తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్
కంగుతిన్న జీహెచ్‌సీ అధికారులు
గచ్చిబౌలి పోలీసులకు అప్పగింత
గచ్చిబౌలి: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వా«దీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు.
రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100, గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.
మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment