భూపాలపల్లి అర్బన్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇది బాగా పాపులర్ అయిన వ్యాపార ప్రకటన. ఇక్కడ ఓ వీడియో వలస కూలీలను వెట్టి నుంచి విముక్తి చేసింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. కూలీలను సొంతగూటికి చేరుకునేలా దోహదపడింది. అంతగా ప్రభావితం చేసిన ఆ వీడియో కథాకమామిషు ఇది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాకు చెందిన 49 మంది వలస కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మట్టి ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఆరు నెలల క్రితం వచ్చారు. పనికి తగిన కూలి ఇవ్వడం లేదని, బలవంతంగా పనులు చేయిస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని, తమకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలని వలస కూలీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి విన్నవిస్తూ సెల్‌ఫోన్ సహాయంతో ఓ వీడియో తీసి 10 రోజుల క్రితం బంధువులకు పంపించారు. అది వైరల్‌గా మారి ఆ రాష్ట్రంలోని న్యూస్‌చానళ్లు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించి చర్యలు ప్రారంభించింది. వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గరియాబంద్ జిల్లా కలెక్టర్ శ్యాందావుడే.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు చేరవేశారు.
అలాగే గరియాబంద్‌కు చెందిన లేబర్, రెవెన్యూ, పోలీస్, మహిళా సంరక్షణ అధికారులు భూపాలపల్లికి శుక్రవారం చేరుకొని స్థానిక అధికారులతో కలసి ఆపరేషన్ ప్రారంభించారు. పట్టణంలోని రెండు ఇటుక బట్టీలు, గణపురం క్రాస్‌రోడ్డులో మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్న 49 మంది వలస కూలీలను తమ అదీనంలోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమతో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, సకాలంలో డబ్బులు చెల్లించచడం లేదని వాపోయారు. భోజనం చేయడానికి సైతం కనీస సమయం ఇవ్వడంలేదని, ఖాళీ కడుపుతో పనిచేస్తున్నామని కూలీలు అధికారులకు వివరించారు. అధైర్య పడొద్దని, తొందరలోనే సమస్యను ప్రభుత్వం పరిష్కరించి ఛత్తీస్‌గఢ్‌లో పని కల్పించేలా చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. ఈ ఘటనపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది.
ఓ వీడియో వెట్టి నుంచి విముక్తి చేసింది!
Published Sat, Feb 9 2019 12:20 AM | Last Updated on Sat, Feb 9 2019 10:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment