Welfare Hostels
-
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ
-
సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు
నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి.అంతటా అవే సమస్యలే..» ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్లో వాచ్మెన్, అటెండర్లే వంట చేస్తున్నారు.» ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు.» విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది.» మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్రూమ్లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు..ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు.హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..» హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.» మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. -
భద్రత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్లలోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్ గరŠల్స్ కాంపౌండ్‌లోని బీసీ ప్రీ మెట్రిక్ (చిన్న పిల్లల) హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్‌పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్‌ను, వార్డెన్ డ్రైవర్‌ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇలాంటే సంఘటనలు జరుగుతున్నప్పటికి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. ఇదంతా హాస్టల్ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్ ఫెన్సింగ్ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్‌కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్‌కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచలేం..» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను పాత సంతమార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపోయాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. »తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోందిమా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు. – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాభద్రత కల్పించాలిరాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాసంక్షోభ హాస్టళ్లుపేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంసాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్ విల్లింగ్) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్‌లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
మురికి కూపం.. పురుగుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు. మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్‌నగర్ జిల్లా కోయల్కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తనిఖీలు జరిగాయి. మెనూకు చెల్లు చీటీ.. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు. నాణ్యత లేని భోజనం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఖర్చుల వివరాల్లేవు.. సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు. రేకుల షెడ్డులో కిచెన్.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది. ఆహార పదార్థాలు సీజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్‌కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు. కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్‌కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు. త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు! అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్ టీజింగ్ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్ బాధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్‌కు.. అరగంటలోగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది. ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
Fact Check: అది రోత రాతల వంటకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్ శుక్రవారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. ►2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచారు. ►2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు. ►కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ►2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్ చేసింది. ►ఆ తర్వాత డైట్ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ► దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది. ►ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ►ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ఎల్ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్లు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ►ఈ సమయంలో డైట్ ఛార్జీల పెంపుదల ఫైల్ క్లియరెన్స్ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు. బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం. -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. ►అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేసిన అధికారులు. ►అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించిన అధికారులు. ►అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్న అధికారులు. ►డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామన్న అధికారులు. ►మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీలలో నాడు – నేడు కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►అంగన్వాడీల నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశం. ►మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్వాడీలలో ఉండాలన్న సీఎం. ►అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం. ►ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్ష ►మొత్తం మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం. ►హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ►హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదు. ►చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. ►వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. ►సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదు. ►హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్.. తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలి. ►భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలి. ►గురుకుల పాఠశాలలు– హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►మొదటి ఫేజ్‌లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు – నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశం. ►మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని అంచనా. ►తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశం ►హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని సీఎం ఆదేశం. ►కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్ కిచెన్ కోసం కొనుగోలు చేయాలని నిర్ణయం. ►హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని సీఎం ఆదేశం. ►పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం ఆదేశం. ►హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం. ►మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. ►హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని సీఎం ఆదేశం. ►ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీచేయాలన్న సీఎం. ►ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్. ►పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని ఆదేశం. ►ప్రతి హాస్టల్‌ను పరిశీలించి... కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్న సీఎం. ►హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ►అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ఈ సమావేశానికి మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఏ బాబు, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
హాస్టళ్లకు మహర్దశ.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను నిశితంగా పరిశీలించి.. పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటామో అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకు రావాలని చెప్పారు. నాడు–నేడు పథకం కింద ఏడాదిలోగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న దానిపై తాను స్వయంగా పరిశీలన చేయించానని, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘ఈ పనులు మావి’ అనుకుని పని చేయాలని కోరారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఇప్పటికే నాడు – నేడు కింద తొలి దశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. మొదటి దశలోని స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మించే పని జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోనందున, అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బావుండేలా దృష్టి పెట్టాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిపడా సిబ్బంది ఉండాలి.. ► స్కూళ్ల నిర్వహణ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ ఫండ్‌ను ఏర్పాటు చేయండి. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్.. ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. నెలకోసారి హాస్టల్‌ను సందర్శించాలి. ► విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా డైట్ చార్జీలను పెంచాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ చార్జీలను పెంచింది. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిలోగా హాస్టళ్లలో నాడు–నేడు పూర్తవ్వాలి ► అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వసతి గృహాలపై కూడా దృష్టి సారించాలి. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించండి. అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రతి పనిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలి. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలి. ► ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై సీఎం జగన్ సమీక్ష
-
పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం.. హాస్టళ్లలో వైద్యుల సందర్శన తప్పనిసరి అన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులపాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో విస్తృత సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో.. ► ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ► ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేపట్టాలి. ► స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కిందకు హాస్టళ్లు, గురుకులాలు ► గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన స్వయంగా నేనే చేయించాను. ► మనం చేయాల్సింది చాలా ఉంది. దీనిపై ఒక కార్యాచరణ ఉండాలి. ► ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలి. ► ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం. ► మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. ► సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి. ► దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి. ► అభివృద్ధి పనులు చేశాక.. వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి. దీనిమీద ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి... సీఎం జగన్ ► హాస్టళ్ల నిర్వహణకోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచండి. ► పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి: ► మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలి. ► పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ► స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయండి: ► ప్రతి హాస్టల్లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి : ► హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్ల వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి: ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. ► డైట్ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలను పెంచాలి. సమూలంగా డైట్ ఛార్జీలు పరిశీలించి.. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అలాంటిది కాదు అని సీఎం జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. హాస్టళ్లలో నాడు–నేడు అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం జగన్.. వాటి నిర్వహణను కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఇంకా.. ► వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం. ► మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ► ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ► అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలని.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించేలా ఉండాలని సీఎం జగన్, అధికారులతో చెప్పారు. ► ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్న సీఎం జగన్.. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్‌లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్‌పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్‌కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
రేషన్ బియ్యంలో పురుగులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో పురుగులు, బూజు ఉంటుండటంతో వాటిని తీసుకొని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచిత బియ్యం పనికిరానివిగా తయారయ్యాయి. దీంతో వండుకొని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు. నవంబర్ కోటా కింద మెజారిటీ చౌకధరల దుకాణాలకు నాసిరకం బియ్యం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు పేర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్ పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెల మయంగా మారింది. సంబందిత అదికారుల పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. డీలర్లతో లబ్ధిదారుల గొడవ ఉచిత పంపిణీ ప్రక్రియతో సన్న బియ్యం కాస్త దొడ్డుగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్టాకు ఉన్నంత వరకు రేన్ షాపులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా...అమలు మాత్రం మునాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు డీలర్లతో వాగ్వివాదానికి దిగడం సర్వసాధారణమైంది. సన్నబియ్యం అమ్ముకుని తమకు నాసిరకమైన దొడ్డుబియ్యాన్ని అంటగడుతున్నారని వాదనకు దిగుతున్నారు. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని మరికొందరు అక్కడే ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వసతి గృహాల్లో సైతం.. వసతిగృహాల విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే వండి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వసతి గృహాలు మూత పడి బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడినట్లు తెలుస్తోంది. తాజాగా వసతి గృహాలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. -
సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితులను సమూలంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఆ విధంగా మన సంక్షేమ హాస్టళ్లను మార్చాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడు అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ►నాడు–నేడులో భాగంగా హాస్టళ్లలో పూర్తి వసతులు కల్పిస్తాం. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత (శానిటేషన్), చక్కటి వాతావరణం, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలి. బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు కల్పించాలి. ►ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. మెనూ ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా ఉండాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం. కాబట్టి హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనేదానిపై ఆలోచన చేయాలి. దీనిపై మనం ఏది చెప్పినా, తప్పనిసరిగా అమలు చేయాలి. వీటన్నింటిపై పక్కాగా ప్రణాళిక రూపొందించి వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. (సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం) 4,472 హాస్టళ్లలో 4,84,862 మంది విద్యార్థులు ►రాష్ట్రంలో సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4,772 హాస్టళ్లు ఉండగా, 4,84,862 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల హాస్టళ్లు సొంత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేస్తామన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?) -
స్కిల్ @ హాస్టల్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు హాస్టళ్లంటే కేవలం విద్యార్థులకు వసతితో పాటు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పించేవనే మనకు తెలుసు. తాజాగా ఈ కేంద్రాల్లో వసతి పొందే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా కళాశాల వసతి గృహాల్లో (కాలేజీ హాస్టల్స్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీ తరగతులు పూర్తికాగానే సంక్షేమ వసతిగృహానికి చేరుకోవడం, కాలేజీల్లో జరిగిన పాఠశాలను పునశ్చరణ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం సబ్జెక్టుపరంగా వారికి కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇతర అంశాల్లో పరిజ్ఞానం మాత్రం అంతంతమాత్రం గానే ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇంగ్లిష్‌లో మాట్లాడేలా.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు కంప్యూటర్స్‌లో ప్రాథమికాంశాలపై (బేసిక్స్) అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించబోతోంది. హాస్టల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇంగ్లిష్ వాడకాన్ని వృద్ధిచేస్తే భాషపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో పాటు కొంతసేపు కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ తరగతుల బోధనకు క్షేత్రస్థాయిలో నిపుణులైన ట్యూటర్లను ఎంగేజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్స్ బేసిక్స్పైనా అవగాహన కల్పించి సర్టిఫికెట్ కూడా ఇచ్చేలా మరో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేయనుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్లను కొనుగోలు చేసింది. ఒక కంప్యూటర్‌పై పది మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేసేలా టైమ్షెడ్యూల్ను సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి రూపొందిస్తారు. త్వరలో నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగిరం చేశారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ... వచ్చే ఏడాది నుంచి అన్ని వసతిగృహాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
వంద మంది లేకుంటే.. మూసివేయడమే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను హేతుబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,850 వసతి గృహాలున్నాయి. వీటిలో వెయ్యికిపైగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విడతల వారీగా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంతో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈక్రమంలో పిల్లల సంఖ్య అధారంగా హేతుబద్ధీకరిస్తే.. మరింత మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమరి్పంచాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. నిర్వహణ భారం ఎక్కువవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో కనీసం వంద మంది పిల్లలుండాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలాచోట్ల ప్రీమె ట్రిక్ హాస్టళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 50 మంది వరకే ఉండటంతో నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో 50 కంటే తక్కువ మంది విద్యార్థులున్న హాస్టళ్లను మూసేయాలని.. అక్కడున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని ప్రాథమికంగా తేల్చారు. ఈ దిశగా హాస్టళ్ల వారీగా విద్యార్థుల వివరాలు.. తక్కువున్న హాస్టళ్లకు సమీపంలో ఉన్న వసతిగృహాలు.. ఇలా నిర్దేశించిన కేటగిరీలో సమాచారాన్ని సమర్పించాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. ఈ క్రమంలో అధి కారులు వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఈ నెలాఖరు లోగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
బకాయిలు రూ.6 కోట్లు?
సాక్షి, కరీంనగర్ : సంక్షేమ హాస్టళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. నెలనెలా రావాల్సిన మెస్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలకుమించిన భారంగా మారింది. హాస్టళ్లల్లో చదివే పిల్లల భోజనం, ఇతర సదుపాయాలకు నిధుల కొరత ఏర్పడింది. పేద విద్యార్థులకు అన్నం పెట్టేందుకు ఇచ్చే డైట్ చార్జీలు ఏడు నెలలుగా అందడంలేదు. దీంతో వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దివాలా తీస్తున్నారు. బిల్లులు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక హాస్టళ్లను నడుపలేమని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సరుకుల సరఫరా చేయలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లల్లోని విద్యార్థులకు భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో బీసీ, ఎస్సీ కలిపి సంక్షేమ హాస్టళ్లు 51 ఉన్నాయి. ఇందులో పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 20 ఉండగా ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులు 2,438 మంది వసతి పొందుతున్నారు. అలాగే 31 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉండగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద విద్యార్థులు 2,720 మంది వరకు వసతి పొందుతున్నారు. పోస్టుమెట్రిక్ హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,200 నుంచి రూ.1,500 వరకు ప్రతినెలా డైట్ చార్జీలు ఇవ్వాల్సి ఉంది. ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తరగతిని బట్టి రూ.750 నుంచి రూ.1,100 వరకు ఒక్కొక్కరికీ ప్రతినెలా ఇవ్వాలి. హాస్టళ్లకు ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. నూనెలు, ఉప్పు, కారం, చింతపండు మొద లగు సరుకులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుండగా, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్, ఇత ర వస్తువులు హాస్టల్ వార్డెన్లు భరించాలి. ఖర్చు చేసిన వాటికి వార్డెన్లు బిల్లులు చూపితే ప్రతి నెలా మంజూరీ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కోట్లల్లో బకాయిలు... బీసీ, ఎస్సీ, పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్లకు ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు రావడం లేదు. ఆలస్యమైన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అని వార్డెన్లు స్థోమత లేకున్నా బయట అప్పులు చేసి మరి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్ల బకాయిలు దాదాపు జిల్లాలో రూ.6 కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ప్రీమెట్రిక్ హాస్టళ్ల కన్నా పోస్టుమెట్రిక్ హాస్టళ్ల వార్డెన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును ముందుగానే 80 శాతం భరించాల్సి ఉంటుంది. బిల్లులు గత ఏడు నెలలుగా నిలిచిపోవడంతో ఒక పోస్టుమెట్రిక్ హాస్టల్ వార్డెన్‌కు రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు రావాల్సి ఉంది. గుడ్లు, పాలు, చికెన్, కూరగాయల వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. బకాయి డబ్బులు చెల్లిస్తే కానీ సరుకులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో మరోచోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చి మళ్లీ అప్పు చేసి సరుకులు, కూరగాయలు కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో హాస్టళ్ల నిర్వహణ వారి కుటుంబాల పోషణకు తలకుమించిన భారంగా మారిందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని కాస్మోటిక్ చార్జీలు... బీసీ, ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లల్లో చదువుతున్న పాఠశాలస్థాయి పేద విద్యార్థులకు నెలనెలా కాస్మోటిక్, హేయిర్ కటింగ్, నాప్కిన్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాలి. అబ్బాయిలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 మొత్తం రూ.62 ఇవ్వాల్సి ఉంది. ప్రైమరీస్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీలు రూ. 55, హైస్కూల్ విద్యార్థినీలకు నాప్కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. అయితే ఈ కాస్మోటిక్ చార్జీలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవచ్చనే దృక్పథంతో కటింగ్ చార్జీలు, సబ్బులు, నూనెలకు వార్డెన్లు వారి జేబుల నుంచి ఇస్తున్నారు. ఇలా వార్డెన్ల జేబులు ఖాళీ అవుతున్నాయే తప్ప బిల్లులు రావడం లేదు. ఫ్రీజింగ్ ఉండటంతో.. ఏడు నెలలుగా మెస్‌చార్జీలు, ఇతరత్రా నిధులు రావాల్సి ఉంది. మధ్యలో రెండుసార్లు నిధులు వచ్చాయి. ఫ్రీజింగ్లో ఉండటం వల్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే వార్డెన్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – బాలసురేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి -
వేలిముద్ర పడదే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచి్చన బయోమెట్రిక్ హాజరు నమోదు విధానం క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులకు తలనొప్పిగా మారింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతిని వినియోగిస్తున్న నేపథ్యంలో హాజరుస్వీకరణ గందరగోళంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు. దీంతో హాస్టల్లో ఉంటున్నప్పటికీ గైర్హాజరైనట్లే నమోదవుతోంది. ఈ పరిస్థితి హాస్టల్ డైట్ బిల్లుల రూపకల్పనలతో వసతిగృహ సంక్షేమాధికారులకు చిక్కులు తెచి్చపెడుతున్నాయి. ప్రతి విద్యా సంస్థలో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వవిభాగాలు, క్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖతో పాటు బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్రయోగ పద్ధతిని కొనసాగిస్తున్నారు. అప్డేట్ కాకపోవడంతో... ఆధార్ వివరాలను ప్రతి కార్డుదారు ఐదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా వేలిముద్రల్లో వచ్చే మార్పులను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల్లో వేలిముద్రలు మారడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ చాలావరకు కార్డు తీసుకున్న సమయంలో తప్ప వివరాలను అప్డేట్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానానికి విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడానికి ఇదే కారణం. ఆయా విద్యార్థులు తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకుంటే తప్ప బయోమెట్రిక్ హాజరు నమోదుకు అవకాశం లేదు. హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నప్పటికీ వారి హాజరు నమోదు కాకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన క్రమంలో విద్యార్థుల హాజరు ఆధారంగా డైట్ బిల్లులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కాకపోవడంతో వారు వసతిపొందుతున్నా, రికార్డుల ప్రకారం గైర్హాజరు చూపడంతో వారికి సంబంధించిన బిల్లులు విడుదల కావు. ప్రభుత్వం మాన్యువల్ పద్ధతి బిల్లులను అనుమతించకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులు తలపట్టుకుంటున్నారు. -
విద్యార్థులు చస్తున్నా పట్టించుకోరా..?!
లక్సెట్టిపేట(మంచిర్యాల) : వసతిగృహాల్లో విద్యార్థులు మరణిస్తున్నా... తీవ్ర విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తూ ఇళ్ళకు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఉన్నత అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకుండా పోయింది. అపరిశుభ్రంగా గదులు, బాత్రూంలు, టాయిలెట్లు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నాయి. జిల్లా మొత్తంగా రెగ్యూలర్ వార్డెన్లు, హెడ్మాస్టర్లు లేక ఇన్చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి. అధికారులు పట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్బందుల్లో విద్యార్థులు జిల్లాలో మొత్తంగా 10 బాలుర, 6 బాలికల ఆశ్రమ పాఠశాలులున్నాయి. ఇందుకు ఆరుగురు రెగ్యూలర్ వార్డెన్లు, 10 మంది ఇన్చార్జి వార్డెన్లు ఉండగా ముగ్గురు రెగ్యూలర్, 13మంది ఇన్చార్జి హెడ్మాస్టర్లు ఉన్నారు. ఎటీడబ్లూవో ప్రతి నెలకు రెండుసార్లు పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు రుచికరమైన భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలి. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు విద్యార్థులు అన్ని విధాలా చికిత్సలు అందించాలి. ఇటీవల స్థానిక పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివశంకర్ ఆకస్మత్తుగా మృతిచెందడంతో మిగతా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పలువురు విద్యార్థులు వ్యాధులతో ఇళ్ళలోకి వెళ్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పరిశుభ్రత పాటించకుండా వ్యాధులపై అవగాహన కల్పించకుండా హెల్త్ క్యాంపులు చేపట్టకుండా కాలం వెల్లదీస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. అధ్వానంగా పట్టణ పాఠశాల మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటారు. మొత్తంగా 141మంది విద్యార్థులకు నలుగురు వెళ్లిపోగా ప్రస్తుతం 137మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది. సీజనల్ వ్యాధులు రావడంతో 105 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉండగా మిగతా వారు ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ చెప్పారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, డార్మిటరీ గదులు ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విద్యార్థి శివశంకర్ మృతిచెందడంతో పాఠశాల వార్డెన్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసి హెడ్మాస్టర్ రవీందర్‌కు బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించడంతో ప్రస్తుతం విద్యార్థులను పరిశీలించేందుకు ఏఎన్ఎం లేదు. రాత్రివేళ అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బంది పడాల్సిందే. 6వ తరగది విద్యార్థి చరణ్ పాఠశాల నచ్చడం లేదంటు పారిపోయి దినమంతా ఒంటరిగా తిరిగి రాత్రివేళ ఇంటికి చేరడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల విద్యార్థి ఉదయం వెళ్లిపోయిన సిబ్బందికి తెలియకపోవడం శోచనీయం. తదుపరి ఉదయం పాఠశాలకు వచ్చి పాఠశాల నచ్చడం లేదంటూ టీసీ తీసుకునివెళ్లిపోయాడు. విద్యార్థులకు జ్వరాలు వచ్చిన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సంక్షేమం’లో స్వాహా పర్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్షేమ హాస్టళ్ల మాటున గత పాలకులు, అధికారులు దోచుకుతిన్నారు. అదే అధికారులు ఇప్పటికీ అడ్డంగా దిగమింగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచామని గత ప్రభుత్వం చెబుతూ బినామీ టెండర్లతో దోపిడీకి దారులు తెరిచింది. చిత్తూరు జిల్లాకు చెందిన బినామీ కాంట్రాక్టరు ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించి అవినీతి బాగోతానికి తెరలేపారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లాది రూపాయలు బొక్కేశారు. 40 శాతం అధిక ధరలకు టెండర్లు ఖరారు... రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు వేరుశనగ అచ్చులు (మిల్లెట్స్ కేకులు) సరఫరా చేయడానికి కిలోకు రూ. 80లు అదనంగా కోట్ చేస్తూ గత ప్రభుత్వ పెద్దల బినామీ దారులు టెండర్లు వేశారు. అన్ని సరుకులకు 40 శాతం అధిక ధరలకు టెండర్లు ఆమోదించారు. సరుకును విశాఖపటా్ననికి చెందిన నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ నుంచి కొనుగోలు చేసేవారు. నాసిరకం సరుకుల సరఫరా... టెండరు నిబంధన మేరకు మొదటి రకం సరుకులు సరఫరా చేయకుండా నాసిరకం సరుకులు సరఫరా చేసి కాంట్రాక్టు సంస్థ బాగా దండుకుంది. పాఠశాలలతో ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ద్వారా చెల్లింపులు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాఠశాల స్థాయిలో అయితే ప్రిన్సిపాళ్లు సరుకు నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తారని, అందు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన కాంట్రాక్టు సంస్థ, ఉన్నతాధికారులు తెలివిగా ఈ విధానాన్ని అమలు చేశారు. జాయింట్ సెక్రటరీ ద్వారా చక్కబెట్టేశారు... టెండరుదారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఆరుగొలనుకు చెందిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించే రాజారావుకు రాష్ట్రస్థాయిలో జాయింట్ సెక్రటరీగా దొడ్డిదారిలో ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ఈ తతంగానికి తెరలేపారు. అంతే కాకుండా కంప్యూటర్లు, సీసీ కెమెరాలకు బిల్లులు చెల్లింపు చేసి గురుకులాల పేరుతో దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రాజారావు ప్రిన్సిపాల్ బాధ్యతలు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ రాష్ట్రస్థాయి ఇన్చార్జిగా పనులు అప్పగించారు. అన్నింటా అవినీతే... గురుకుల పాఠశాల కేటరింగ్ టెండరుదారుడు ఎనిమిది మందితో పనులు చేయించాల్సి ఉండగా నలుగురు, లేక ఐదుగురిచే పనిచేయించి వారికి తక్కువగా జీతాలు ఇస్తూ మిగులు సొమ్ములు దోపిడీ చేస్తున్నారు. పై సంస్థలలో స్కావెంజర్, స్వీపర్, కాపలాదారుడు ఇలా ప్రతి మనిషికి పది వేల రూపాయలు చెల్లించాలి. కాని వారికి ఏడు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. ఎక్కువ మంది చేయాల్సిన పని తక్కువ మందితో చేయించడంతో వండిన పదార్థాల్లో నాణ్యత లోపించేది. రాష్ట్ర వ్యాప్తంగా రు.6 కోట్లు అవినీతి జరిగినా పట్టించుకునే నాధుడే లేడు. గత ప్రభుత్వం అవినీతికి అండగా నిలిచింది. సరుకు వివరాలు టెండరు రేటు మార్కెట్ రేటు వేరుశెనగ అచ్చు రూ.162.50 రూ. 37.00 పామాయిల్ రూ. 90.00 రూ.61.00 చింతపండు రూ. 95.00 రూ. 50.00 గోధుమ రవ్వ రూ. 44.00 రూ. 27.00 వేరుశెనగగుళ్ళు రూ. 128.00 రూ. 100.00 కారం రూ. 285.00 రూ. 145.00 -
మరీ ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం) : హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి విస్తుపోయారు.. విద్యార్థుల దురవస్థను చూసి చలించిపోయారు.. మాజీ మంత్రి, టెక్క లి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జమానాలోని బీసీ బాలుర వసతి గృహం లోని దయనీయ స్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. శుక్రవారం రాత్రి నిమ్మాడ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ధ ర్మాన కృష్ణదాస్ ఓ విద్యార్థి తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న విషయాన్ని గ మనించి, వైద్య సిబ్బందిని వసతి గృ హా నికి రప్పించి విద్యార్థికి వైద్య సాయం అం దే విధంగా చర్యలు చేపట్టారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్‌తోపాటు సిబ్బంది ఎవరూ హాస్టల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అక్కడ అందుబాటులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాణి నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. హాస్టల్లో 98 విద్యార్ధులుండగా శుక్రవారం వారిలో 78 మంది ఉ న్నారు. వారిలో ధనుంజయరావు అనే వి ద్యార్ధికి తీవ్ర అస్వస్థత నెలకొనడంతో వై ద్యసేవలందించారు. మెనూ అమలు, కా స్మొటిక్స్ సొమ్ముల గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు స్వంత గ్రామంలో హాస్టల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉండడాన్ని ధర్మాన ఆక్షేపిం చారు. హాస్టల్లో మురుగు వ్యవస్థ , మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంపై మంత్రి విస్తుపోయారు. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిస్తాం నరసన్నపేట: వసతి గృహాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వార్డెన్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అద్దె భవనంలో వసతిగృహం నిర్వహిస్తున్నామని, శాశ్వత భవనం కావాలని వసతిగృహ అధికారులు మంత్రికి తెలిపారు. తాగేందుకు మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారం కావాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో భోజన సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేట్రిన్లు చూడాలని, చేతివాటం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. -
తేడాలేంటో తేల్చేద్దాం...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో మరింత పారదర్శకత కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానంపై సంక్షేమ శాఖలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని అధికారులు భావించినప్పటికీ... గతంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు తీరుతో పాటు గతంలో నమోదైన హాజరు విధానంపైన విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బయోమెట్రిక్ హాజరు విశ్లేషణ కోసం వసతిగృహ సంక్షేమాధికారులకు అవగాహన కల్పించనుంది. మూడు రోజుల పాటు శిక్షణను నిర్వహించి 2019–20 విద్యా సంవత్సరంలో నమోదయ్యే రికార్డును... 2018–19 సంవత్సరంతో పాటు 2017–18 విద్యా సంవత్సరంలో నమోదైన రికార్డును సరిపోలుస్తూ విశ్లేషణ చేపట్టనుంది. వసతిగృహం వారీగా అధ్యయనం..: రాష్ట్రవ్యాప్తంగా 674 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 50వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బయోమెట్రిక్ హాజరు విశ్లేషణతో విద్యార్థుల హాజరు తీరెలా ఉందనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో వసతిగృహాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రస్తుత హాజరు, గతంలో నమోదైన హాజరును సరిపోలుస్తారు. దీంతో హాజరులో వ్యత్యాసం స్పష్టం కానుంది. వరుసగా ఏడాది పాటు హాజరు శాతాన్ని పరిశీలిస్తే గతంలో హాజరు శాతాల వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దీంతో అక్రమాలపై స్పష్టత వస్తే సదరు అధికారిపై చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది.