ప్రతినెలా ఎస్సీ, మైనార్టీ సొసైటీల్లో వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
ఫస్ట్ తర్వాత రెండు వారాలు దాటినా ఉద్యోగులకు సరిగా అందని జీతాలు
సకాలంలో వేతనాలు అందక గాడితప్పుతున్న రుణ చెల్లింపులు
‘‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం’’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా పలు సందర్భాల్లో చెబుతున్న మాటలివి.
కానీ గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం ఒకటో తేదీన వేతన చెల్లింపులు ఇప్పటివరకు జరగలేదు. ప్రధానంగా ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లో ఒకటో తారీఖు దాటి రెండు వారాలైనా ఉద్యోగులు జీతం డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు మూడింట రెండొంతులు ఉండగా.. మిగిలిన ఉద్యోగులు పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఎస్సీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని వారే. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ రెండు సొసైటీల్లోని ఉద్యోగులకు నెలవారీ వేతన చెల్లింపులు గాడి తప్పాయి.
ఇతర శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనో, ఆ మరుసటి రోజో వేతనాలు అందుతున్నప్పటికీ.. ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి నెలా పది, పదిహేను రోజులు దాటే వరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
క్రమం తప్పుతున్న నెలవారీ చెల్లింపులు
సాధారణంగా నెలవారీ వేతనాలు పొందే ఉద్యోగులు కుటుంబ ఖర్చులు, పొదుపు అంశాల్లో అత్యంత ప్రణాళికతో ఉంటారు. వేతన డబ్బులు అందిన వెంటనే నెలవారీగా ఉండే చెల్లింపులు చేస్తూ మిగిలిన మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు. కానీ ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు వేతన చెల్లింపులపై స్పష్టత లేకపోవడం, ప్రతి నెలా నిర్దిష్ట సమయంలో కాకుండా ఇష్టానుసారంగా జీతాలు విడుదల చేస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
సకాలంలో వేతనాలు అందకపోవడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలకు సంబంధించి నెలవారీ చెల్లింపులు గాడి తప్పుతున్నాయి. రుణ చెల్లింపుల్లో క్రమం తప్పడంతో తమ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల కోసం ఉద్యోగులు ప్రతి నెలా సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో వినతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల మాదిరి గురుకుల ఉద్యోగులకు కూడా నెలవారీగా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment