
పెడన: అప్పు చెల్లించాలనే ఒత్తిళ్లు, దానికి తోడు అధిక వడ్డీలు ఓ చేనేత కుటుంబం ఉసురు తీశాయి. కుమారుడితో సహా దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మంగళవారం కృష్ణా జిల్లా పెడనలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాసిన పద్మనాభం (55), నాగ లీలావతి (47) దంపతులకు కుమారుడు రాజా నాగేంద్రం, కుమార్తె వెంకట నాగలక్ష్మి ఉన్నారు.
చేనేత కార్మికులైన వీరు కుమార్తెకు గతేడాది వివాహం చేశారు. కుమారుడు రాజా నాగేంద్రం (27)తో కలిసి పెడన పోలవరపుపేటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో పొరుగింటి వారికి సమాచారం చెప్పి వెళ్లిపోయాడు. కుమార్తె కుటుంబం వచ్చి ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టారు. పద్మనాభం ఒక గదిలో, తల్లీ కుమారుడు మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు.
ప్రాణం తీసిన ఒత్తిళ్లు: మృతుడు పద్మనాభం పెడనకు చెందిన మెట్ల జీవన్‌ప్రసాద్, విఠల్ లోకేష్‌ల వద్ద కుమార్తె పెళ్లి కోసం, ఇతర ఖర్చుల కోసం రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి వడ్డీ కలిపి రూ.4.60 లక్షలు అయిందని పేర్కొంటూ జీవన్ ప్రసాద్ ప్రాంసరీ నోటు రాయించుకున్నాడు. మార్చిలోగా చెల్లించాలని ఒత్తిడి చేశాడు. ఈ మేరకు మృతుడు పద్మనాభం సూసైట్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసిన జీవన్‌ప్రసాద్, విఠల్ లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.15 వేలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment