కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం | TDP Leader Vinod Jain Molestation Attack On 14 Years Old Minor Girl | Sakshi
Sakshi News home page

కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం

Published Mon, Jan 31 2022 2:33 AM | Last Updated on Mon, Jan 31 2022 5:34 PM

TDP Leader Vinod Jain Molestation Attack On 14 Years Old Minor Girl - Sakshi

విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో నిందితుడైన టీడీపీ అభ్యర్థి వినోద్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: సుమారు మనవరాలి వయసున్న బాలికపై వినోద్‌ జైన్‌ అనే టీడీపీ నేత లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ బాలిక తాను ఉంటున్న అపార్టుమెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ నగరంలోని భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని లోటస్‌ లెజెండ్‌ అపార్టుమెంట్‌ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అదే అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత వినోద్‌ జైన్‌ 9వ తరగతి చదువుతున్న దీక్షిత గౌరి (14)పై కన్నేశాడు.

2 నెలలుగా ఆమెను లైంగికంగా వేధించాడు. రోజూ బాలిక స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, లిఫ్ట్, మెట్ల మార్గంలో కాపు కాసి వెంబడించేవాడు. ఆమె శరీరంపై తాకరాని చోట్ల తాకుతూ, అసభ్య పదజాలం వాడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ వేధింపులను తాళలేక, బాలిక తీవ్ర మనోవేదనకు గురయ్యేది. ఆ కామాంధుడు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు కావడంతో ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులకు, ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అమమ్మ, తాతయ్యకు, స్నేహితులకు వినోద్‌ జైన్‌ అకృత్యాలను చెప్పలేక పోయింది.

ఇలా రెండు నెలలుగా లైంగిక వేధింపులను పంటిబిగువున భరిస్తూ వచ్చింది. తనలో తానే కుమిలి పోయింది. రోజు రోజూకు వినోద్‌ జైన్‌ అగడాలు ఆగకపోగా, మరింత శృతిమించడంతో ఆబాలిక తనకు చావే శరణ్యం అన్న నిర్ణయానికి వచ్చింది. తను ఎందుకు చనిపోవాలనుకుందో స్పష్టంగా వివరిస్తూ ఇంగ్లిష్‌లో మూడు పేజీల లేఖ రాసింది. అనంతరం శనివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. 

టీడీపీ నేతలతో నిందితుడికి మంచి సంబంధాలు
వినోద్‌ జైన్‌కు టీడీపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఇతను ముఖ్య అనుచరుడు. దీంతో ఇటీవల జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయవాడ 37వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా సీటు ఇప్పించారు. వినోద్‌జైన్‌ తరఫున సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబే ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, మరికొందరి నాయకులతో కూడా ఇతనికి దగ్గర సంబంధాలున్నాయి. జైన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కావడంతో టీడీపీ నేతలు ఆయనతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి పలువురు టీడీపీ నేతలకు తార్చేవాడని స్థానికుల సమాచారం. 
 
ఐ లవ్‌ యూ మమ్మీ..
తన మనవరాలు శనివారం మధ్యాహ్నం నుంచి మౌనంగా ఉందని, ఎందుకలా ఉన్నావమ్మా అంటూ తాము ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదని బాలిక తాతయ్య మాణిక్యాలరావు తెలిపారు. జీజీహెచ్‌ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం తాను, తన కుమార్తె (బాలిక తల్లి) కలిసి వాకింగ్‌కు వెళ్లేటప్పుడు తమ దగ్గరికి వచ్చిందన్నారు. వాళ్ల అమ్మను ఐలవ్‌యూ మమ్మీ అంటూ కౌగిలించుకొందన్నారు. అనంతరం తాము వాకింగ్‌కు వెళ్లాక, బాలిక బెడ్‌ రూంలోకి వెళ్లి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టిందన్నారు. రెండు నెలలుగా తమ మనవరాలిని చెప్పలేని విధంగా వినోద్‌ జైన్‌ లైంగికంగా వేధించండతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు..

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన వినోద్‌ జైన్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో బాలిక పేర్కొన్న అంశాల ఆధారంగా జైన్‌పై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306 సెక్షన్‌ కింద కూడా కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌లో సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వినోద్‌ జైన్‌ ఇంటిని సీజ్‌ చేశారు. జైన్‌తోపాటు, అతని కుటుంబ సభ్యులను ఆదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా చెప్పారు.
 
ఘటనపై కలత చెందిన సీఎం

విజయవాడలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాలిక ఆత్మహత్యకు కారకుడైన వినోద్‌ జైన్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఘటనపై కలత చెందిన సీఎం.. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను బాలిక కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించారు. అ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బాలిక కుటుంబాన్ని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించి, ఓదార్చారు. వీరితో పాటు నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్‌ ఆవుతు శైలజారెడ్డి, తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కాళేశ్వరావు మార్కెట్‌ సెంటర్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పలువురు నేతలు పాల్గొన్నారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మాటలకందని విషాదమిది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన తరుణమిది. ఓ రాజకీయ పార్టీ నేత.. పది మందికి మంచి చేయాల్సిన నాయకుడు.. దాదాపు మనవరాలంత వయసున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమానవీయమిది. బరితెగించి రెండు నెలలుగా లైంగిక వేధింపులకు తెగబడిన అరాచకమిది. ఆ వేధింపులకు తాళలేని ఆ సరస్వతీ పుత్రిక తన బాధను ఎవరికీ చెప్పుకోలేక.. సిగ్గుతో, భయంతో ఏం చేయాలో తోచక తనువు చాలించడమే మార్గంగా భావించింది. తను మాకసిక వేదనకు అక్షర రూపమిస్తూ ఈ సమాజం నుంచి అందనంత దూరం వెళ్లిపోయింది.

కన్నీళ్లకే కన్నీళ్చొచ్చే ఈ ఘటనకు కారణమైన నిందితుడు వినోద్‌ జైన్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ నేతలు పలువురికి సన్నిహితుడు. ఇతగాడికి మహిళలంటే ఆటబొమ్మలట. వారిని ఆ పార్టీలోని పలువురు నేతలకు తార్చి.. తన పనులు చక్కబెట్టుకునే వాడట. అందుకే మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ కార్పొరేటర్‌గా టికెట్‌ దక్కిందట. ఇలాంటి కామాంధులను టీడీపీ చేరదీయబట్టే, గతంలోనూ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ ఇదే విజయవాడలో ఎందరో మహిళల ఉసురు పోసుకుంది. ఇలాంటి కామాంధులను, వారికి వంతపాడే వారిని ఏమనాలి? ఏ శిక్ష విధించాలి?

నా బాధ చెప్పుకోలేకపోతున్నా..
వినోద్‌ జైన్‌ నా బుగ్గలు గిల్లేవాడు. ఛాతీ, తొడలు, ఇతర ప్రదేశాల్లో చేతులు వేసేవాడు. నువ్వు చాలా అందంగా ఉంటావంటూ టీజ్‌ చేసేవాడు. జీన్‌ ప్యాంటు వేసుకుంటే మరింత అందంగా ఉంటావనేవాడు. అన్ని విషయాలూ మీతో షేర్‌ చేసుకునే నేను.. ఈ వేధింపులను మీకు చెప్పడానికి షేమ్‌గా ఫీల్‌ అవుతున్నాను. అతని చర్యల పట్ల ఎంతో భయాందోళనకు గురయ్యాను. 2 నెలలుగా అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని నేను హ్యాండిల్‌ చేయలేక పోతున్నాను. నా జీవితంలో ఇదే అతి పెద్ద సమస్య. అందుకే చనిపోతున్నాను. తమ్ముడు, మీరంతా జాగ్రత్త. 
– సూసైడ్‌ నోట్‌లో బాలిక   

బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌లోని ఓ భాగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement