ఇటుక బట్టీ కార్మికులపై యాజమాన్యాల దోపిడీ అరికట్టండి: హైకోర్టు
బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేలా చూడాలని ఆదేశం
హైదరాబాద్: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు బట్టీల యాజమాన్యాల చేతిలో దోపిడీకి గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వారికి చట్ట ప్రకారం వేతనాలు దక్కేలా చూడాలని, ఇందుకుగానూ కార్మికుల పేరుపై బ్యాంకు ఖాతా తెరచి, సదరు బట్టీ యజమాని ఆ ఖాతాలోనే వేతనాలను జమ చేసేలా చూడాలంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు ఏవి అందుతున్నాయో, అవన్నీ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు అందాల్సిందేనని తేల్చి చెప్పింది. అసలు ఇరు రాష్ట్రాల్లో ఎన్ని ఇటుక బట్టీలున్నాయి? ఎంత మంది కార్మికులున్నారు? వారిలో వలస కార్మికులెందరు? వారి జీవన పరిస్థితులేమిటి? తదితర వివరాలను అఫిడవిట్ల రూపంలో తమ ముందుంచాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుమోటోగా స్వీకరించిన సుప్రీం..
ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఇద్దరు ఒడిశాకు చెందిన కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఇటుకబట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిశా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి వచ్చిన నివేదికలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయా రాష్ట్రాల హైకోర్టులకు ఈ వ్యాజ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై సోమవారం మరోసారి విచారించింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ బట్టీలో పనిచేస్తున్న మహిళను పనికి ఆలస్యం వచ్చిందన్న కారణంతో ఆ బట్టీ సూపర్‌వైజర్లు కొట్టడంతో మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావును ప్రశ్నించింది. బాధ్యులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా జరిగిందని ఆయన తెలిపారు.
ఏపీ నివేదికపై అసంతృప్తి..
ఈ సమయంలో ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం.. పథకాలు ఉన్నాయని చెబితే సరిపోదని, అవి కార్మికులకు అందుతున్నాయో లేదో చూడాలంది. బట్టీల్లో పనిచేసే కార్మికులకు గృహవసతి, వైద్యం, వారి పిల్లలకు విద్యా వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. కొందరు యజమానులు రోజుకు రూ.50 చెల్లిస్తూ, రూ.300 చెల్లిస్తున్న ట్లు కార్మికుల చేత సంతకాలు తీసుకున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఇటువంటి దోపిడీ జరగకుండా అడ్డుకునేందుకు, కార్మికుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది.
వారికి న్యాయమైన వేతనాలు దక్కాల్సిందే
Published Tue, Dec 22 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM
Advertisement