ఏ అధికారంతో ఈ తనిఖీలు? | With no power, the checks? | Sakshi
Sakshi News home page

ఏ అధికారంతో ఈ తనిఖీలు?

Published Mon, Feb 27 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

ఏ అధికారంతో ఈ తనిఖీలు?

ఏ అధికారంతో ఈ తనిఖీలు?

హాస్టళ్లలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ హంగామా
తమను కలవాలంటూ వార్డెన్లపై ఒత్తిళ్లు
‘చినబాబు’ చెప్పాడంటూ జులుం


విశాఖపట్నం: సంక్షేమ హాస్టళ్లపై తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) నేతలు జులుం చెలాయిస్తున్నారు. లేని అధికారాలను అందిపుచ్చు కుని ఏకంగా తనిఖీలకే తెగబడుతున్నారు. చినబాబు (సీఎం తనయుడు లోకేష్‌) పేరు చెప్పి నానా హంగామా చేస్తున్నారు. వీరంతా ‘చంద్రన్న సంక్షేమ వసతి గృహాల సముద్ధరణ’ పేరుతో హాస్టళ్లకు వెళుతున్నారు. జిల్లాలో పలు బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లపై పడుతున్నారు. అక్కడ హాస్టల్‌ వార్డెన్లకు దడ పుట్టిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకుని తనకు నివేదించాలంటూ లోకేష్‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ శ్రేణులను ఆదేశించినట్టు వారు చెబుతున్నారు. దీంతో 26 మంది సభ్యులు గల వీరు జిల్లాలో నాలుగైదు బృందాలుగా ఏర్పడి హాస్టళ్లకు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలంటూ రహస్యంగా వెళ్లి హడావుడి చేస్తున్నారు. తాము వసతి గృహాలు ఎలా ఉన్నాయో పరిశీలించి లోకేష్‌తో పాటు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని, అందుకే వచ్చామని చెబుతుండడంతో వార్డెన్లు బెంబేలెత్తిపోతున్నారు.

ఆయా హాస్టళ్లలో పరిశుభ్రత, ఆహారం, మెనూ, మరుగుదొడ్లు తదితర సమస్యలపై వీరు ఆరా తీస్తున్నారు. పిల్లలకు పెట్టే ఆహారాన్ని వీరు రుచి చూస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి పూట వారితో సహపంక్తి భోజనాలు చేసి అక్కడే బస చేస్తున్నారు. వారితో ఫొటోలు కూడా దిగుతున్నారు. హాస్టళ్లలో సమస్యలపై ఫొటోలు తీస్తున్నారు. ఆయా హాస్టళ్లలో ఏవో లోపాలుండడం వల్ల వీరు తమ గురించి ఎలాంటి నివేదికలు ఇస్తారోనని వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి ‘ఘన స్వాగతం’ పలుకుతూ ప్రత్యేక అతిథులుగా రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారు. మరోవైపు కొంతమంది హాస్టళ్లకు తాము తనిఖీలకు వస్తున్నట్టు  ముందస్తుగా సమాచారాన్ని లీక్‌ చేస్తున్నారు. దీంతో ఆయా వార్డెన్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడమేగాక ఆ రోజు విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. విద్యార్థులను సమస్యలు చెప్పవద్దని కోరుతున్నారు.

వార్డెన్లకు హుకుంలు..
ఎక్కడైనా వీరు తనిఖీలకు వెళ్లినప్పుడు సంబంధిత వసతి గృహం వార్డెన్‌ అందుబాటులో లేనిపక్షంలో ఉన్నతాధికారులకంటే గట్టిగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ వార్డెన్‌కు ఫోన్‌ చేసి తమను కలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులైతే హాస్టల్‌ పిల్లల వద్దకు వెళ్లి వారిని పొంతనలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం కాలేజీ హాస్టల్‌లో ఎంపీసీ విద్యార్థుల వద్దకు వెళ్లి మీరు భవిష్యత్‌లో ఏమి కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఇంజినీర్లు కావాలనుకుంటున్నామని చెప్పగా, డాక్టర్లు ఎందుకు కావాలనుకోవడం లేదని ప్రశ్నించేసరికి ఆ విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిని బట్టి వీరికి ఎలాంటి అవగాహన ఉందో స్పష్టమవుతోంది.

జిల్లాలోని మరోక హాస్టల్‌కు వెళ్లిన బృంద సభ్యులు తనిఖీ చేసి వచ్చారు. ఆ సమయంలో వార్డెన్‌ లేకపోవడంతో బృందంలోని ఒక సభ్యుడు తరచూ తనను కలవాలంటూ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేస్తున్నాడు. లేనిపక్షంలో మీ గురించి సీఎంకు, లోకేష్‌కు నివేదిక పంపిస్తామని బెదిరిస్తున్నాడు. ఇలా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల్లో కొందరు అదుపు తప్పి నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటిదాకా తాము జిల్లా, నగరంలోని 25 హాస్టళ్లను తనిఖీ చేసినట్టు ఈ బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి చెప్పాడు. ఈ హాస్టళ్లలోని పరిస్థితులను కొద్దిరోజుల్లోనే సీఎంతో పాటు లోకేష్‌కు నివేదిస్తామని వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement