Brick kiln workers
-
టీడీపీ వర్గీయుల మరో వికృతక్రీడ.. ఒడిశా బాలికపై అత్యాచారం, హత్య?
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): టీడీపీ వర్గీయుల వికృత క్రీడకు మరో బాలిక బలైపోయింది. విజయవాడలో ఓ టీడీపీ నాయకుడి దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఉదంతం మరువక మునుపే జిల్లాలోని చేజర్ల మండలం పుట్టుపల్లి పంచాయతీ కొట్టాలు గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడికి చెందిన ఇటుక బట్టీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇటుక బట్టీల వద్ద పనిచేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని బాలిక (17) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మృతి సమాచారం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా శవదహనం చేయడం స్థానికంగా వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు.. కొట్టాలు గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఒడిశాకు చెందిన పలువురు కూలీలు కొన్ని నెలలుగా ఇక్కడ పని చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలిక ఇక్కడ మేనమామ, బాబాయిలతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లో ఉంటూ అక్కడి ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నారు. క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ బాలిక (17) అనారోగ్యానికి గురైందంటూ తొలుత ఆత్మకూరు, అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇటుక బట్టీల నిర్వాహకుడు వైద్యం చేయించాడు. అయితే శుక్రవారం రాత్రి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ) అయినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఆ టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు సమాచారం. ఫిర్యాదు చేస్తే పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతో బాలిక బంధువులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బాధితుల సంప్రదాయాలకు భిన్నంగా నెల్లూరు బోడిగాడితోటలో శనివారం బాలిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయించారు. ఆనవాళ్లు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంలో సదరు టీడీపీ నేత సఫలీకృతుడయ్యారని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగింది.. బాలిక అందంగా ఉంటుంది. దీంతో అక్కడే పని చేసే స్థానిక యవకులు బాలికపై కన్నేసినట్లు సమాచారం. బాలికపై లైంగికదాడికి పలుమార్లు విఫలయత్నం చేశారు. బుధవారం రాత్రి కొందరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో ప్రతిఘటనలో గాయపడినట్లు గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలిక గాయపడి, చనిపోయేంత వరకూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శనివారం సాయంత్రం తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. ఆ తర్వాత హడావుడిగా వారి సంప్రదాయాలకు భిన్నంగా దహనక్రియలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆదివారం బాలిక తండ్రికి ఇటుక బట్టీ యజమాని రూ.30 వేలు నగదు ఇచ్చినట్లు సమాచారం. బాలిక మృతిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో ఆదివారం గ్రామానికి చేరుకుని మొక్కుబడిగా విచారణ జరిపారు. బాలికకు ఫిట్స్‌తో మృతి చెందిందని జిల్లా లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోలీస్ కేసు కూడా లేదు.. బాలిక గాయపడితే పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. వాస్తవానికి ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులు ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా తొలుత కేసు నమోదు చేయాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా ఈ ప్రక్రియలు జరగలేదు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారి తరఫున పట్టించుకునే నాథుడు లేకపోవడంతో సదరు టీడీపీ నేత అందరి నోర్లను నోట్లతో నొక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై ప్రచారం జరగడం ఐసీడీఎస్, కార్మికశాఖ, పోలీసులు బాధితులు నివాసం ఉండే ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాధితులు ఒడిశా వాసులు కావడంతో వారిని భయపెట్టి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా సదరు టీడీపీ నేత జాగ్రత్త పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాలిక తండ్రి లోచన్ మాంజీని మీడియా ప్రతినిధులు అడిగితే.. తన కుమార్తె అనారోగ్యంతో చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. -
ఓ వీడియో వెట్టి నుంచి విముక్తి చేసింది!
భూపాలపల్లి అర్బన్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇది బాగా పాపులర్ అయిన వ్యాపార ప్రకటన. ఇక్కడ ఓ వీడియో వలస కూలీలను వెట్టి నుంచి విముక్తి చేసింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. కూలీలను సొంతగూటికి చేరుకునేలా దోహదపడింది. అంతగా ప్రభావితం చేసిన ఆ వీడియో కథాకమామిషు ఇది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాకు చెందిన 49 మంది వలస కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మట్టి ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఆరు నెలల క్రితం వచ్చారు. పనికి తగిన కూలి ఇవ్వడం లేదని, బలవంతంగా పనులు చేయిస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని, తమకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలని వలస కూలీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి విన్నవిస్తూ సెల్‌ఫోన్ సహాయంతో ఓ వీడియో తీసి 10 రోజుల క్రితం బంధువులకు పంపించారు. అది వైరల్‌గా మారి ఆ రాష్ట్రంలోని న్యూస్‌చానళ్లు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించి చర్యలు ప్రారంభించింది. వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గరియాబంద్ జిల్లా కలెక్టర్ శ్యాందావుడే.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు చేరవేశారు. అలాగే గరియాబంద్‌కు చెందిన లేబర్, రెవెన్యూ, పోలీస్, మహిళా సంరక్షణ అధికారులు భూపాలపల్లికి శుక్రవారం చేరుకొని స్థానిక అధికారులతో కలసి ఆపరేషన్ ప్రారంభించారు. పట్టణంలోని రెండు ఇటుక బట్టీలు, గణపురం క్రాస్‌రోడ్డులో మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్న 49 మంది వలస కూలీలను తమ అదీనంలోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమతో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, సకాలంలో డబ్బులు చెల్లించచడం లేదని వాపోయారు. భోజనం చేయడానికి సైతం కనీస సమయం ఇవ్వడంలేదని, ఖాళీ కడుపుతో పనిచేస్తున్నామని కూలీలు అధికారులకు వివరించారు. అధైర్య పడొద్దని, తొందరలోనే సమస్యను ప్రభుత్వం పరిష్కరించి ఛత్తీస్‌గఢ్‌లో పని కల్పించేలా చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. ఈ ఘటనపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది. -
అక్రమ దందా!
చుంచుపల్లి: జిల్లాలో ఇటుకబట్టీల అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం ఇటుక వ్యాపారులకు కలిసివస్తోంది. వివిధ శాఖల అనుమతితో బట్టీలను నిర్వహించాల్సి ఉండగా.. జిల్లాలో పలువురు వ్యాపారులు ఆ నిబంధనలను గాలికొదిలేశారు. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో అందరి దృష్టీ ఈ వ్యాపారంపైనే పడింది. జిల్లాలో ప్రతి మండలంలో రెండు, మూడు చొప్పున ఇటుకబట్టీలు వెలిశాయి. ఇందులో 42 బట్టీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని అధికారులే చెపుతున్నారు. వీటిలో 15 నుంచి 20 వరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. బట్టీల నిర్వహణకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలను తీసుకొచ్చి, వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటుకను కాల్చడానికి అడవుల్లోని కలపతో పాటు సింగరేణి బొగ్గును కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ భూముల్లోనే నిర్వహణ.. జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణకు వ్యాపారులు అవలంబిస్తున్న విధానాలన్నీ అక్రమంగానే ఉన్నాయి. బట్టీ ఏర్పాటు చేయాలంటే ఆయా పంచాయతీల పరిధిలో రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూముల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను వినియోగించవద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి కొంత డబ్బును ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నందున నాలా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు భూగర్భ, గనులు, అటవీశాఖ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఎక్కడా సుంకం చెల్లించిన దాఖలాలు లేవు. పైగా ప్రస్తుతం ఉన్న ఇటుకబట్టీలకు అనుమతి కూడా తీసుకోవడం లేదు. ముందుగానే తహసీల్దార్, కాలుష్య నియంత్రణ అధికారి నుంచి అనుమతి పొందాలి. ఇవేమీ లేకపోగా ప్రభుత్వ స్థలాలు, అంబ సత్రం భూములు, అటవీ భూములు వినియోగిస్తున్నారు. దీంతో పాటు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి వాగులు, చెరువుల్లో గోతులు తవ్వుతూ ఇటుకల కోసం మట్టిని తరలిస్తున్నారు. వీటిని పరిశీలించి మండలాల స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ సిబ్బంది ‘మామూలు’గానే వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మొరం లాగే ఇటుకల తయారీకి వినియోగించే మట్టి తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకు పన్ను(రాయల్టీ) చెల్లించాల్సి ఉంది. ఇది కూడా ఎక్కడా అమలుకావడం లేదు. ఏటా రూ.50 లక్షల మేర గండి.. ప్రభుత్వం ఏజెన్సీలో రైతుల సేద్యానికి బోరు మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. దీనిని ఆసరా చేసుకుని వ్యాపారులు ఇటుకల తయారీ కేంద్రం వద్ద బోరు వేసుకుని బట్టీలను నిర్వహిస్తున్నారు. దీనికి విద్యుత్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు రెండు నెలలకు రూ.8 వేల వరకు విద్యుత్ శాఖకు చెల్లించాలి. అయితే బట్టీల వ్యాపారులు సమీప వ్యవసాయ భూములు, బోరు మోటార్లను లీజుకు తీసుకుంటూ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు కూడా చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, పన్నుల రూపంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి ఏటా రూ.50 లక్షల మేర గండి పడుతోంది. అనుమతులు లేని ఇటుకబట్టీలపై చర్య తీసుకుంటాంజిల్లాలో అనుమతి లేని, అక్రమ ఇటుక బట్టీల నిర్వహణపై తక్షణ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు ఆదేశాలిస్తాం. ఆయా మండల పరిధిలో ప్రతి తహసీల్దార్ అక్రమ ఇటుకబట్టీల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చూస్తాం. ఇటుక బట్టీల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – స్వర్ణలత, కొత్తగూడెం ఆర్డీఓ -
ఒడిషా కూలీలకు విముక్తి
ఇబ్రహీంపట్నంరూరల్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను యజమానులు వేధింపులకు గురిచేస్తున్నారని అందిన ఫిర్యాదుతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇటుక బట్టీ వద్దకు అధికారులు వచ్చి విచారించగా ఇబ్బందులకు గురిచేస్తున్నది వాస్తవమేనని బటయపడింది. తాము ఇక్కడ పనిచేయలేమని తమ రాష్ట్రానికి వెళ్లిపోతామని అధికారులకు మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామ శివారులోని ఎల్‌ఎన్‌బీ ఇటుక బట్టీలో ఒడిషాకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే, తమను యజమానులు లైంగిక, శారీరక వేధింపులే కాకుండా దౌర్జన్యం చేసి చితకబాదుతున్నారని కూలీలు నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిల్ బాధ్యులు ఈ విషయాన్ని కార్మిక శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. కార్మిక శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కార్మిక, రెవెన్యూ అధికారులు సోమవారం ఇటుక బట్టీల వద్దకు వచ్చి కూలీలతో మాట్లాడారు. తమను యాజమాన్యం హింసకు గురి చేస్తోందని కూలీలు అధికారులకు చెప్పారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ స్వామి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వెంకట్‌రెడ్డి కూలీలందరి అభిప్రాయాలు సేకరించారు. కాగా, విచారణ కోసం బట్టీల వద్దకు వచ్చిన కార్మిక శాఖ అధికారులపై యజమానులు దుర్బాషలాడారు. దాడిచేసేయత్నం చేశారు. దీంతో ఇటుబట్టీల యాజమాన్యం అసోసియేషన్ నాయకులు వారిని వారించారు. 80 మంది కార్మికులనుఒడిషాకు పంపిన అధికారులు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేని కొందరు కార్మికులు తమ ప్రాంతానికి వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. తమను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని చెప్పారు. డీసీఎం ఎక్కిన గౌతమ్, సంతోష్, ప్రభులను యాజమాన్యం కొట్టారని తెలిపారు. ఇటుక బట్టీలో 17 మంది చిన్నపిల్లలతో కలిపి మొత్తం 80 ఉన్నారు. వీరి స్వగ్రామం ఒడి షాలోని బొలాంగిరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తామని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన యజమాని శ్రీనివాస్ అధికారులు వచ్చి మాట్లాడుతుండగా కూలీలు వెళ్లిపోతున్నారని తెలియడంతో యజమాని శ్రీనివాస్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించబోగా పోలీసులు పైకి ఎక్కి రేకులు పగలగొట్టి శ్రీనివాస్‌ని కాపాడారు. కొటిన్నర రూపాయలు పెట్టుబడి పెట్టి మధ్యలో ఆగంచేసి వెళ్లిపోతే ఎట్లా.. వారికి అందరికీ అడ్వాన్స్‌లు చెల్లించాను, నన్ను కాపాడాలని శ్రీనివాస్ కోరారు. అధికారుల బృందంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్,దిల్సుఖ్నగర్ కార్మిక శాఖ అధికారి వినీత, నాచారం అ«ధికారి అరుణ, రెవెన్యు కార్యదర్శి బిక్షపతితో తదితరులు ఉన్నారు. -
వారికి న్యాయమైన వేతనాలు దక్కాల్సిందే
ఇటుక బట్టీ కార్మికులపై యాజమాన్యాల దోపిడీ అరికట్టండి: హైకోర్టు బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని ఆదేశం హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు బట్టీల యాజమాన్యాల చేతిలో దోపిడీకి గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వారికి చట్ట ప్రకారం వేతనాలు దక్కేలా చూడాలని, ఇందుకుగానూ కార్మికుల పేరుపై బ్యాంకు ఖాతా తెరచి, సదరు బట్టీ యజమాని ఆ ఖాతాలోనే వేతనాలను జమ చేసేలా చూడాలంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు ఏవి అందుతున్నాయో, అవన్నీ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు అందాల్సిందేనని తేల్చి చెప్పింది. అసలు ఇరు రాష్ట్రాల్లో ఎన్ని ఇటుక బట్టీలున్నాయి? ఎంత మంది కార్మికులున్నారు? వారిలో వలస కార్మికులెందరు? వారి జీవన పరిస్థితులేమిటి? తదితర వివరాలను అఫిడవిట్ల రూపంలో తమ ముందుంచాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమోటోగా స్వీకరించిన సుప్రీం.. ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఇద్దరు ఒడిశాకు చెందిన కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిశా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చిన నివేదికలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయా రాష్ట్రాల హైకోర్టులకు ఈ వ్యాజ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై సోమవారం మరోసారి విచారించింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ బట్టీలో పనిచేస్తున్న మహిళను పనికి ఆలస్యం వచ్చిందన్న కారణంతో ఆ బట్టీ సూపర్వైజర్లు కొట్టడంతో మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావును ప్రశ్నించింది. బాధ్యులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా జరిగిందని ఆయన తెలిపారు. ఏపీ నివేదికపై అసంతృప్తి.. ఈ సమయంలో ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం.. పథకాలు ఉన్నాయని చెబితే సరిపోదని, అవి కార్మికులకు అందుతున్నాయో లేదో చూడాలంది. బట్టీల్లో పనిచేసే కార్మికులకు గృహవసతి, వైద్యం, వారి పిల్లలకు విద్యా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కొందరు యజమానులు రోజుకు రూ.50 చెల్లిస్తూ, రూ.300 చెల్లిస్తున్న ట్లు కార్మికుల చేత సంతకాలు తీసుకున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇటువంటి దోపిడీ జరగకుండా అడ్డుకునేందుకు, కార్మికుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది.