లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు
Published Mon, Nov 7 2016 9:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
రేవేంద్రపాడు (దుగ్గిరాల): మైనర్ బాలికపై లైంగికదాడి ఘటనలో నిందితుని అరెస్ట్ చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ మన్నెం మురళి సోమవారం తెలిపారు. అక్టోబర్ 12వ తేదీన మండలంలోని రేవేంద్రపాడు గ్రామానికి చెందిన బాలిక తన తల్లి నెల్లూరు వెళ్లడంతో ఇంటిలో తమ్ముడు, మేనమామతో కలిసి రాత్రి 12 గంటల వరకు టీవీ చూసింది. అర్ధరాత్రి కావటంతో నిద్రించేందుకు సమీపంలోని అమ్మమ్మ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో మూత్ర విసర్జనకు మరుగుదొడ్డికి వెళ్లిన బాలికను అదే గ్రామానికి చెందిన షేక్ అమీర్‌బాషా గొంతు గట్టిగా పట్టుకొని, ఇంటి ఎదురుగా ఉన్న ఉర్దూ పాఠశాల ఆవరణలోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా∙చెబితే ఇంటిలో వాళ్ళని చంపేస్తానని బెదిరించాడు.
దీంతో భయపడిన∙బాలిక మరుసటిరోజు తన అమ్మమ్మతో పాటు కూలీ పనులకని వెళ్ళి అక్కడ ఉన్న పురుగుమందును తాగింది. గమనించిన సహచర కూలీలు స్థానికుల సహాయంతో బాధితురాలిని మంగళగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్సపొందుతూ అక్టోబర్ 17వ తేదీన బాలిక మృతి చెందింది. నిందితుడిగా ఆరోపణ ఎదుర్కొంటున్న షేక్ అమీర్‌బాషాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ మన్నెం మురళీ తెలిపారు.
Advertisement
Advertisement