ురుకుల కొలువుల్లో ఇదేం చోద్యం
మెడికల్ బోర్డు ద్వారావైద్య పరీక్షలు నిర్వహించకుండానే నియామక పత్రాలు
తీరా ధ్రువపత్రాలు సమర్పించాక..మీ డిజేబిలిటీ శాతంలో వ్యత్యాసముందంటూ పోస్టు రద్దు
కరీంనగర్ జిల్లాకు చెందిన యు.భానుప్రియ పీజీటీ(గణితం)గా ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన గురుకుల టీచర్లకు ఆయా సొసైటీలు ప్రస్తుతం పోస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది.
భానుప్రియ సంబంధిత పరిశీలన కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించింది. ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు జాబితాలో నీ పేరు లేదని చెప్పడంతో భానుప్రియ అవాక్కయ్యింది. దీంతో తిరిగి హైదరాబాద్‌లోని గురుకుల నియామకాల బోర్డులో సంప్రదించగా, ఉద్యోగాన్ని రద్దు చేసినట్టు అధికారులు చెప్పడంతో కంగుతిన్నది.
భానుప్రియ సమర్పించిన వినికిడిలోపం ధ్రువీకరణకు సంబంధించి 39 శాతం మాత్రమే లోపం ఉన్నందున ఆ కోటాలో ఎంపికైన కొలువును రద్దు చేసినట్టు చెప్పారు. వాస్తవానికి భానుప్రియ వద్ద ఉన్న సదరం ధ్రువీకరణలో 68 శాతం వినికిడి లోపం ఉండడం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా ఐదు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 8,600 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఈ మేరకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ప్రస్తుతం వారికి ఆయా సొసైటీల పరిధిలో పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను మెరిట్, ర్యాంకు ఆధారంగా ప్రాధాన్యతక్రమంలో గురుకుల సొసైటీలకు టీఆర్‌ఈఐఆర్‌బీ కేటాయించగా, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా పోస్టింగులు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు ఏర్పాట్లు చేశాయి.
ఈ క్రమంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించిన అనంతరం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లిన కొందరికి భానుప్రియకు ఎదురైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో ఆయా అభ్యర్థులంతా గురుకుల నియామకాల బోర్డును ఆశ్రయించడం. వారికి ఇచ్చిన నియామకాలు రద్దయినట్టు ఆక్కడి అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు దాదాపు ఎనిమిది మంది ఉద్యోగాలు రద్దయినట్టు సమాచారం. ఇదే కేటగిరీలో కనిష్టంగా మరో 38 మంది కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గురుకులబోర్డు అధికారులు మాత్రం వెల్లడించడం లేదు.
ఇంతకీ ఏం జరిగింది...?
8,600 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వగా, ఇందులో కొందరు వికలాంగ అభ్యర్థులు ఉన్నారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన దాదాపు 600 మంది అభ్యర్థుల వైకల్య ధ్రువీకరణ పత్రాలను సంబంధిత మెడికల్ బోర్డులకు పంపారు. అయితే ఆయా అభ్యర్థులు సమర్పించిన సదరం వైకల్య ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న డిజెబిలిటీ శాతం, మెడికల్ బోర్డు అధికారులు గుర్తించిన డిజెబిలిటీ శాతంలో తీవ్ర వత్యాసం ఉంది. దీంతో మెడికల్ బోర్డు నిర్దేశించిన డిజెబిలిటీ శాతాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు, తక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థుల ఉద్యోగ నియామకాలను రద్దు చేసినట్టు తెలిసింది.
ఏం చేయాలి.. ఏం చేశారు ?
గురుకుల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అధికారులు చేసిన పొరపాట్లే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాత పరీక్ష, ఇతర అర్హతలను పరిశీలించి నిర్థారించుకున్న తర్వాతే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి. కానీ టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగ కేటగిరీ అభ్యర్థులు సమర్పించిన వికలత్వ ధ్రువీకరణను సరిగ్గా పరిశీలించుకోకుండానే నియామక పత్రాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది.
ముందుగా అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం, వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను నిర్థారించుకోవడం లాంటివి ముందుగా చేసి ఒకటికి రెండుసార్లు స్పష్టత వచ్చిన తర్వాతే తుది ఫలితాలు ప్రకటించాలి. కానీ అలా కాకుండా ముందుగా అర్హులుగా గుర్తించి వారికి నియామక పత్రాలు ఇచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగాలు రద్దయ్యాయని చెప్పడం గమనార్హం. దీనిపై ఆయా అభ్యర్థులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment