gurukulas
-
భద్రత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్లలోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్ గరŠల్స్ కాంపౌండ్‌లోని బీసీ ప్రీ మెట్రిక్ (చిన్న పిల్లల) హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్‌పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్‌ను, వార్డెన్ డ్రైవర్‌ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇలాంటే సంఘటనలు జరుగుతున్నప్పటికి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. ఇదంతా హాస్టల్ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్ ఫెన్సింగ్ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్‌కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్‌కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచలేం..» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను పాత సంతమార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపోయాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. »తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోందిమా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు. – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాభద్రత కల్పించాలిరాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాసంక్షోభ హాస్టళ్లుపేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంసాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్ విల్లింగ్) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. -
గురుకుల ఉద్యోగుల వేతన వెతలు
‘‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం’’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా పలు సందర్భాల్లో చెబుతున్న మాటలివి.కానీ గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం ఒకటో తేదీన వేతన చెల్లింపులు ఇప్పటివరకు జరగలేదు. ప్రధానంగా ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లో ఒకటో తారీఖు దాటి రెండు వారాలైనా ఉద్యోగులు జీతం డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు మూడింట రెండొంతులు ఉండగా.. మిగిలిన ఉద్యోగులు పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో అత్యధికులు ఎస్సీ, మైనార్టీ గురుకుల సొసైటీల పరిధిలోని వారే. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ రెండు సొసైటీల్లోని ఉద్యోగులకు నెలవారీ వేతన చెల్లింపులు గాడి తప్పాయి. ఇతర శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనో, ఆ మరుసటి రోజో వేతనాలు అందుతున్నప్పటికీ.. ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి నెలా పది, పదిహేను రోజులు దాటే వరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. క్రమం తప్పుతున్న నెలవారీ చెల్లింపులు సాధారణంగా నెలవారీ వేతనాలు పొందే ఉద్యోగులు కుటుంబ ఖర్చులు, పొదుపు అంశాల్లో అత్యంత ప్రణాళికతో ఉంటారు. వేతన డబ్బులు అందిన వెంటనే నెలవారీగా ఉండే చెల్లింపులు చేస్తూ మిగిలిన మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకుంటారు. కానీ ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లోని ఉద్యోగులకు వేతన చెల్లింపులపై స్పష్టత లేకపోవడం, ప్రతి నెలా నిర్దిష్ట సమయంలో కాకుండా ఇష్టానుసారంగా జీతాలు విడుదల చేస్తుండడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలకు సంబంధించి నెలవారీ చెల్లింపులు గాడి తప్పుతున్నాయి. రుణ చెల్లింపుల్లో క్రమం తప్పడంతో తమ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోసం ఉద్యోగులు ప్రతి నెలా సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో వినతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల మాదిరి గురుకుల ఉద్యోగులకు కూడా నెలవారీగా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
గురుకులాల్లో చేరేదెందరు?
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీల్లో కొత్తగా కొలువులు సాధించినవారిలో ఎంతమంది విధుల్లో చేరుతారనేది దానిపై సెపె్టంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టత రానుంది. ఒకట్రెండు కేటగిరీల్లో 500 పోస్టులు మినహా మిగిలిన కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీలు గత నెలాఖరులో 8,304 పోస్టులకుగాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవి అందుకున్న నాటినుంచి 60 రోజుల్లో వారికి నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన. ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగం సాధించిన వారంతా సెపె్టంబర్ నెలాఖరు కల్లా తప్పనిసరిగా విధుల్లో చేరాలి. లేకుంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీలు ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి. ఖాళీల లెక్క తేలేది వచ్చే నెలలోనే... గురుకుల కొలువుల్లో రెండు, మూడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) అధికారుల అంచనా ప్రకారం 1,550 ఉద్యోగాలు మిగిలిపోయే అ వకాశమున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అక్టోబ ర్ మొదటివారం నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం ఉంది. ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించే జాబ్ కేలండర్లో చేర్చుతారనే అభిప్రాయం కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గురుకుల విద్యాసంస్థల్లో ఉ ద్యోగాల భర్తీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ కేలండర్లో ప్రకటన ఇవ్వొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
8,600 మంది కొత్త టీచర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థలు కొత్త టీచర్లతో కళకళలాడనున్నాయి. వచ్చేవారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు 4 నెలలు కావొస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగినా, ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి. 2,3రోజుల్లో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా గురుకుల సొసైటీలు కార్యాచరణ రూపొందించాయి. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా సొసైటీల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించగా, ఆలోపు అన్ని కేటగిరీల్లో బదిలీల పూర్తికి చర్యలు వేగవంతం చేశాయి. బదిలీలు పూర్తి కాగానే... కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో రెండ్రోజుల్లో బదిలీలు పూర్తవుతాయి. బీసీ గురుకుల సొసైటీలో శనివారం నాటికి పూర్తయ్యే అవకాశముంది. ఎస్సీ గురుకుల సొసైటీలో పలు కేటగిరీలు పెండింగ్‌లో ఉండడంతో నిర్దేశించిన తేదీల్లోగా పూర్తయ్యే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీలోరాత్రింబవళ్లు బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల సరి్టఫికెట్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభమైన వెంటనే వారికి లాగిన్ ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అన్ని కేటగిరీల టీచర్లకు వెబ్‌ఆప్షన్లుకు గరిష్టంగా రెండ్రోజుల సమయం ఇవ్వాలని సొసైటీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత ఆప్షన్ల ఫ్రీజింగ్ అనంతరం పోస్టింగ్ ఉత్తర్వులు కూడా ఆన్లైన్ ద్వారానే జారీ చేసేలా సాంకేతికను సిద్ధం చేశారు. పోస్టింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిగా మెరిట్ ఆధారంగానే ప్రాధాన్యం ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించి వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
ఎస్సీ గురుకులాల్లో ‘డిస్ లొకేటెడ్’ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్ ఈఐఎస్) పరిధిలో జరుగు తున్న ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ గందర గోళంగా మారింది. ఈ సొసైటీ పరిధిలోని పలు కేడర్లలోని ఉద్యోగులకు ఓవైపు పదోన్న తులు కల్పిస్తూనే.. మరోవైపు బదిలీల ప్రక్రియ నిర్వహించేలా సొసైటీ కార్యాచరణ రూ పొందించి అమలుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో బదిలీ లు, పదోన్నతులకు అర్హత పొందిన ఉద్యోగుల జాబి తాను ప్రకటించారు. జీఓ 317 అమలులో భాగంగా పలు వురు ఉద్యోగులను వారు పని చేస్తున్న పరిధిని డిస్లొకేట్ చేస్తూ కొత్తగా జోన్లు, మల్టీజోన్లు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. డిస్‌లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తక్షణమే బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావా లని, లేకుంటే ఖాళీ ల లభ్యతను బట్టి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో డిస్‌లొకేటెడ్ జాబితాలో ఉన్న ఉద్యోగులు సొసైటీ కార్యాయా నికి చేరుకోవడం.. వారిని డిస్‌లొకేటెడ్ జాబితా లోకి తీసుకు రావడంపై ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సోమవారం నుంచి మొదలైన ఈ పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో డీఎస్ఎస్ భవన్ గురుకుల టీచర్లతో కిక్కిరిసిపోయింది.తారుమారుపై గరంగరం.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్ విధా నం అమల్లోకి రావడంతో ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాయి. గురుకుల సొసైటీలు కూడా ఆ దిశగా కసరత్తు చేసి 2022 సంవత్సరంలో ఉద్యోగులకు జోన్లు, మల్టీ జోన్ల కేటాయింపు చేప ట్టాయి. కానీ విద్యాసంవత్సరం మధ్యలో బోధన, అభ్యసన కార్య క్రమాలకు ఇబ్బందులు తలెత్తు తాయనే భావనతో కేటాయింపుల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టాయి. ప్రస్తుతం గురుకులాలకు కొత్త ఉద్యోగులు వస్తుండడంతో సీనియర్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడుతుండగా... జీఓ 317 కింద డిస్ లొకేటెడ్ అయిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు సొసైటీ చర్యలు మొదలు పెట్టింది. కానీ డిస్‌లొకేడెట్ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగుల కేటాయింపు సమయంలో తామిచ్చిన ఆప్షన్లకు భిన్నంగా తాజాగా కేటాయింపులు జరిపారని, మరోవైపు సంబంధం లేని జోన్లు ఇవ్వడంతో తమతోపాటు పిల్లల భవిష్యత్ తారు మారు అవుతుందని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మినహాయింపు ఇచ్చిన సొసైటీ మిగతా ఉద్యోగులకు స్థానచలనం కల్పించింది. ప్రిన్స్‌పాల్, జూనియర్ లెక్చరర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ కేటగిరీలో దాదాపు పదోన్నతులు పూర్తి కాగా, ఆయా కేటగిరీల్లో బదిలీలు సైతం దాదాపు పూర్తి చేసినట్టు టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు చెబుతున్నారు.మూడు రోజుల్లో మిగతా కేటగిరీల్లో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రిన్సిపాల్, జేఎల్, పీజీటీ కేటగిరీల్లో మెజారిటీ శాతం బది లీలు పూర్తి చేసిన సొసైటీ... టీజీటీ, లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీ టీచింగ్ స్టాఫ్‌తోపాటు సొసైటీ పరిధిలోని నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సి ఉంది. బదిలీల ప్రక్రియ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. కానీ ఆలోపు అన్ని కేట గిరీల్లో బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. ఎక్కువ కేటగిరీలు ఉండడంతో రాత్రింబవళ్లు పూర్తి చేసేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. గతవారం రోజులుగా పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి పొద్దు పోయేవరకు కూడా సొసైటీ అధికారులు బదిలీలు, పదోన్నతుల కసరత్తు సాగిస్తుండడం గమనార్హం. -
‘గురుకులం’లో హడలెత్తిస్తున్న ఎలుకలు
డిండి(నల్లగొండ): నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురులకు పాఠశాల(బాలికలు)లో ఎలుకలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 635 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడం, గదుల గోడలకు ఏర్పడిన రంధ్రాల్లో ఎలుకలు, పాములు తిరుగుతున్నాయి. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఈ నెల 2న ఆరుగురు, 3న మరో ఆరుగురు, 5న నలుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. దీంతో వారు స్థానిక పీహెచ్సీలో యాంటీ రేబిస్ టీకాను వేయించుకున్నారు. ఈ నెల 2వ తేదీన మండల వైద్యాధికారి ఎస్.శైలి గురుకుల ఆవరణను పరిశీలించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీఓ, ఎంఈఓకు లేఖ రాశారు. ప్రిన్సిపాల్ పద్మ విద్యార్థినుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. -
కొత్త కొలువు రద్దయిపాయె!
కరీంనగర్ జిల్లాకు చెందిన యు.భానుప్రియ పీజీటీ(గణితం)గా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన గురుకుల టీచర్లకు ఆయా సొసైటీలు ప్రస్తుతం పోస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. భానుప్రియ సంబంధిత పరిశీలన కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించింది. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు జాబితాలో నీ పేరు లేదని చెప్పడంతో భానుప్రియ అవాక్కయ్యింది. దీంతో తిరిగి హైదరాబాద్‌లోని గురుకుల నియామకాల బోర్డులో సంప్రదించగా, ఉద్యోగాన్ని రద్దు చేసినట్టు అధికారులు చెప్పడంతో కంగుతిన్నది. భానుప్రియ సమర్పించిన వినికిడిలోపం ధ్రువీకరణకు సంబంధించి 39 శాతం మాత్రమే లోపం ఉన్నందున ఆ కోటాలో ఎంపికైన కొలువును రద్దు చేసినట్టు చెప్పారు. వాస్తవానికి భానుప్రియ వద్ద ఉన్న సదరం ధ్రువీకరణలో 68 శాతం వినికిడి లోపం ఉండడం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా ఐదు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 8,600 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఈ మేరకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ప్రస్తుతం వారికి ఆయా సొసైటీల పరిధిలో పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను మెరిట్, ర్యాంకు ఆధారంగా ప్రాధాన్యతక్రమంలో గురుకుల సొసైటీలకు టీఆర్‌ఈఐఆర్‌బీ కేటాయించగా, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన అనంతరం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లిన కొందరికి భానుప్రియకు ఎదురైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో ఆయా అభ్యర్థులంతా గురుకుల నియామకాల బోర్డును ఆశ్రయించడం. వారికి ఇచ్చిన నియామకాలు రద్దయినట్టు ఆక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది మంది ఉద్యోగాలు రద్దయినట్టు సమాచారం. ఇదే కేటగిరీలో కనిష్టంగా మరో 38 మంది కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గురుకులబోర్డు అధికారులు మాత్రం వెల్లడించడం లేదు.ఇంతకీ ఏం జరిగింది...?8,600 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వగా, ఇందులో కొందరు వికలాంగ అభ్యర్థులు ఉన్నారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన దాదాపు 600 మంది అభ్యర్థుల వైకల్య ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మెడికల్ బోర్డులకు పంపారు. అయితే ఆయా అభ్యర్థులు సమర్పించిన సదరం వైకల్య ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న డిజెబిలిటీ శాతం, మెడికల్ బోర్డు అధికారులు గుర్తించిన డిజెబిలిటీ శాతంలో తీవ్ర వత్యాసం ఉంది. దీంతో మెడికల్ బోర్డు నిర్దేశించిన డిజెబిలిటీ శాతాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు, తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థుల ఉద్యోగ నియామకాలను రద్దు చేసినట్టు తెలిసింది.ఏం చేయాలి.. ఏం చేశారు ?గురుకుల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అధికారులు చేసిన పొరపాట్లే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాత పరీక్ష, ఇతర అర్హతలను పరిశీలించి నిర్థారించుకున్న తర్వాతే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగ కేటగిరీ అభ్యర్థులు సమర్పించిన వికలత్వ ధ్రువీకరణను సరిగ్గా పరిశీలించుకోకుండానే నియామక పత్రాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ముందుగా అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం, వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్థారించుకోవడం లాంటివి ముందుగా చేసి ఒకటికి రెండుసార్లు స్పష్టత వచ్చిన తర్వాతే తుది ఫలితాలు ప్రకటించాలి. కానీ అలా కాకుండా ముందుగా అర్హులుగా గుర్తించి వారికి నియామక పత్రాలు ఇచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగాలు రద్దయ్యాయని చెప్పడం గమనార్హం. దీనిపై ఆయా అభ్యర్థులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు సంయుక్తంగా విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.సంస్థ పరిధిలోని 38 సాధారణ పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు, 12 మైనారిటీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లు, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 25,216 మంది పరీక్షకు హాజరయ్యారు.» పాఠశాల స్థాయిలో ఐదో తరగతిలో ఎం.కీర్తి (విశాఖపట్నం జిల్లా), 6వ తరగతి పి.సోమేశ్వరరావు (విజయనగరం జిల్లా), 7వ తరగతి కె.ఖగేంద్ర (శ్రీకాకుళం జిల్లా), ఎనిమిదో తరగతిలో వై.మేఘ శ్యామ్ (విజయనగరం జిల్లా) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. » రాష్ట్రంలోని ఏడు జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,149 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,308 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎంపీసీ విభాగంలో జి.యశ్వంత్ సాయి, ఎంఈసీ/సీఈసీ విభాగంలో ఎల్.సత్యరామ్ మోహన్ (తూర్పు గోదావరి), బైపీసీ విభాగంలో ఎం.మహిత (కర్నూలు జిల్లా) అత్యధిక మార్కులు సాధించారు. వీరితో పాటు నాగార్జునసాగర్‌లోని డిగ్రీ కాలేజీలో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను https://aprs.apcfss.in/ లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ కార్యదర్శి నరసింహారావు తెలిపారు. -
గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను గాలికొదిలేశాయి. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంటీర్మీడియట్ బోర్డు గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి మే నెల 31వరకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని గురుకుల సొసైటీలు... పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే తరగతులు ప్రారంభించాయి. ఇంటర్మీడియ్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు రెండో సంవత్సరం పాఠ్యాంశాన్ని ప్రారంభించగా... ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. ఏయే సొసైటీలంటే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఎస్), మహాత్మా జ్యోతి బా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలేన్సీ(సీఓఈ) జూనియర్ కాలేజీలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తుండగా... తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) మాత్రం రంజాన్ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సీఓఈలకు ప్రత్యేకమంటూ... రాష్ట్రంలోని గురుకుల సొసైటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాంగణంలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు పాఠశాలలు నిర్వహిస్తుండగా.. జూనియర్ కాలేజీని ప్రత్యేక ప్రిన్సిపల్‌తో నిర్వహిస్తున్నారు. గురుకుల సొసైటీలకు పాఠశాలలతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సీఓఈల పేరిట ప్రత్యేక పాఠశాలలున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 30, బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 12 సీఓఈల్లో ఇంటర్మీడియట్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయా సొసైటీ కార్యదర్శులు వేరువేరుగా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. సీఓఈల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫస్టియర్ కేటగిరీకి మే 15వ తేదీ వరకు, సెకండియర్ విద్యార్థులకు మే 26వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నా రు. ముందస్తుగా పాఠ్యాంశాన్ని ముగించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సొసైటీ కార్యదర్శులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే బాటలో ప్రైవేటు కాలేజీలు.. గురుకుల విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తుండడంతో పలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం ఇదే బాట పట్టాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా తరగతులను నిర్వహిస్తున్నాయి. వేసవి సీజన్లో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఉండగా కనీస ఏర్పాట్లు చేయకుండా పలు కాలేజీలు తరగతులు నిర్వహిస్తుండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుంటే సిలబస్ మిస్సవుతుందనే ఆందోళనతో తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతున్నట్లు వాపోతున్నారు. -
వచ్చే నెలాఖరు కల్లా గురుకుల ప్రవేశ పరీక్షలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు నిర్దేశించుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు నాటికే అన్నిరకాల ప్రవేశపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గురుకుల సొసైటీలు ఉమ్మడిగా నిర్వహించే ఐదో తరగతి ప్రవేశ పరీక్షను ఇప్పటికే పూర్తి చేశాయి. విడివిడిగా నిర్వహించే బ్యాక్లాగ్ ఖాళీలు, జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు, డిగ్రీ, పీజీ కోర్సుల్లోనూ సంవత్సరం ప్రవేశాలకు అర్హత పరీక్షలను తేదీలను ప్రకటించి.. వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మే నెలాఖరు నాటికి ఫలితాలు గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖల ఆధ్వర్యంలోని గురుకుల సొసైటీలు ఉమ్మడిగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నాయి. దాదాపు 50వేల సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఈసారి 1.5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అధికారులు వారి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక సొసైటీల వారీగా గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వీటికి పరీక్షలను నిర్వహించగా.. మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీలు వారంలోగా పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇక గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల అర్హత పరీక్షలు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల పరీక్షను ఏప్రిల్ 28వ తేదీ నాటికి అన్ని సొసైటీలు పూర్తి చేయనున్నాయి. పీజీ కాలేజీల్లో ప్రవేశ పరీక్షలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. వాటి ఫలితాలను మే నెలాఖరు నాటికి ప్రకటించాలని, జూన్ తొలివారం నుంచి 2024–25 విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చాయి. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఆ తర్వాత క్రమంగా ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫి కేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ పుల్ల కార్తీ క్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూ డా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. -
కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్‌లో పెట్టారు. కాగా, కోడ్ తొలగిన వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది. సీనియారిటీ తారుమారు కాకుండా.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీజోన్ కేడర్లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్‌లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు. -
ముగిసిన గురుకుల టీజీసెట్ దరఖాస్తు ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి అర్హత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. సాయంత్రం వరకు సాగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా 1.25 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. డూప్లికేషన్, పూర్తి వివరాలు లేని దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఆర్ఈఐఎస్)ల్లో ఐదోతరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. నాలుగు సొసైటీల పరిధిలో దాదాపు ఏడువందల గురుకుల పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఐదో తరగతిలో 48,500 సీట్లున్నాయి. ఒక్కో సీటుకు సగటున రెండున్నర రెట్లు పోటీ ఉంది. ఫిబ్రవరి 11న అర్హత పరీక్ష ఐదోతరగతి ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు సెట్ కన్వినర్ ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో విద్యార్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సొ సైటీల వారీగా రిజర్వేషన్లు వేరువేరుగా ప్రాధాన్యతల క్రమంలో ఉంటాయి. అర్హ త పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికే ప్రవేశానికి అవకాశం కలుగు తుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే నెల మొదటి వారంలో పరీక్ష ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. తొలి విడతలో దాదాపు 75 శాతం మంది ప్రవేశాలు పొందుతారని, ఆ తర్వాత రెండో విడత, చివరగా మూడో విడతతో వందశాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు సమాచారం. -
బదిలీలు ఉంటాయో.. లేదో!?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 భయం వీడలేదు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి చేసినప్పటికీ... కేవలం గురుకుల విద్యా సంస్థల్లో మాత్రమే ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 30వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరందరికీ స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలో కేటాయింపులు జరిపారు. ఈ మేరకు నూతన కేటాయింపులతో కూడిన జాబితాలను గురుకుల సొసైటీలు సిద్ధం చేసినప్పటికీ 2022–23 విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలిగిస్తే ఇబ్బందులు వస్తాయన్న భావనతో ఈ ప్రక్రియను అప్పట్లో వాయిదా వేశారు. కానీ ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నా జీఓ 317 అమలు ఊసేలేదు. ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఎలా...? రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగ ఖాళీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ముందుగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఖాళీలపై స్పష్టత వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేసింది. ఈ క్రమంలో గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికత ఆధారంగా ఈ కేటాయింపులు జరపడంతో జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చింది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీల్లోనూ జీఓ 317 అమలు చేస్తేనే ఉద్యోగ ఖాళీల లెక్క తేలుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు చేపట్టాలని సొసైటీ కార్యదర్శులను ఆదేశించింది. దాంతో గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేసి ప్రాథమిక జాబితాలు రూపొందించినప్పటికీ... వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు. వాస్తవానికి 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడితే ఆ మేరకు ఉద్యోగులు విధుల్లో చేరే వీలుండేది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నాజీఓ 317 అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుండడం.... మరోవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ఉద్యోగులను కొత్త స్థానాలకు బదిలీ చేసే అవకాశంపై సొసైటీ వర్గాల్లో కొంత ఆనిశ్చితి కనిపిస్తోంది. ఇంకోవైపు గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల ఖాళీల లెక్కపైనా అయోమయం నెలకొంది. -
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలే తరువాయి..
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోని వివిధ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షల నిర్వహణ ఈనెల 10తో ముగిసిఇంది. నాలుగు సొసైటీల పరిధిలో అర్హత పరీక్షలన్నీ ముగియడంతో ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీ మినహా టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్ఈఐఎస్, టీఎస్ఆర్ఈఐఎస్లు ఐదోతరగతితో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాయి. వీటితో పాటు 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలకు సొసైటీలు వేర్వేరుగా అర్హత పరీక్షలు నిర్వహించాయి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సైతం ఏ సొసైటీకా సొసైటీ అర్హత పరీక్షలు ముగిశాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలోని సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు, బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అగ్రికల్చర్ డిగ్రీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిగ్రీ ప్రవేశాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(ఈఎంఆర్ఎస్)లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేకంగా సెట్ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలన్నీ వరుసగా విడుదల చేసేందుకు ఆయా సొసైటీలు సన్నద్ధమయ్యాయి. అర్హత పరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేసేందుకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. ముందుగా పాఠశాలల్లో ప్రవేశాల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఐదో తరగతి అడ్మిషన్లకు నిర్వహించిన వీటీజీసెట్–2023 ఫలితాలను వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నారు. -
అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే. కాగా ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్ ఆర్డర్)విధానాన్ని అమలు చేయాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. తొమ్మిది కేటగిరీల్లో కొలువులు... ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్ (డీఎల్), జూనియర్ లెక్చరర్(జేఎల్), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులున్నాయి. కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్‌కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్‌తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవరోహణ పద్ధతి ఇలా.. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా గురుకుల నియామకాల బోర్డు పరిధిలో 9 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్‌ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఆటలకు సై..!
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలు చదువుల్లోనే కాదు ఇకపై ఆటల్లోనూ దూసుకుపోనున్నారు. రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 ప్రాంతాల్లో రూ.18 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) పర్యవేక్షిస్తోంది. స్టేడియం నిర్మాణం, క్రీడా సౌకర్యాల ఆధునికీకరణ పథకంలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు నాలుగు పనులు పూర్తి కాగా, మరో ఆరు పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని గిరిజన విద్యాలయాల్లో రూ.2 కోట్లతో ఆట స్థలాల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పనులు జరుగుతున్నాయి. ఈ ఆరు క్రీడా మైదానాల అభివృద్ధికి, క్రీడా పరికరాల ఆధునికీకరణకు రూ.16 కోట్లు కేటాయించారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని అన్ని గిరిజన పాఠశాలలకు సంబంధించిన క్రీడా మైదానాలను మట్టి, ఇసుకతో మెరక చేసి అభివృద్ధిపరిచేలా ‘సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)’లకు బాధ్యతలు అప్పగించారు. ఆట స్థలాల అభివృద్ధి పనులను నాడు–నేడు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల విద్యాలయాన్ని ప్రయోగాత్మకం(ఫైలెట్)గా తీసుకుని ఆటస్థలం అభివృద్ధి పనులు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. -
26 నుంచి టీజీటీ, పీజీటీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి సంబంధించి టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) అర్హత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. సబ్జెక్టుల వారీగా తేదీలను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) గురువారం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీజీటీ కేటగిరీలో 56,421 మంది, పీజీటీ కేటగిరీలో 62,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తికావడంతో పరీక్షల ఏర్పాట్లకు బోర్డు ఉపక్రమించింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష తేదీకి పది రోజుల ముందే హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. అర్హత పరీక్షలను మూడు పేపర్లుగా విభజించారు. పేపర్–1 పరీక్ష కామన్‌గా ఒకేరోజు (అక్టోబర్ 6న) నిర్వహిస్తుండగా పేపర్–2, పేపర్–3 పరీక్షలు మాత్రం సబ్జెక్టుల వారీగా వేర్వేరు తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. -
నీట్లో గురుకుల విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్: నీట్–2018లో సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. పేద కుటుంబానికి చెందిన జుబిలాంట్ జత్రోత్ నవీన్ జాతీయస్థాయిలో ఎస్టీ కేటగిరీలో 210 ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో సాయి కిషోర్ 767వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. మొత్తంగా 87 మంది నీట్లో ర్యాంకులు సాధించారని, వీరిలో 63 మందికి మెడిసిన్, 24 మందికి బీడీఎస్‌లో సీటు లభించే అవకాశముందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. బయట కోచింగ్‌లకు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్, ఆపరేషన్ ఎమరాల్డ్ కార్యక్రమాలతో మంచి ర్యాంకులు వచ్చాయన్నారు. ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న తనకు ఆపరేషన్ ఎమరాల్డ్ ఎంతో ఉపయోగపడిందని నవీన్ అన్నారు. కార్డియాలజిస్ట్ అవుతానని.. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోని పేదలకు సేవ చేస్తానని చెప్పారు. ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ తనకు చాలా ఉపయోగపడిందని, దీని సహాయంతోనే మంచి ర్యాంకు సాధించానని సాయి కిషోర్ తెలిపారు. ఇన్ఫెక్షన్తో ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధుల నిర్మూలనలో స్పెషలిస్టు కావాలన్నదే తన లక్ష్యమన్నారు. -
నియోజకవర్గానికో బీసీ గురుకులం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మరిన్ని గురుకులాలు అందుబాటులోకి రాబోతున్నాయి. గత విద్యా సంవత్సరం 119 బీసీ గురుకుల పాఠశాలలను తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా నియోజకవర్గానికో గురుకుల పాఠశాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 1 నుంచి 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నాటికి ఈ గురుకులాలను ప్రారంభించేందుకు మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 142 బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే 119 గురుకులాలతో కలిపితే వాటి మొత్తం సంఖ్య 261కి చేరనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యా సంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలే తక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య పెంచాలని, కనీసం నియోజకవర్గానికి రెండు గురు కులాలైనా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన బీసీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలోనూ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించడంతో వాటి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రతి నియోజకవర్గంలో బాలికలతోపాటు బాలుర గురుకులం ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసి.. ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపింది. సీఎం సంతకం కాగానే గురుకులాల ఏర్పాటు వేగవంతం కానుంది. ఇందుకు సంబంధించి వారంలోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఐదో తరగతితోనే ప్రారంభం గతేడాది ప్రారంభించిన గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతులకు అడ్మిషన్లు తీసుకున్నారు. తాజాగా ప్రారంభించనున్న గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ప్రవేశాలు జరిపేలా అధికారులు ప్రణాళిక తయారుచేశారు. ప్రస్తుతం ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే సెట్‌కు దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ప్రవేశ పరీక్ష తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కొత్త గురుకులాల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. -
12 నుంచి మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం
సాక్షి, హైదరాబాద్: గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురుకుల విద్యాలయాల పటిష్టతపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల సొసైటీల కార్య దర్శులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, విద్యాశాఖ సంచాలకుడు కిషన్, ఇతర అధికారులతో మంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాలను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని, వాటిని రోల్ మోడల్‌గా మార్చేలా చర్యలు తీసు కోవాలన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్‌లలో గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని అన్నారు. విద్యార్థులందరికీ హెల్త్ కిట్లు.. విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్లు అందించాలన్నారు. బాలికలకు న్యాప్కిన్స్ సరిపడా ఇవ్వాలని, పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయ్ చేయాలన్నారు. ఇక ప్రతి గురుకులంలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, ఒక ఏఎన్ఎం ఉండాలన్నారు. క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు పీఈటీ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గురుకులాల ప్రవేశాల్లో కూడా నియోజకవర్గాల్లోని స్థానికులకు కొంత ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త జిల్లాలను యూనిట్ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహించాలన్నారు. -
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు అ ర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను జిల్లా మైనార్టీ శాఖ ఆహ్వానిస్తోంది. అలాగే ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి రత్న కల్యాణి తెలిపారు. రాజేంద్రనగర్ (బాలురు, బాలికలు), ఫరూఖ్‌నగర్ (బాలికలు), శేరిలింగంపల్లి (బాలురు), హయత్‌నగర్ (బాలురు, బాలికలు), ఇబ్రహీంపట్నం (బాలికలు), బాలాపూర్ (బాలురు), మెయినాబాద్ (బాలికలు)లో పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ముస్లిం, క్రైస్తవ, పార్సీ, జైనులు, సిక్కులు, బౌద్ధ విద్యార్థులకు 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీ సీ, ఇతరులకు 25 శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 20వ తేదీలోగా www. tmreis. telangana. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, పాస్ పోర్ట్‌సైజు ఫొటో, బర్త్ సర్టిఫికెట్, బోనాఫైడ్, వార్షికాదాయ ధ్రువపత్రాలు అవసరమ న్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సంప్రదించాని కోరారు. -
అన్ని గురుకులాల్లో ఒకే మెనూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే రకమైన భోజనం (మెనూ), మౌలిక వసతులు (అమెనిటీస్) కల్పించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధుల కోసం వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో రకరకాల పద్ధతులుండటం వల్ల పిల్లల్లో బేధభావాలేర్పడే అవకాశం ఉందని.. అందరికీ సమానావకాశాలు, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు మంచి మెనూ అందిస్తున్నారని, వస తులూ బాగున్నాయని.. ఇలాంటి మెనూ, వసతులు అన్ని సొసైటీల్లోని విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వసతుల కల్పన మన బాధ్యత మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులున్నాయని.. కేజీబీవీలలో వచ్చే ఏడాది నుంచి అకడమిక్ బ్లాకులు నిర్మిం చాలని యోచిస్తున్నట్లు కడియం తెలిపారు. రెండేళ్లలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో బయోమెట్రిక్ మెషీన్లు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, డ్యుయల్ డెస్క్‌లు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్లు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఫర్నిచర్ ఇచ్చామన్నారు. చలికాలంలో వేడి నీళ్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు అందించడం కనీస బాధ్యతని చెప్పారు. ఆన్‌కాల్‌లో డాక్టర్లు: ప్రవీణ్ కుమార్ విద్యార్థుల హజరు నమోదులో అవకతవకల్లేకుండా ఆన్లైన్లో హాజరు నమోదు చేస్తున్నామని, తర్వాత మార్చడానికి వీల్లేకుండా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉత్తమ విధా నం అవలంభిస్తున్నామని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేశామని, ప్రతి విద్యార్థికి ఎలక్ట్రా నిక్ హెల్త్ కార్డులు జారీ చేశామని, కమాండ్ సెంటర్లో ఆన్‌కాల్‌లో డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామ న్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థి కోలుకునే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. -
గురుకులాల్లో సరికొత్త మెనూ
నెలలో నాలుగు రోజులు చికెన్, రెండు రోజులు మటన్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యార్థులకు శుభవార్త. గురుకుల పాఠశాలల్లో అందిస్తున్న భోజన మెనూ పూర్తిగా మారింది. ఇంట్లో మాదిరిగా చక్కని అల్పాహారం, పౌష్టికాలతో మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి పసందైన భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల మెస్ చార్జీలను ఇటీవలే ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మార్పులు చేపట్టిన గురుకుల సొసైటీలు.. తాజాగా సరికొత్త మెనూ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త మెనూ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పులిహోరకు చెక్.. కొన్నేళ్లుగా గురుకులాల్లో అల్పాహారం కింద ఉదయం లెమన్ రైస్ లేదా పులిహోర, కిచిడీ అందిస్తున్నారు. తాజా మెనూలో అల్పాహారం కింద పూరి, ఇడ్లీ, చపాతి, దోశ, మైసూర్‌బోండాలను చేర్చారు. మధ్యాహ్న, రాత్రి భోజనంలో పప్పు, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇస్తుండగా.. తాజా మెనూ ప్రకారం నెలలో 6 రోజులు మాంసాహారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 4 రోజులు చికెన్, రెండ్రోజులు మటన్ ఇవ్వనున్నారు. మిగతా రోజుల్లో పప్పు, కూరగాయలతో నాణ్యమైన భోజనం అందించనున్నారు. భోజన సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా నెయ్యి, చట్నీ అందించాలని నిర్ణయించారు. సాయంత్రం చిరుతిళ్లలో బిస్కెట్లకు బదులు కుకీస్, పకోడా తదితర పదార్థాలివ్వాలని భావిస్తున్నారు. మెనూ తయారీలో జాతీయ పౌష్టికాహార సంస్థ నిపుణులను సైతం సంప్రదించి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సొసైటీ కార్యదర్శులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, మల్లయ్య భట్టు తెలిపారు. పక్కాగా పర్యవేక్షణ... మెనూ అమలులో గురుకుల సొసైటీలు నిఘా కట్టుదిట్టం చేశాయి. మెనూ అమలుతీరు పర్య వేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. అలాగే గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఆ శాఖ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.