సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు.
అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు.
అసలు ఏం జరిగింది..
బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు.
పోలీస్ కేసు కూడా లేదు..
బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు.
బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment