సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం నిభానుపూడికి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అత్యాచారానికి గురై బలన్మరణానికి పాల్పడ్డ బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున ఆమె తల్లిదండ్రులకు పదిలక్షల రూపాయల చెక్కును అందజేశారు.
బాధాకరమైన ఘటనలు రాజకీయం చేయొద్దు!
హోంమత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారానికి గురవ్వడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విచారణ పూర్తయ్యాక నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలను అనవసరంగా రాజకీయం చేయొద్దని కోరారు.
వేగంగా స్పందించిన సీఎం
ఏ కుటుంబంలో ఇలాంటి దురృష్టకర సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. త్వరతగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే పదిలక్షల రూపాయలు సహాయం ప్రకటించడంతో పాటు హోంమంత్రిని పంపించారని చెప్పారు.
నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు, మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున, స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామని.. నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు,.
బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు
పామర్రుకు బాలిక ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు సీపీ తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.
కేసును చేధించిన పోలీసులు
పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. అత్యాచారం చేయడం వల్లే అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. నిమ్మకూరు హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక (14)ను.. ప్రేమపేరుతో లోకేష్ (20) అనే యువకుడు దగ్గరయ్యాడు. ఈనెల 20వ తేదీన స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది.
అయితే స్కూల్‌కు వెళ్లకుండా లోకేష్‌తో ఉయ్యూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరులోని ఓ లాడ్జిలో తన బంధువైన నరేంద్రతో కలిసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు లోకేష్. అత్యాచారం తర్వాత బాలికను నిభానుపూడి సమీపంలో వదిలిపెట్టాడు. అయితే అవమానం భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది బాలిక. అదే రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుల అరెస్ట్
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాలువలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితులు లోకేష్, నరేంద్ర, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్,13 పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. అతి త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment