శివనారాయణ, చల్లా శ్రీను, కొమెర శివశంకర్‌ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. 

మృతుడి తండ్రి వెంకటేశ్వర్లును ఓదార్చారు. తన కుమారుడి మృతికి కారకులపై పోలీసు ఉన్నతా«ధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement