భద్రత ఎక్కడ? | Lack of protection in welfare hostels | Sakshi
Sakshi News home page

భద్రత ఎక్కడ?

Published Sun, Nov 17 2024 5:59 AM | Last Updated on Sun, Nov 17 2024 5:59 AM

Lack of protection in welfare hostels

సంక్షేమ వసతిగృహాల్లో రక్షణ కరువు

సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్‌ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారు­తున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్ల­లోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. 

అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక  ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్‌లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్‌ గరŠల్స్‌ కాంపౌండ్‌లోని బీసీ ప్రీ మెట్రిక్‌ (చిన్న పిల్లల) హాస్టల్‌లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయ­మాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. 

దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్‌పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్‌ను, వార్డెన్‌ డ్రైవర్‌ను కేసు నుంచి తప్పించారనే ఆరోప­ణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్‌లో కూడా ఇలాంటే సంఘట­నలు జరుగుతున్నప్పటికి అధి­కా­రులు గోప్యంగా ఉంచుతున్నారని సమా­చారం. ఇదంతా హాస్టల్‌ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తు­తున్నాయి. 

కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్‌తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసి­చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తు­తున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్‌ ఫెన్సింగ్‌ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్‌కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్‌కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి.  

ఈ హాస్టల్‌లో పిల్లలను ఉంచలేం..
» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్‌లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్‌లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటి­గ్రేటెడ్‌ హాస్టల్‌ను పాత సంతమార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్‌లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. 

హాస్టల్‌ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్‌ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్‌ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. 

పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపో­యాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్‌ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్‌లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతు­న్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. 

»తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యా­ర్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదు­ర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహా­రం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

హాస్టల్‌ చుట్టూ దుర్వాసన వస్తోంది
మా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో ఉంటున్నాను. హాస్టల్‌ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్‌ వాల్‌ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు.    – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లా

భద్రత కల్పించాలి
రాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్‌లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్‌ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లా

సంక్షోభ హాస్టళ్లు
పేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. 

విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం 
విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్‌ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. 

తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. 

వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్‌ విల్లింగ్‌) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement