కోవెలకుంట్ల బీసీ వసతి గృహం
కోవెలకుంట్ల: సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో కూరుకుపోయాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల తాయిలాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. దీంతో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ, ఎస్సీ కళాశాలల హాస్టళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగు నెలల నుంచి హాస్టళ్లకు ఎలాంటి బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి వసతి గృహాల అధికారులు, సిబ్బంది అప్పులు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలలతోపాటు హాస్టళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. జిల్లాలో 52 బీసీ వసతి గృహాలు, 51 ఎస్సీ హాస్టళ్లు, 15 రెసిడెన్షియల్ పాఠశాలలు, 21 ఎస్సీ, 28 బీసీ కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఉంటూ విద్యనభ్యసించే పేద విద్యార్థులకు గత ఏడాది జూలై నెల నుంచి కొత్త మెనూ ప్రకారం వారంలో మంగళ, శుక్ర, ఆదివారం చికెన్‌తో కూడిన ఆహారం అందజేశారు. ఉదయం విద్యార్థులకు అందజేసే రాగి మాల్ట్‌ను సాయంత్రానికి మార్చి ఆ స్థానంలో పా లు సరఫరా చేశారు. జనవరి నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీల బిల్లులు నిలిచిపోవడంతో వసతి గృహాల అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఖజనా ఖాళీతో అందని బిల్లులు..
సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొత్త మెనూ ఆధారంగా ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. గతంలో 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750 ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 1050, 5వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 850 నుంచి రూ. 1250, కళాశాల హాస్టళ్ల విద్యార్థులకు రూ. 1050 నుంచి రూ. 1400లకు డైట్ చార్జీలు పెంచారు. ఈ మొత్తంతో విద్యార్థులకు చికెన్, పాలు, భోజనానికి సరిపడు నిత్యావసరాలు వెచ్చిస్తున్నారు. హాస్టళ్లలో వారంలో మూడు రోజులపాటు ఒక్కో విద్యార్థికి 80 గ్రాముల చికెన్, 100 ఎంఎల్ పాలు అందజేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో డైట్ చార్జీల బిల్లులను సంబంధిత హాస్టల్ వెల్పేర్ అధికారులు మ్యానువల్ పద్ధతిలో ట్రెజరికి పంపితే అక్కడ బిల్లు పాసై వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ ఏడాదిని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది వేతనాలతోపాటు డైట్ చార్జీలను సీఎఫ్‌ఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పసుపు– కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో ఖజనాలో ఉన్న నిధులను ఖాళీ చేయడంతో నాలుగు నెలల నుంచి బిల్లులు నిలిచిపోయాయి.
అప్పులు చేసి విద్యార్థులకు భోజనం
నాలుగు నెలల నుంచి సంక్షేమ వసతి గృహాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో ఆయా వసతిగృహాల అధికారులు అప్పులు చేసి హాస్టళ్లను ¯ð నెట్టుకొచ్చారు. వారంలో మూడు రోజులపాటు చికెన్‌తో కూడిన భోజనం, పాలు సరఫరా చేయాల్సి ఉండగా నాలుగు నెలల పాటు అప్పు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెట్టాల్సి వచ్చింది. డైట్ చార్జీలతోపాటు గత ఏడాది నవంబర్ నెల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందకపోవడం గమనార్హం. విద్యార్థులకు సబ్బు, నూనెకు సంబంధించి 6వ తరగతి వరకు నెలకు రూ. 130, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 155 ప్రకారం కాస్మొటిక్ చార్జీలను అందజేయాల్సి ఉంది. అయితే ఆరు నెలల కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించి ఆదుకోవాలని ఆయా వసతిగృహాల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు కోరుతున్నారు.
బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాం
సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ఈ ఏడాది జనవరి నెల నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీలు విడుదల కావాల్సి ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగింపు, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో బిల్లులు నిలిచిపోయాయి. బిల్లుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. వీలైనంత త్వరలో బిల్లులు విడుదల అవుతాయి. సత్యనారాయణ,ఏఎస్‌డబ్లు్యఓ, కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment