విశాఖ అక్కయ్యపాలెం రహదారిలో కొవ్వొత్తుల ర్యాలీలో కేకే రాజు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్
సాక్షి నెట్‌వర్క్: విజయవాడకు చెందిన టీడీపీ నేత వినోద్‌జైన్ ఘాతుకంపై రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. బాలికను లైంగిక వేధింపులకు గురిచేసి.. ఆత్మహత్యకు కారణమైన వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అకృత్యాలపై కన్నెర్ర చేశారు. టీడీపీ నేతల లైంగిక నేరాలను నిరసిస్తూ కడపలోని ఏడురోడ్ల కూడలి నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ.. విజయవాడలో వినోద్‌జైన్ వేధింపులను తట్టుకోలేక బాలిక లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రజలందరినీ కలచివేసిందన్నారు. వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై టీడీపీ నేతల అరాచకాలు కొత్త కాదని, అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఎన్నో చేశారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునిల్‌కుమార్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు, అనంతపురం, కదిరి, పుట్టపర్తి, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. రాప్తాడులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతపురంలో జెడ్పీ కార్యాలయం నుంచి సుభాష్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. కదిరిలోని ఇందిరాగాంధీ కూడలిలో మునిసిపల్ చైర్‌పర్సన్ పరికి నజీమున్నీసా, వైస్ చైర్‌పర్సన్ కొమ్ము గంగాదేవి తదితరులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
పుట్టపర్తి హనుమాన్ కూడలిలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుక్కరాయసముద్రంలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి మహిళలు నివాళి అర్పించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళా సంఘాల శ్రద్ధాంజలి
టీడీపీ నేత వినోద్‌జైన్ వేధింపులను తాళలేక విజయవాడలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మహిళా సంఘాల నాయకులు పేర్కొన్నారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి మాట్లాడుతూ ఘటనకు కారణమైన టీడీపీ నేత వినోద్‌జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్టీ రూరల్ మహిళా విభాగం ఇన్‌చార్జి చేజర్ల కవిత, నేతలు పద్మజా యాదవ్, రమ, లక్ష్మి, మునిలక్ష్మీదేవి పాల్గొన్నారు.
నాయుడుపేట, గూడూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళి అర్పించారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు పల్లా అనూరాధ, మహిళా కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ 50 ఏళ్ల వయసున్న టీడీపీ నేత వినోద్‌జైన్ చిన్నారి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో బాలిక లేఖను బట్టి అర్థమవుతోందన్నారు.
వినోద్‌జైన్‌కు ఉరే సరి
తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. మామిడికుదురు మండలం నగరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. బాలిక ఆత్మహత్యకు కారకుడైన టీడీపీ నేత వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని మహిళలు నినాదాలు చేశారు. సామర్లకోటలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. మహిళలపై టీడీపీ నేతల వేధింపులు నశించాలని, వినోద్‌జైన్‌ను ఉరి తీయాలని మహిళలు నినదించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ, అయ్యెరక కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ ఆవాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తునిలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఏలూరి సుధారాణి ఆధ్వర్యాన మహిళలు, వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ మేరుగ పద్మలత తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పాల్గొన్నారు. జీవీఎంసీ 11వ వార్డు బాలాజీనగర్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం, పలాస, వీరఘట్టం, నరసన్నపేట, రణస్థలం తదితర ప్రాంతాల్లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment