
దిస్‌పూర్: అసోంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు.
నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచ్చి, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక.. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment