
15న జపాన్ వెళ్లనున్న రేవంత్‌రెడ్డి బృందం
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించటంపై ఫోకస్
నేడు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో జరిగే ఒసాకా–కన్సాయ్ ఎక్స్‌పో– 2025కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెళ్లనున్నారు. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి వారు జపాన్ వెళ్తారు. వారి వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యాలయ అధికారి అజిత్‌రెడ్డి కూడా వెళ్తారని సమాచారం. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తెదీ వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భారత్ నుంచి కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఒసాకా షోను వేదిక చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దావోస్ వెళ్లిన రెండు దఫాల్లోనూ దాదాపు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒసాకా ఉత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారని సమాచారం.
తెలంగాణలో ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది? ఇక్కడ ఉన్న పెట్టుబడి వాతావరణం, స్కిల్డ్, అన్‌స్కిల్డ్ లేబర్‌తోపాటు, విద్యుత్, నీటి సరఫరా, భూముల కేటాయింపు, అనుమతులు, రాయితీలు తదితర అంశాలపై రాష్ట్ర బృందం ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. గతంలో రాష్ట్రం నుంచి ఇలాంటి షోకేస్ చేసే ప్రయత్నం జరగలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
నేడు అహ్మదాబాద్‌కు సీఎం: సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. మంగళ, బుధవారాల్లో అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసిసి సమావేశాల్లో పాల్గొనేందుకు ఉదయం ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశాల డ్రాఫ్ట్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడి హోదాలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బుధవారం జరిగే ఏఐసిసి సమావేశానికి రాష్ట్రం నుంచి ఏఐసీసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మందితోపాటు ప్రత్యేక ఆహ్వనితులుగా రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. వీరంతా మంగళవారం అహ్మదాబాద్ బయలుదేరుతున్నారు.