bills pending
-
రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్లుగా గవర్నర్ తనవద్దనే నిలిపి ఉంచడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషమాన్ని పరిశీలించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రెండు సంవత్సరాలుగా బిల్లును ఎందుకు తొక్కిపెట్టారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులను గత రెండేళ్లుగా గవర్నర్ ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించింది. అంతకుముందు గవర్నర్ కార్యాలయం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. మొతం 8 బిల్లుల్లో ఏడింటిని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌లో ఉంచారని, మరో బిల్లుకు గవర్నర్ మహమ్మద్ ఖాన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నోట్ చేసుకున్న సీజేఐ.. గత రెండేళ్లుగా బిల్లులను గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ బదులిస్తూ.. అనే సందేహాలను లేవనెత్తే ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోలేదని తెలిపారు. అయితే ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ అయిన తమకు ఆ వివరాలు అవసరమనని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఎప్పుడూ పంపించాలనే విషయంలోనూ మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోరారు. చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. రాష్ట్రంలో పాలనను నిలిపివేసేలా గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడాన్ని అనుమతించకూడదని తెలిపారు. అసెంబ్లీతో కలిసి పని చేయకుండా గవర్నర్ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గడువులోగా ఆమోదం తెలిపేందుకు లేదా తిరస్కరించేందుకు రాష్ట్ర గవర్నర్లకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను సవరించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. విచారణను ఇక్కడితో ముగిద్దామనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇదో సజీవ సమస్యగా పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్‌కు పలు కీలక సూచనలు చేసింది. బిల్లుపై సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్, సంబంధిత మంత్రితో గవర్నర్ చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలా జరగని పక్షంలో రాజ్యాంగం అప్పగించిన విధులను నిర్వర్తించడానికి చట్టబద్దమైన విధానాల ఖరారుకు తాము సిద్దంగా ఉంటామని పేర్కొంది. -
బిల్లులను అడ్డుకొనే స్వేచ్ఛ గవర్నర్లకు లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్ల తీరుపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికారాన్ని దురి్వనియోగం చేయవద్దని గవర్నర్లకు సూచించింది. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో కొనసాగించడం తగదని తేలి్చచెప్పింది. అలాంటి స్వేచ్ఛ గవర్నర్లకు లేదని స్పష్టం చేసింది. ప్రజల చేత ఎన్నిక కాని గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ రాష్ట్రాల శాసనసభల్లో చట్టాలు చేసే ప్రక్రియను అడ్డుకోవడానికి ఆ అధికారాలను ఉపయోగించుకోవద్దని హితవు పలికింది. ఇలాంటి చర్యలు ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేల అధికారాన్ని తగ్గంచేలా ఉంటాయని తేలి్చచెప్పింది. అసెంబ్లీలో తీర్మానించిన నాలుగు కీలక బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 10న 27 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్ర అధిపతి మాత్రమేనని ఉద్ఘాటించింది. ఈ ఏడాది జూన్ 19, 20వ తేదీల్లో పంజాబ్ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
మరో రెండు నెలలు నిరీక్షణే...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల్లో బిల్లుల క్లియరెన్స్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలకు కొంతకాలం బ్రేక్ పడనున్నట్లు అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం నుంచి చెల్లింపులకు రెండు, మూడు త్రైమాసికాలు అత్యంత కీలకం. తొలి త్రైమాసికంగా బడ్జెట్ సర్దుబాట్లు, ఇతరాత్రా కారణాలతో చెల్లింపుల ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆ తర్వాత నుంచి నిధుల లభ్యత, ప్రాధాన్యతలకు అనుగుణంగా చెల్లింపుల్లో వేగం పుంజుకుంటుంది. కానీ ఈసారి సంక్షేమ శాఖలకు రెండో త్రైమాసికంలో నిధులు విడుదల కాలేదు. పలు రకాల చెల్లింపులు నిలిచిపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు భారీగా పేరుకుపోయాయి. సంక్షేమ శాఖలు ఆమోదించి ఖజానా విభాగానికి పంపించినప్పటికీ అక్కడ క్లియరెన్స్ రాని బిల్లులు దాదాపు రూ.1,175 కోట్లు ఉన్నాయి. ఇవిగాకుండా సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన డైట్ చార్జీలు మరో రూ.675 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రూ.1,850 కోట్లు ఖజానా విభాగంలో పెండింగ్‌లో ఉండగా... ఇవి రెండో త్రైమాసికంలో వస్తాయని అధికారులు భావించారు. చివరి నిమిషం వరకు సంక్షేమాధికారులు వేచిచూసినప్పటికే నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మూడో త్రైమాసికంలోనైనా ఈ నిధులకు మోక్షం కలుగుతుందని భావించినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో వాటి విడుదలలో జాప్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. చివరి క్వార్టర్‌పైనే ఆశలు... విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల కింద దాదాపు 12.65లక్షల మంది లబ్ధిదారులుంటారు. వీరితో పాటు మరో 10 లక్షల మంది గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్నారు. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఎంతో కీలకం. కోర్సును ముందుకు సాగించాలన్నా... వసతిగృహంలో ఉండాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే దిక్కు. కొంతకాలంగా ఈ రెండు పథకాలకు, డైట్ చార్జీల విడుదలలోనూ జాప్యం చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి నుంచి గురుకులాలు, వసతిగృహాలు, సంక్షేమ అధికారుల ద్వారా ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖజానా విభాగంలో నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉపకారవేతన నిధుల విడుదల నిలిచిపోయింది. ఇవన్నీ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించినవే. ఇవిగాకుండా 2022–23 విద్యా సంవత్సరం దరఖాస్తు పరిశీలన. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లులు రూపొందించి ఆమోదించిన బిల్లులకు గత రెండు త్రైమాసికాల్లో రిక్తహస్తం చూపిస ప్రభుత్వం మూడో త్రైమాసికంలోనైనా నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత... చివరి త్రైమాసికంలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
గవర్నర్‌ను మీరెందుకు గట్టిగా అడగరు?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టుకోరాదని గవర్నర్‌ను మీరెందుకు గట్టిగా అడగరని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. గవర్నర్ బిల్లులపై అభిప్రాయం పెండింగ్‌లో పెట్టడం వల్ల రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలా ధర్మాసనం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ మధ్యప్రదేశ్‌లో బిల్లుకు వారంలో ఆమోదం వస్తుందని, గుజరాత్లో నెల రోజులు దాటదని, కానీ తెలంగాణలో ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. దీనిపై సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకొని గవర్నర్ ఇలా చేయడానికి కారణాలేంటో తెలుసుకొని తగిన సూచనలు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 10న విచారిస్తామని కోర్టు పేర్కొంది. -
45 రోజుల్లో రూ.1,550 కోట్లు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) షాక్ ఇచి్చంది. సౌర విద్యుత్ విక్రేత కంపెనీలకు రూ. 1,550 కోట్లకుపైగా బకాయిలను 45 రోజుల్లో చెల్లించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/టీఎస్‌ఎనీ్పడీసీఎల్)లను వేర్వేరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇప్పటివరకు బకాయిపడిన మొత్తం బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కంపెనీలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం ఇకపై ఎప్పటికప్పుడు వాటికి చెల్లింపులు జరపాలని ఆదేశించింది. నెలలు, ఏళ్లు గడుస్తున్నా డిస్కంలు బిల్లులు చెల్లించకపోవడంతో పలు కంపెనీలు ఈఆర్సీని ఆశ్రయించి తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలతో ఏకీభవించిన ఈఆర్సీ.. ఆయా కంపెనీలకు 45 రోజుల్లోగా మొత్తం బకాయిలను అపరాధ రుసుం (లేట్ పేమెంట్ సర్‌చార్జీ)తో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేవాంగరే షుగర్ కంపెనీ కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్రి్టసిటీ (ఏపీటెల్) 2009లో జారీ చేసిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకుంది. సకాలంలో బకాయిలను చెల్లించకపోవడం పీపీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలను చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా అరుదని డిస్కంల అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొండలా పెరిగిపోయిన బకాయిలు... రాష్ట్ర డిస్కంలు దాదాపుగా 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సౌర విద్యుత్ కేంద్రాల డెవలపర్లతో గత ఐదారేళ్ల కింద ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలు సౌర విద్యుత్ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతున్నాయి. రెండు, మూడేళ్ల నాటి బిల్లులను సైతం కొన్ని కంపెనీలకు బకాయిపడటంతో వాటిపై అపరాద రుసుం భారీగా పెరిగిపోతోంది. అసలు బిల్లులు, అపరాద రుసుములు కలిపి మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోవడంతో డిస్కంలు సతమతమవుతున్నాయి. బకాయిల కోసం పలు సౌర విద్యుత్ కంపెనీలు కేంద్ర విద్యుత్ శాఖకు ఫిర్యాదు సైతం చేశాయి. ఈ నేపథ్యంలోనే పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రం విద్యుత్ కొనుగోళ్లు జరపకుండా కేంద్రం ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంపై నిషేధం విధించింది. తాజాగా ఈఆర్సీ సైతం 45 రోజుల్లోగా మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని ఆదేశించడం గమనార్హం. చదవండి: వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు? -
అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి
మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం) ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్‌లో ఐదు బిల్లులు.. గవర్నర్ కరుణించేనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర కోసం రాజ్‌భవన్‌లో ఐదు బిల్లులు ఎదురుచూస్తున్నాయి. గవర్నర్ కరుణ కోసం ప్రభుత్వ పెద్దలు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 2011 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఉప్పు, నిప్పులా సాగే ఈ రెండు పార్టీలు ఒకరి తరువాత మరొకరు అధికారంలోకి వచ్చినపుడు గత ప్రభుత్వం చేసిన చట్టాలను, పథకాలను సవరించడం లేదా ఎత్తివేయడం రాష్ట్రంలో పరిపాటి. ఇదే కోవలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం అదేపనికి పూనుకుంది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలనే డిమాండ్ మినహా గత ప్రభుత్వ విధానాలను దాదాపుగా అన్నింటినీ పునఃపరిశీలిస్తోంది. అసెంబ్లీలో ముసాయిదాలు ప్రవేశపెట్టడం, అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసి చర్చలు జరపడం, తరువాత గవర్నర్ ఆమోదానికి పంపడం రాజ్యాంగపరమైన ఆనవాయితీ. గవర్నర్ అంగీకారం తెలిపితేగాని బిల్లులు, పథకాలు అమల్లోకి రావు. డీఎంకే ప్రభుత్వం పలు ముసాయిదాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని రాజ్‌భవన్‌కు పంపింది. వీటిల్లో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని రాజ్‌భవన్ ఢిల్లీకి పంపింది. పెండింగ్‌లో ఐదు బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు రాజ్‌భవన్ పెండింగ్‌లో పెట్టేసింది. రిజిస్ట్రేషన్ చట్టం–2021లో మూడు సవరణలను తీసుకొస్తూ గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన అసెంబ్లీలో ముసాయిదా ఆమోదించి గవర్నర్‌కు పంపారు. భారతియార్ యూనివర్సిటీ సవరణ ముసాయిదాను గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన అసెంబ్లీ ఆమోదించింది. సహకార సంఘాల చట్టంలో రెండో సవరణను ఈ ఏడాది జనవరి 8వ తేదీన ఆమోదించారు. ‘నీట్’ ముసాయిదా ప్రత్యేకం అన్నిటికంటే వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్రం ప్రవేశపెట్టిన నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలనే డిమాండ్‌పై అసెంబ్లీలో జరిగిన ఏకగ్రీవ తీర్మానం అత్యంత ప్రధానమైంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఒకసారి తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం సైతం గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. అయితే ఆ తరువాత వచ్చిన కొత్త గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకుండా వెనక్కుపంపారు. మరిన్ని సవరణలతో మరోతీర్మానం చేసి పంపాలని ఆదేశించారు. ఈ చర్య రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. ఆ తరువాత గతనెల 9వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మరోసారి అదే తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అయినా ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపలేదు. దీంతో సీఎం స్టాలి న్ ఇటీవల గవర్నర్‌ను కలిసి నీట్ తీర్మానం ఆమోదం గురించి వత్తిడిచేశారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన నాలుగింటి మాటెలా ఉన్నా నీట్ బిల్లుపై మాత్రం ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రాజ్యాంగం ప్రకారం రెండోసారి వెనక్కుపంపే అధికారం గవర్నర్‌కు లేదు, రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లకతప్పదు కాబట్టి నీట్ మినహాయింపు ఖాయమనే ధీమాతో ఉంది. -
రూ.30 లక్షల అప్పు.. సర్పంచ్ ఆత్మహత్య
ఇల్లంతకుంట: ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాక పోవడంతో మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి (48) 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాదిన్నరగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 30 లక్షల రూపాయల వరకు అప్పు అయ్యింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నట్లు పొలం వద్ద నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆనందరెడ్డి కొనఊపిరితో కనిపించారు. ఇల్లంతకుంటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పద్మ ఆరోపించారు. -
టీబీ ఆస్పత్రిలో ఆకలి కేకలు
అనంతగిరి/వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరిగుట్ట టీబీ శానిటోరియంలో చికిత్స పొందుతున్న రోగులు ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 40 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. వారికి నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు మందులను ఉచితంగా అందజేస్తారు. కానీ సదరు కాంట్రాక్టర్‌కు 14 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. ఇన్నాళ్ల పాటు అప్పులు చేసి భోజనం వడ్డించిన కాంట్రాక్టర్ జనవరి 31 నుంచి ఆపేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని నాలుగు రోజులుగా రోగులకు భోజనం అందిస్తున్నారు. ఇక్కడి పరిస్థితి తెలుసుకున్న 17వ వార్డు కౌన్సిలర్ ఫైముదాబేగమ్‌ఖాజా కూడా ముందుకు వచ్చి రోగులకు ఆహారం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 9 మంది వైద్యులు, ఒక సూపరింటెండెంట్, ఆర్ఎం ఇక్కడ సేవలు అందించాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క వైద్యురాలు (మృదుల) మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. -
ప్రభుత్వ శాఖలే శాపం
విద్యుత్తు శాఖకు బకాయిలు షాక్ కొడుతున్నాయి. ప్రజలు ఠంఛన్‌గా బిల్లులు జమ చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మాత్రం పైసా చెల్లించకుండా వాయిదా మంత్రాన్ని జపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖకు ఆయా శాఖల నుంచి బిల్లులు జమచేయకపోవడంతో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ రకంగా కోట్ల రూపాయల్లోనే బకాయిలు వసూలు కాకుండా ఉన్నాయి. ఫలితంగా ఏటేటా విద్యుత్తుశాఖ రెవెన్యూ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. సాక్షి, తూర్పు గోదావరి: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఆరు విద్యుత్తు డివిజన్లలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ శాఖల వద్ద పేరుకుపోయిన బకాయిలు రూ.342.58 కోట్లు పైమాటే ఉన్నాయి గత జూన్ నెలలో బకాయిలు రూ.216.04 కోట్లుంటే తాజాగా జూలై నెలకు వచ్చేసరికి బకాయిలు రూ.230.83 కోట్లకు చేరుకుంది. గత చంద్రబాబు సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇందుకు జిల్లాలో ఉన్న 1072 గ్రామ పంచాయతీలు కూడా మినహాయింపు కాదు. గత సర్కార్ గ్రామాలకు వచ్చిన నిధులను వంది మాగధుల స్వప్రయోజనాల కోసం దారిమళ్లించడంతో గడచిన ఐదేళ్లుగా పంచాయతీల పాలకవర్గాలు చిల్లిగవ్వ కూడా విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోయాయి. ఈ కారణంగానే విద్యుత్తు శాఖకు బకాయి పడిన వాటిలో అత్యధికంగా గ్రామ పంచాయతీల వద్దనే ఉండిపోయాయి. జిల్లాలో 17 లక్షల మంది వినియోగదారుల్లో 90 శాతంపైనే నెలనెలా ఏపీఈపీడీసీఎల్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించేస్తున్నారు. కానీ ప్రభుత్వ శాఖల నుంచి మాత్రం బకాయిలు ఊడిపడటం లేదు. అందులోను బకాయిలు గుదిబండగా మారిన విభాగాల్లో గ్రామ పంచాయతీలదే ఎక్కువగా ఉంది. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు గడచిన మూడు నెలల లెక్కలు తీస్తే రూ.14.22 కోట్లు ఉంటే అందులో వసూలైంది కేవలం రూ.4.22 కోట్లు మాత్రమే. అంటే ఒక్క గ్రామ పంచాయతీల నుంచి మూడు నెలల బకాయిలు రూ.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలన్నీ కలిపితే ఉన్న బకాయిలు రూ.342.58 కోట్లు. ఇందులో గ్రామ పంచాయతీల నుంచే అత్యధికంగా రూ.201.34 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల తరువాత రెండో స్థానంలో నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ నుంచి రూ.97.87 కోట్లు బకాయిలు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల నుంచి రూ.20.98 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు వసూలు కాకపోవడంతో విద్యుత్తు శాఖ తలపట్టుకుంటోంది. ఉన్నత స్థాయి నుంచి ఇచ్చే రెవెన్యూ వసూళ్ల లక్ష్యాలను అధిగమించేందుకు ఈ బకాయిలు ప్రతిబంధకమవుతున్నాయని ఏపీఈపీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి బకాయిలు వసూలు కాకపోవడంతో ఏటా రెవెన్యూ లక్ష్యాలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో బకాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా అత్యధికంగా 17 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరు సకాలంలో బిల్లులు చెల్లిస్తుండడంతో రెవెన్యూ బాగానే వస్తున్నా, ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వల్ల లక్ష్యాన్ని అందుకోలేక పోతున్నాం. సీహెచ్ సత్యనారాయణరెడ్డి,సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీఈపీడీసీఎల్ -
నేడు సర్కారు ఆఖరి అప్పు
‘‘ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కూడా ఇష్టానుసారం అప్పు చేయించి తన వాళ్లకు చంద్రబాబు బిల్లులు చెల్లింపజేశారు. మిగిలిన అస్మదీయుల బిల్లులూ క్లియర్ చేసేందుకు నిబంధనలను కాలరాసి ఇంకా అప్పులు చేయిస్తున్నారు. దీని కోసం ఆర్థిక శాఖపై గట్టి ఒత్తిడి వచ్చింది. పోలింగ్ పూర్తయి అధికారం కోల్పోతున్నామని తెలిసిన తరువాత కూడా ఆఖరి ప్రయత్నంగా కేబినెట్ సమావేశం పేరుతో అనుకున్న పనులు సాధించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందుకోసం వచ్చే మంగళవారం చేయాల్సిన అప్పును కూడా ఈ మంగళవారమే చేయించేస్తున్నారు’’ సాక్షి, అమరావతి: కరవు, తుఫాను సహాయం, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ కార్యక్రమాల సమీక్ష సాకుతో మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఆ 4 అంశాలతో కేబినెట్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. మంగళవారం కేబినెట్ నిర్వహణకు కమిషన్ అనుమతిస్తుందని భావించిన చంద్రబాబు ఆ ముసుగులో అస్మదీయులైన కాంట్రాక్టర్లకు, పార్టీ నేతలకు చెందిన బిల్లులు చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పుల కోసం తిప్పలు... ముందుచూపుగానే 14వ తేదీ మంగళవారం నాటికి రూ.2,000 కోట్లు సమకూర్చుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శులు 14వ తేదీ మంగళవారం ఓపెన్ మార్కెట్లో రూ.1,000 కోట్లు అప్పు చేయాలని నిర్ణయించారు. అయితే ఆర్బీఐ విధించిన షరతు ప్రకారం వారానికి రూ.500 కోట్లు మాత్రమే రుణంగా తీసుకోవాల్సి ఉంది. అయితే వచ్చే మంగళవారం 21వ తేదీన 500 కోట్ల రూపాయలు అప్పు చేయబోమని, అప్పుడు చేయాల్సిన 500 కోట్ల రూపాయల అప్పును కూడా ఈ మంగళవారమే అంటే 14వ తేదీనే చేస్తామని, అందువల్ల మంగళవారం రూ.1,000 కోట్ల రుణ సేకరణకు అనుమతించాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆర్బీఐని కోరారు. దీంతో ఆర్బీఐ 14వ తేదీన ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించింది. 14వ తేదీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 1,000 కోట్ల అప్పు సమీకరించనున్నారు. 15వ తేదీన రాష్ట్ర ఖజానాకు జమకానున్నాయి. రూ.32 వేల కోట్ల అప్పునకు బ్రేక్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం మేర ఓపెన్ మార్కెట్ ద్వారా 32 వేల కోట్ల రూపాయల అప్పునకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖ వినతిని సమ్మతించలేదు. ఎందుకంటే ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి అదనంగా ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిర్ధారించిన మేరకే అప్పులు చేయాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏడాది ఎక్కువ చేసిన అప్పును కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అప్పును నిర్ధారిస్తుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు పరిమాణం తగ్గిపోనుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.8,000 కోట్ల రుణసేకరణకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఇంకా ఎంత రుణానికి అనుమతించాలనేది లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకున్న తరువాత చెబుతామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓట్లు రాబట్టుకునేందుకు రూ. 5వేల కోట్ల అప్పు... చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నెల ఏప్రిల్ 9వ తేదీన అంటే పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏకంగా ఒకేసారి రూ.5,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఈ విధంగా చేసిన అప్పుల మొత్తాన్ని ఎన్నికల ముందు ఓట్లు రాబట్టే పథకాల కోసం వినియోగించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఏ శాఖకు చెందిన అధికారులైనా నూట్రల్‌గా ఉంటారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శులు మాత్రం ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేశారు. పార్టీకి చెందిన నేతలుగా వ్యవహరిస్తూ సీఎం చెప్పిన బిల్లులను చెల్లించేశారు. పసుపు– కుంకుమ పేరుతో అప్పు చేసిన నిధులను తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రయోజనాల కోసం విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఒకేసారి 5,000 కోట్ల రూపాయల అప్పు చేయడంతో ఏప్రిల్ నెలలో అనుమతించబోమని ఆర్బీఐ స్పష్టం చేస్తూ వారానికి రూ.500 కోట్లే ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో 2వ తేదీ రూ.500 కోట్లు, అలాగే 7 వతేదీ మరో 500 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు ఈ నెల 21వ తేదీ చేయాల్సిన అప్పును కూడా కలుపుకుని ఈ నెల 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. అంటే కేంద్రం తొలి త్రైమాసికానికి అనుమతించిన 8,000 కోట్ల రూపాయల రుణంలో మంగళవారం చేసే రూ.1,000 కోట్లతో కలిపితే రూ.7,000 కోట్లు అప్పు చేసినట్లవుతుంది. ఇక వచ్చే నెలలో కేవలం 1,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి మాత్రమే అనుమతి మిగిలింది. అంటే ఓట్ల లెక్కింపు అనంతరం వచ్చే ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తప్పని పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం కల్పించినట్లయింది. -
బకాయిల వడ్డన
అప్పుచేసి పప్పన్నం అందిస్తున్నా వారిని ఆదుకునే వారు లేరు. నిధులను సైతం సమకూర్చకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.ఒకరోజు కాదు.. రెండురోజులు కాదు.. రోజూక్రమం తప్పకుండా ఆహారం మెను ప్రకారంవిద్యార్థులకు అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోని తీరు వెరసిఅన్నం పెట్టే మహిళలకు ఆకలి బాధలుకలిగిస్తున్నాయి. నెలల తరబడి బిల్లులుఅందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఉన్నత పాఠశాలల్లో ఏకంగానెలకు రూ. లక్ష వరకు బిల్లు వస్తుంది. మరీమూడు, నాలుగు నెలలు అందకపోతే వారుఎలా సరుకులు కొనాలి.. పిల్లలకు ఎలాఅందించాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ సర్కార్ ఐదేళ్లలోనూమధ్యాహ్న భోజన కార్మికులతో ఆడుకుంటుందనే విమర్శలున్నాయి.చివరకు హెల్పర్ల జీతాల విషయంలోనూ అలసత్వం కనిపిస్తోంది. సాక్షి కడప : మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జనవరి నుంచి ఇప్పటివరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు చెల్లించాల్సి ఉంది. కరువు నేపథ్యంలో జిల్లాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సెలవుల్లో కూడా అమలు చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. నాలుగు నెలల బిల్లులు పెండింగ్ ఉండటంతో సెలవుల్లో ఆహారం సరఫరా చేయడానికి చాలామంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాపై నెలకు సరాసరిన రూ. 1.60 కోట్లు బిల్లు అవుతోంది. నాలుగు నెలలకు దాదాపు రూ. 6 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రెండు రోజుల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల, హెల్పర్ల జీతాలు పెండింగ్ మొత్తాలు ఖాతాలకు జమ చేస్తున్నారు. జీతాలకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతన వేతలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5745 ఏజెన్సీలలో 11,490 మంది హెల్పర్లు, ఆయాలున్నారు. వారందరికీ గౌరవ వేతనంగా చెల్లించే రూ.1000 మొత్తాన్ని కూడా ఆలస్యం ప్రభుత్వం చేస్తోంది. నెలకు ఇచ్చే స్వల్ప మొత్తం కూడా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జీతాలకు కూడా వారు నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇదే తంతు కొనసాగుతోంది. సక్రమంగా నెలనెల బిల్లులు అందించిన పరిస్థితులు దాదాపు లేవనే చెప్పవచ్చు. ప్రతిసారి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పెండింగ్ మొత్తాలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎప్పుడు చూసినా ఇదే రకంగానే వెళుతున్నారు తప్ప సక్రమంగా నెలనెల అందించిన పాపాన పోలేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మొదలుకొని హెల్పర్లు, ఆయాల జీతాలు కూడా ఇదే పరిస్థితిలోనే కొనసాగాయి. ఏది ఏమైనా ఐదేళ్లు వారు కష్టాలతోనే ముందుకు సాగుతూ వచ్చారు. మధ్యాహ్న భోజన బిల్లులెప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల బిల్లులు రావాల్సిన నేపధ్యంలో తర్వాత ప్రభుత్వం మారితే వస్తాయో, రావోనన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. ప్రస్తుత సర్కార్ వారి బిల్లుల విషయంలో అయినా వెంటనే మంజూరు చేసి అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఐదేళ్లలో బిల్లులన్నీ పెండింగ్‌లో పెడుతూ వచ్చినా.. కనీసం చివరిలోనైనా అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సంక్షేమంలో బిల్లుల సంక్షోభం!
కోవెలకుంట్ల: సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో కూరుకుపోయాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల తాయిలాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. దీంతో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ, ఎస్సీ కళాశాలల హాస్టళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగు నెలల నుంచి హాస్టళ్లకు ఎలాంటి బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి వసతి గృహాల అధికారులు, సిబ్బంది అప్పులు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలలతోపాటు హాస్టళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. జిల్లాలో 52 బీసీ వసతి గృహాలు, 51 ఎస్సీ హాస్టళ్లు, 15 రెసిడెన్షియల్ పాఠశాలలు, 21 ఎస్సీ, 28 బీసీ కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఉంటూ విద్యనభ్యసించే పేద విద్యార్థులకు గత ఏడాది జూలై నెల నుంచి కొత్త మెనూ ప్రకారం వారంలో మంగళ, శుక్ర, ఆదివారం చికెన్‌తో కూడిన ఆహారం అందజేశారు. ఉదయం విద్యార్థులకు అందజేసే రాగి మాల్ట్‌ను సాయంత్రానికి మార్చి ఆ స్థానంలో పా లు సరఫరా చేశారు. జనవరి నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీల బిల్లులు నిలిచిపోవడంతో వసతి గృహాల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఖజనా ఖాళీతో అందని బిల్లులు.. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొత్త మెనూ ఆధారంగా ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. గతంలో 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750 ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 1050, 5వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 850 నుంచి రూ. 1250, కళాశాల హాస్టళ్ల విద్యార్థులకు రూ. 1050 నుంచి రూ. 1400లకు డైట్ చార్జీలు పెంచారు. ఈ మొత్తంతో విద్యార్థులకు చికెన్, పాలు, భోజనానికి సరిపడు నిత్యావసరాలు వెచ్చిస్తున్నారు. హాస్టళ్లలో వారంలో మూడు రోజులపాటు ఒక్కో విద్యార్థికి 80 గ్రాముల చికెన్, 100 ఎంఎల్ పాలు అందజేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో డైట్ చార్జీల బిల్లులను సంబంధిత హాస్టల్ వెల్పేర్ అధికారులు మ్యానువల్ పద్ధతిలో ట్రెజరికి పంపితే అక్కడ బిల్లు పాసై వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ ఏడాదిని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది వేతనాలతోపాటు డైట్ చార్జీలను సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పసుపు– కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో ఖజనాలో ఉన్న నిధులను ఖాళీ చేయడంతో నాలుగు నెలల నుంచి బిల్లులు నిలిచిపోయాయి. అప్పులు చేసి విద్యార్థులకు భోజనం నాలుగు నెలల నుంచి సంక్షేమ వసతి గృహాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో ఆయా వసతిగృహాల అధికారులు అప్పులు చేసి హాస్టళ్లను ¯ð నెట్టుకొచ్చారు. వారంలో మూడు రోజులపాటు చికెన్‌తో కూడిన భోజనం, పాలు సరఫరా చేయాల్సి ఉండగా నాలుగు నెలల పాటు అప్పు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెట్టాల్సి వచ్చింది. డైట్ చార్జీలతోపాటు గత ఏడాది నవంబర్ నెల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందకపోవడం గమనార్హం. విద్యార్థులకు సబ్బు, నూనెకు సంబంధించి 6వ తరగతి వరకు నెలకు రూ. 130, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 155 ప్రకారం కాస్మొటిక్ చార్జీలను అందజేయాల్సి ఉంది. అయితే ఆరు నెలల కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించి ఆదుకోవాలని ఆయా వసతిగృహాల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు కోరుతున్నారు. బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాం సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ఈ ఏడాది జనవరి నెల నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీలు విడుదల కావాల్సి ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగింపు, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో బిల్లులు నిలిచిపోయాయి. బిల్లుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. వీలైనంత త్వరలో బిల్లులు విడుదల అవుతాయి. సత్యనారాయణ,ఏఎస్‌డబ్లు్యఓ, కోవెలకుంట్ల -
భోజనం పెట్టేదెలా.!
మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీల నిర్వాహకుల ఆకలి కేకలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. పాఠశాలల విద్యార్థులకు వీరు అప్పు చేసి పప్పు అన్నం పెడుతున్నారు. నాలుగైదు నెలల నుంచి బిల్లులు అందలేదు. బుధవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో తమ బిల్లుల పరిస్థితి ఏమిటని ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో 2,585కుపైగా ప్రాథమిక పాఠశాలల్లో 92 వేల మందికిపైగా విద్యార్థులు, 280కిపైగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18వేల మంది, 391 ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరంతా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న వారే. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగైదు నెలలుగా భోజనం బిల్లులు చెల్లించడం లేదు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నెలకు రూ.10వేల నుంచి రూ.50వేలకు పైగా బిల్లులు అవుతున్నాయి. రూ.కోట్లలో బకాయిలు.. ప్రభుత్వం భోజనం బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని ఏజెన్సీ నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. అప్పు చేసి రూ.లక్షకుపైగా తెచ్చామని మరి కొందరు ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఒక్కో వంట ఏజెన్సీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీ నిర్వహిస్తే కుటుంబ పోషణకు పదో పరకో వస్తుందని అనుకున్న ఏజెన్సీల నిర్వాహకులు చివరకు అప్పుల పాలవుతున్నారు. రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు.. ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐదు నెలలుగా ఎదురు చూసి బిల్లులు వస్తాయని అనుకున్న ఏజెన్సీలకు జూన్ 12వ తేదీ దాటితే కానీ బిల్లులు రావని అనుకుంటున్నారు. ఈ విధంగా మరో రెండు నెలలు బిల్లుల కోసం ఆగాల్సిన పరిస్థితి ఏజెన్సీ నిర్వాహకులకు ఏర్పడబోతోంది. ఈ విధంగా అయితే ఏజెన్సీలను నిర్వహించబోమని, రూ.లక్షలు అప్పు చేసి రోడ్లపాలు కాబోమని మరి కొందరు చెబుతున్నారు. విద్యార్థులకు భోజనం పెడుతూ వారి ఆకలిని తీరుస్తున్న ఏజెన్సీలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఈ విధంగా తమకు బిల్లులు చెల్లించడం లేదని కొందరు ఏజెన్సీల వారు వాపోతున్నారు. రూ.లక్షకు పైగా అప్పు చేశాను పట్టణంలోని 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో వంట ఏజెన్సీని నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బిల్లులు నాలుగు నెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు భోజనం ఖర్చు అవుతుంది. ఇప్పటికే నేను రూ.లక్షకు పైగా వడ్డీకి తీసుకొచ్చి ఏజెన్సీని నిర్వహిస్తున్నా. బుధవారం నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. ఇప్పటికీ బిల్లులు రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి. –ఎ.జయలక్ష్మి, 2వ వార్డు మున్సిపల్ హైస్కూల్ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రొద్దుటూరు. -
అప్పు చేసి పప్పు కూడు..
సాక్షి, కలసపాడు( వైఎస్సార్ కడప) : ప్రభుత్వ పథకాల తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది. పథకాల్లో ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణ లోపం కనిపిస్తోంది. ప్రాథమిక విద్యకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకొంటుంది. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా మారింది. నెలల తరబడి బిల్లులు చెల్లించకుంటే పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. మండలంలో ప్రాథమిక పాఠశాలలు 32, ప్రాథమికోన్నత పాఠశాలలు 6, ఉన్నత పాఠశాలలు 4 ఉన్నాయి. మండలంలో మొత్తం 2089 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది అరకొరే.. ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్డు సరఫరా చేసి ప్రాథమిక పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి రూ.2.17లు, యూపీ, హైస్కూల్ విద్యార్థులకు రూ.3.24లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నిర్వాహకులు కూరగాయలు, వంటగ్యాస్ ఇతర సామగ్రిని కొనుగోలు చేసి పిల్లలకు భోజనం వడ్డిస్తారు. ఒక నెల నుంచి కోడిగుడ్లు, నూనె సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా కందిపప్పు, బియ్యం నాసిరకంగా వస్తుండటంతో పిల్లలు తినే ఆహారంలో నాణ్యత తగ్గుతోంది. అప్పు చేసి వడ్డించాల్సి వస్తోంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు నెలల బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు మండలంలో రూ.4,32,801లు నిర్వాహకులకు రావాల్సి ఉంది. దీంతో పాటు మండలంలో ఉన్న 60 నిర్వాహకులకు నెలకు ప్రభుత్వం గౌరవ వేతనంగా వెయ్యి రూపాయలు ఇస్తుంది. అవి నాలుగు నెలలకు సంబంధించి రూ.2.40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అప్పు చేసి పిల్లలకు వడ్డించాల్సి వస్తుండటంతో భోజనంలో నాణ్యత కొరవడుతున్న పరిస్థితి దాపురించింది. బిల్లుల మంజూరులో విద్యాశాఖాధికారులు చొరవ తీసుకోవాలని నిర్వాహకులు వేడుకుంటున్నారు. గుడ్డు కొట్టేశారు విద్యార్థులకు అందించాల్సిన కోడిగుడ్డుకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. గుడ్డు సక్రమంగా చెల్లించకపోవడంతో పాఠశాలలకు సరఫరా ఆగిపోయింది. దాదాపు నెల నుంచి సరఫరా నిలిచిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏజెన్సీలకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం, సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోతున్న కారణాలతో తరచూ బ్రేక్ పడుతోంది. పాఠశాల విద్యార్థులకు వారానికి 5 సార్లు గుడ్డు ఇవ్వాలి. ప్రస్తుతం గుడ్డులేని భోజనం విద్యార్థులకు అందించాల్సి వస్తుంది. వేతనాలు అందక అవస్థలు నాలుగు నెలల నుంచి వేతనాలు మంజూరు కాలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. అధికారులు స్పందించి వేతనాలు మంజూరు చేయాలి. – పీరమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, కలసపాడు ఇంట్లో నుంచి తెచ్చి ఎన్ని రోజులు పెట్టగలం ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి మధ్యాహ్న భోజనం పెట్టాలంటే ఎలా సాధ్యం. ఒక నెల, రెండు నెలలు అయితే పెట్టగలం. అంతకు మించి పెట్టాలంటే అప్పు చేయాల్సిందే. ప్రభుత్వం ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితుల్లో అప్పు, దానికి వడ్డీ కడితే మాకు మిగిలేది సున్నానే. – రామలక్షుమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, తెల్లపాడు -
‘రూ.4,500 కోట్లు చెల్లించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు తక్షణ అవసరంగా కనిష్టంగా రూ.4,500 కోట్లు చెల్లించాలని సాగునీటి శాఖ ప్రభుత్వానికి సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఉన్న పనులకు త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టింది. ఒక్కో ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా ఏ పనులకు బిల్లులు చెల్లించాలన్న వివరాలు సేకరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఏకంగా రూ.10వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.వెయ్యి కోట్లు, దేవాదులలో రూ.668 కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలో కలిపి మరో రూ.400 కోట్లు, డిండిలో రూ.319 కోట్లు, సీతారామలో రూ.126 కోట్లు, ఎల్లంపల్లిలో రూ.321 కోట్లు, పెన్‌గంగలో రూ.84 కోట్లుండగా, అత్యధికంగా పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,620 కోట్లు, మిషన్ కాకతీయకు సంబంధించి రూ.880 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సందర్భంగా నిధుల అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి నిధులు విడుదల చేయాలని సూచించారు. దీంతో ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు వివరాలు సమర్పించారు. భూసేకరణ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ బిల్లులను చెల్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
శ్రీమంతుల ‘నల్ల’ముఖం!
సాక్షి,సిటీబ్యూరో: అవన్నీ పేరుకు బహుళ అంతస్తుల భవనాలు. అందులో ఉండేవారు టిప్‌టాప్‌గా తిరిగే బడా బాబులే.. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంలో ముందున్నారు. నిత్యావసరమైన జలమండలి నీటిని విచ్చలవి డిగా వాడేసుకుని.. రూ.లక్షల్లో వచ్చిన బిల్లులు చెల్లించమంటే ముఖం చాటేస్తున్నారు. నగదు చెల్లించమని పలు పర్యాయాలు జలమండలి హెచ్చరించినా.. వారిలో చలనం రాకపోయేసరికి అధికారులు ఆయా భవంతులకు నల్లా కనెక్షన్ తొలగించారు. దీంతో ఆ భవనాలు ‘డిస్కనెక్షన్’ జాబితాలో చేరాయి. కానీ వాటికి యథావిధిగా నల్లా నీరు సరఫరా జరిగిపోతోంది. గ్రేటర్ పరిధిలో ఇలాంటి అక్రమ నల్లాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల జలమండలి విజిలెన్స్ విభాగం కొరడా ఝుళిపించడంతో 18 బహుళ అంతస్తుల భవంతులకున్న అక్రమ నల్లాల బాగోతం బయటపడింది. వీరంతా శ్రీమంతులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బిల్లుచెల్లించని కారణంగా ‘డిస్కనెక్షన్’ అయిన నల్లాల జాబితాను బోర్డు విజిలెన్స్ బృందం సేకరించింది. ఒక్కో భవంతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్రమ నల్లాల డొంక కదులుతుండడం గమనార్హం. అక్రమాలతో బోర్డు ఆదాయానికి గండి జలమండలి పరిధి విస్తరించడంతో ప్రస్తుతం నల్లా కనెక్షన్ల సంఖ్య 9.65 లక్షలకు చేరింది. ఇందులో వాణిజ్య కేటగిరి కింద వచ్చే నల్లా కనెక్షన్లు కేవలం 40 వేలకు మించి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు నెలవారీగా బోర్డు ఆదాయం రూ.95 కోట్లు కాగా.. విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిసి నెలవారీ వ్యయం రూ.115 కోట్లుగా ఉంది. ఈ అక్రమ నల్లాలే జలమండలిని ‘రూకల్లోతు’ ఆర్థిక కష్టాల్లోకి నెట్టినట్టు తేలింది. ఇటీవలి కాలంలో రూ.లక్షల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోయిన పలు బహుళ అంతస్తుల భవంతులకు నల్లా కనెక్షన్లను బోర్డు తొలగించినప్పటికీ.. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో యథావిధిగా నల్లా కనెక్షన్లను పునరుద్ధరించుకొన్న బడాబాబుల బాగోతం విస్తుగొలుపుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా డిస్కనెక్షన్ అయిన సుమారు వెయ్యి నల్లా కనెక్షన్ల జాబితాను బోర్డు విజిలెన్స్ బృందం తీసుకుని ఆయా భవనాల వారీగా తనిఖీలు చేపట్టగా అధికారులకు జిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి భవనానికి ఎన్నో నెలలుగా అక్రమ నల్లాలు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ ప్రధానంగా మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్ఆర్నగర్, బేగంపేట్ తదితర శ్రీమంతుల నివాస ప్రాంతాలే కావడం గమనార్హం. వాణిజ్య కార్యకలాపాలకు ‘ఇంటి’ నీళ్లే.. గ్రేటర్‌లోని పలు భవంతుల్లో హాస్టళ్లు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సేవా రంగానికి సంబంధించిన పలు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయిప్పటికీ నేటికీ గృహ నిర్మాణ కేటగిరీ(డొమెస్టిక్) కిందనే నల్లా నీరు సరఫరా అవుతోంది. దీంతో ఆయా భవనాల యజమానులు వేలల్లో నీటిబిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. వందల్లోనే చెల్లిస్తుండడం గమనార్హం. ఈ అక్రమాలకు ప్రధానంగా క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలపడమేనని బోర్డు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎండీ సీరియస్.. వెలుగులోకి అక్రమాలు డిస్కనెక్షన్(తొలగించిన) జాబితాలో ఉన్నప్పటికీ నల్లా కనెక్షన్ కొనసాగుతున్న భవనాల ఉదంతం రోజుకొకటి వెలుగు చూస్తుండడంతో జలమండలి ఎండీ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీచేశారు. విజిలెన్స్ సిబ్బందిని రం గంలోకి దించారు. వరుస తనిఖీలు నిర్వహిస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అక్రమ నల్లాలున్న భవన యజమానులపై విజిలెన్స్ బృందాలు సమీప పోలీసు స్టేషన్లో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద కేసులు నమో దు చేస్తున్నాయి. అక్రమార్కులు దారికొచ్చే వరకు తనిఖీలు ముమ్మరం చేయాలని ఎండీ ఆదేశించా రు. బోర్డు డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు విజిలెన్స్ సిబ్బంది అడిగిన సమాచారాన్ని అందజేయాలని ఎండీ ఆదేశించారు. అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించిన క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని స్పష్టం చేయడంతో అక్రమాల డొంక ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కాగా అక్రమ నల్లాలను కట్టడిచేస్తే బోర్డు రెవెన్యూ ఆదాయం నెలవారీగా రూ.వంద కోట్లకు చేరుకుంటుందని జలమండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్రమ కనెక్షన్ల వినియోగం..క్రిమినల్ కేసులు నమోదు బంజారాహిల్స్: బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న రెండు సంస్థలపై చర్యలు తీసుకున్నారు. బుధవారం వాటర్ వర్క్స్ జూబ్లీహిల్స్ సెక్షన్ మేనేజర్ సలోమి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో ఎలాంటి అనుమతి లేకుండానే ప్రధాన పైప్‌లైన్ పగలగొట్టి కార్యాలయంలోకి మంచినీటి కనెక్షన్ అక్రమంగా తీసారు. దీంతో ప్రధాన పైప్ నుంచి పెద్ద ఎత్తున మంచినీళ్లు వృథాగా పోతున్నాయి. అయితే కొన్నేళ్లుగా అక్రమంగా తీసుకున్న నల్లా కనెక్షన్‌తో నీళ్లు పొందుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో కార్వీ సంస్థపై ఐపీసీ సెక్షన్ 269, 430 కింద కేసులు నమోదు చేశారు. విస్పర్ వ్యాలీ క్లబ్‌పైనా చర్యలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం సమీపంలోని ఫ్లాట్ నంబర్ 35(ఏ)లో కొనసాగుతున్న విస్పర్ వ్యాలీ క్లబ్లో అక్రమ మంచినీటి కనెక్షన్లు వినియోగిస్తున్నారు. ఈ సంస్థపైనా జూబ్లీహిల్స్ పోలీసులు క్లబ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన పైప్‌లైన్‌ను పగలగొట్టి అక్రమంగా క్లబ్‌లోకి మంచినీటి కనెక్షన్లను తీసుకున్నారు. ప్రధాన పైప్ నుంచి నీరు వృథా పోతుండగా జలమండలి సిబ్బంది గుర్తించి పరిశీలించగా.. ఈ అక్రమ కనెక్షన్ గుట్టు రట్టయింది. వాటర్‌వర్క్స్ మేనేజర్ సలోమి ఫిర్యాదు మేరకు విస్పర్ వ్యాలీ క్లబ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. -
ఫీజుల పితలాటకం!
సింధూష ఏయూలో ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తి చేసింది. ఈనెల 18న జరిగే గేట్ కౌన్సెలింగ్‌కు సిద్ధమయింది. కౌన్సెలింగ్ సమయంలో డిగ్రీ టీసీ అవసరమని చెప్పడంతో కాలేజీకి వెళ్లింది. కాలేజీ రికార్డులు తిరగేసి రూ.35 వేలు ఫీజు బకాయి చెల్లించి తీసుకెళ్లమని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా? అని చెప్పినా వినిపించుకోలేదు. ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు అప్పు కోసం తిరుగుతున్నారు. రాజేష్‌కుమార్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ చదివాడు. ఎంసీఏలో చేరేందుకు ఐసెట్ రాసి అర్హత సాధించాడు. మంగళవారం నాటి కౌన్సెలింగ్‌కు టీసీతో హాజరు కావాలని చెప్పడంతో కాలేజీకెళ్లాడు. అక్కడ ఫీజు బకాయి సొమ్ము రూ.30 వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని చెప్పడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో జమ చేసుకోమని చెప్పాడు. వారు నిరాకరించడంతో రాజేష్ తల్లిదండ్రులు బకాయి చెల్లించి టీసీ తెచ్చుకున్నారు. ఇలా సింధూష, రాజేష్కుమార్లే కాదు.. ఇప్పుడు జిల్లా, నగరవ్యాప్తంగా ఉన్న ఎందరో విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది...! సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంలా మారింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము చెల్లించకపోవడం వల్ల వీరి భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లడానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము ఆయా కళాశాలలకు ఇంకా విడుదల చేయలేదు. దీంతో విద్యార్థుల పేరిట కళాశాల యాజమాన్యాలు బకాయిలు చూపుతున్నాయి. వీటిలో ప్రైవేటు కాలేజీలతో పాటు ప్రభుత్వ కళాశాలలు కూడా ఉన్నాయి. బకాయి పూర్తిగా చెల్లిస్తేనే గాని టీసీ తదితర సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని వీటి యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. సోమవారం నుంచి ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలకు, ఈ నెల 18 నుంచి గేట్‌కు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో రూ.35 వేల ఫీజు బకాయి చెల్లించలేక, ఉన్నత విద్యను వదులుకోలేక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంత మొత్తాన్ని ఇప్పటికిప్పుడు చెల్లించడం పేద, మధ్యతరగతి వారికి తలకుమించిన భారంగా పరిణమిస్తోంది. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించనిదే టీసీలివ్వడానికి నిరాకరిస్తున్న కళాశాలల్లో ప్రైవేటుతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కాలేజీ కూడా ఉండడం విశేషం. పోనీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేసేదాకా బాండ్లపై సంతకాలు చేసయినా ఇవ్వడానికి మరికొందరు విద్యార్థులు సిద్ధమవుతున్నా అంగీకరించడం లేదు. మరికొన్ని కాలేజీల వారు టీసీలకు బదులు బోనఫైడ్ (వారి కాలేజీలో చదివినట్టు) సర్టిఫికెట్లు ఇస్తున్నా వాటిని కౌన్సెలింగ్‌లో అనుమతించడం లేదు. సర్కారుపై నమ్మకం లేకే..? ఇంతలా కళాశాలలు బకాయిల కోసం పట్టుబట్టడానికి కారణం ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము వస్తుందో? రాదోనన్న భయమేనని కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నందు వల్ల బాకీలు చెల్లించే వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నామని చెబుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును కాలేజీలకు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల టీసీలు ఇవ్వడం లేదు. దీంతో కౌన్సెలింగ్ నాటికి అవి అందవన్న భయంతో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం టీసీతో పనిలేకుండా కౌన్సెలింగ్ నిబంధనలను సడలించాలి. లేదా బోనఫైడ్ సర్టిఫికెట్‌నైనా అనుమతించేలా ఉత్తర్వులివ్వాలి. – కె.ఆదినారాయణ, విద్యార్థిని తండ్రి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా నిబంధనల ప్రకారమే ఇవ్వడం లేదు.. స్టూడెంట్ ఫీజు బకాయి ఉంటే సర్టిఫికెట్లు ఇవ్వరాదన్న నిబంధన ఉంది. దానినే మేం అమలు చేస్తున్నాం. బకాయి చెల్లించకుండా సర్టిఫికెట్లు తీసుకుపోతే ఆ తర్వాత వారి చుట్టూ మేం తిరగలేం. వారు చెల్లించకపోతే ఎవరు బాధ్యులవుతారు? అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చాక వారికి తిరిగి ఇచ్చేస్తామని, ముందుగా ఫీజు బకాయి చెల్లించాలని చెబుతున్నాం. – ప్రమీలాదేవి, ప్రిన్సిపాల్, ఏయూ మహిళా కళాశాల -
‘వేలు’ పెడితే కోట్లొస్తాయ్!
హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఓ జిరాక్స్ మిషన్ కారణంగా ఆగిపోయాయంటే నమ్మగలరా..! కానీ.. నమ్మాల్సిందే.. అక్షరాలా రూ.6 కోట్లు వివిధ సంస్థల నుంచి నిమ్స్‌కు రావాల్సి ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఈహెచ్ ఎస్ స్కీం ద్వారా నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వచ్చి చికిత్స పొందుతారు. ఇలా చికిత్స పొందిన వారిలో ఆర్టీసీ, బీఎస్ఎన్ఎల్, సీజీహెచ్, సింగరేణి, రైల్వే, ఈఎస్ఐతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు ఉన్నారు. వారికి అవసరమైన చికిత్స నిర్వహించిన అనంతరం అందు కు సంబంధించిన బిల్లులను నిమ్స్ యాజమాన్యం ఆయా సంస్థలకు పంపి వసూలు చేస్తుంది. జిరాక్స్ మిషన్‌ను బాగుచేసేందుకు కేవలం రూ.13వేలు మాత్రమే అవుతాయి. కానీ ఆస్పత్రి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం తో నాలుగు నెలలుగా అది మూలకు పడింది. ఎందుకీ దుస్థితి.. నిమ్స్ స్పెషాలిటీ బ్లాకులో క్రిడెట్ కలెక్షన్ యూనిట్ (సీసీయూ)ఉంది. ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ ద్వారా చికిత్స పొందిన వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను ఆయా సంస్థలకు పంపి వసూలు చేయాలి. అందుకు వారికి వచ్చిన బిల్లులను నకళ్లను తీసి క్లెయిమ్ కోసం పంపించాల్సి ఉంటుంది. అందుకోసం 2011లో జిరాక్స్ మిషన్‌ను నిమ్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీనికి సంబంధిత తయారీ సంస్థ ఇచ్చిన లైఫ్ 6 లక్షల కాఫీలకు మాత్రమే. అయితే సుమారు 10 లక్షల కాఫీలను తీసి మిషన్ అలసిపోయింది. నాలుగు నెలలుగా జిరాక్స్ మిషన్ మూలకు పడి ఉంటోంది. ఎమ్మార్డీ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రాని బిల్లుల ఫైళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి బిల్లులను ఎమ్మార్డీ యూనిట్‌కు పంపుతారు. అక్కడ నుంచి క్రిడెట్ కలెక్షన్ యూనిట్‌కు రావాల్సి ఉంది. అయితే చాలా ఫైళ్లు క్రిడెట్ కలెక్షన్ యూనిట్ రావాల్సిఉందని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఎంతో విలువైన ఫైళ్లను నిర్లక్ష్యంగా సిబ్బంది నేలపై పడేశారు. వాటిలో కోర్టు కేసులకు సంబంధించిన మెడికో లీగల్ ఫైళ్లు ఉన్నాయి. అక్కడ ర్యాకులు లేకపోవడంతో.. వర్షం వస్తే ఫైళ్లు తడిసిపోతున్నాయి. -
ఇల్లూ పోయె.. సబ్సిడీ బిల్లూ రాకపోయె
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ తీరుతో అవస్థలు తప్పడం లేదు. నెల్లూరు నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేద వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తోందని తెలిసి చాలా మంది ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తమ పాత ఇళ్లను కూలగొట్టుకుని గృహ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఉన్న ఇళ్లను కూల్చివేసుకుని ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మూడు నెలలుగా ఒక్క రూపాయి రాక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్బన్ ప్రాంతాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.5 లక్షలు సబ్సిడీ కింద ఇవాల్సిఉంది. ఈ సబ్సిడీ పలు దఫాలుగా అందించాలి. మొదట లబ్ధిదారుడు బేస్మెంట్ వరకు నిర్మించుకుంటే రూ.25 వేలు, రూఫ్ లెవల్‌కు రూ.75 వేలు, శ్లాబ్ వేస్తే రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయితే మిగిలిన రూ.50 వేలు ఇవ్వాల్సిఉంది. బ్యాంకు నుంచి రుణంగా రూ.75 వేలు, లబ్ధిదారుడు రూ.25 వేలు భరించాల్సిఉంటుంది. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ కు చెందిన పేదవారు పాత పూరిళ్లను, రేకుల ఇళ్లను పగులగొట్టుకుని అప్పు తెచ్చి మరీ బేస్మెంట్ వరకు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నిర్మించి 3 నెలలు కావస్తున్నా హౌసింగ్‌శాఖకు సంబంధించిన అధికారులు బేస్మెంట్కు సంబంధించిన ఫొటోలు తీసుకోకపోవడంతో మొదటి విడతగా లబ్ధిదారులకు అందాల్సిన రూ.25 వేలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రేకుల చాటున నివసిస్తున్నాం స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇంటికి రుణం ఇస్తుందని చెబితే కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేశాను. అ ప్పు తెచ్చి బేస్మెంట్ వరకు నిర్మించి మూడు నెలలు కావస్తున్నా ఫొటోలు తీయలేదు. ఫొటోలు తీస్తే రూ.25 వేలు ఇస్తారంట. ప్రస్తుతం ఇల్లు లేక మూడు నెలల నుంచి రేకుల చాటున రోడ్డుపై నివసిస్తున్నాం. –ఎస్.కె.బీబీజాన్. 54వ డివిజన్, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరుఇంటి కాగితాలు సరిగా లేవని బిల్లు ఇవ్వలేదుఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుని మూడు నెలలయింది. సొంత డబ్బులతో బేస్మెంట్ వరకు నిర్మించుకున్నా. బిల్లులు రాలేదు. ఇదేమని అడిగితే ఇంటికి సంబం ధించి కాగితాలు సరిగా లేవని, వాటిని తేస్తే చూస్తామని ఇప్పు డు చెబుతున్నారు. – టి.సుప్రియ, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరు -
వేతనాలు, బిల్లులు... నో..!
నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. రూ.లక్షల పెట్టుబడితో చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక ఆంక్షలు విధించిన ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించ లేదు. మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం బిల్లులు అందకపోవడంతో అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లోఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి సాఫ్ట్వేర్ మార్చడమేనని అధికారులు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచిఆర్థిక ఆంక్షలు కొనసాగించడమేనని కార్మికులు, కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే వేతనాల చెల్లింపు బిల్లులను మున్సిపాలిటీలలో అకౌంట్ అధికారులు సిద్ధం చేసినా, జాప్యం జరిగిందంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వం మిగులు నిధులు చూపించేందుకే ఈ తరహా ఎత్తుగడ వేసిందని పలువురు అభిప్రాయపడుతుండగా... ఎప్పుడు బిల్లులకు క్లియరెన్స్ వస్తుందా..? అని ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో రూ.11కోట్ల 10 లక్షల వేతన బకాయిలు చెల్లించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా బడుగు జీవులకు కష్టాలు తప్పవని కార్మికులు వాపోతున్నారు. ఎన్నాళ్లు ఎదురు చూడాలి..?: అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనవరి నెలలోనే పలు అభివృద్ధి పనులు పూర్తిచేశాం. మార్చి నెలలో బిల్లులు చెల్లిస్తారని భావించాం. వడ్డీకి అప్పులు చేసి పనులు జరిపించారు. నేడు ఆ అప్పులను వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు వీడి, తక్షణమే బిల్లులు చెల్లించాలి. – యశోద కృష్ణ, మున్సిపల్ కాంట్రాక్టర్, సాలూరు సాఫ్ట్వేర్ మార్చడంతో సమస్య... పాత విధానంలో కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అమలు చేయడంతో సమస్య తలెత్తింది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మోనటరింగ్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)పై అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రత్యేక శిక్షణ ఇస్తే త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. – ఎం.ఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
ఉన్నది పోయే.. సొంతిల్లు రాదాయే..
పేదోడి సొంతింటి కల కలగానే మిగలనుంది. నిర్మాణాలు మొదలు పెట్టి నాలుగు నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుని ఖాతాలో జమకాలేదు.అప్పుతెచ్చి నిర్మాణాన్ని మొదలు పెట్టిన వారు అధికారులచుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేదు. ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో 2 సెంట్ల సొంత స్థలం ఉన్న వారికి ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం 2017–18 ఏడాదికి 9241 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిల్లో 7894 మంది లబ్ధిదారులకు ఐడీ నంబర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న గృహాలు 3021. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.50 లక్షల సబ్సిడీ, రూ.75 వేలు బ్యాంకు రుణం, రూ.25 వేలు లబ్దిదారుని వాటా కింద రూ.3.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారుని సొంత ఖాతాలో జమచేస్తారని తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్‌శాఖ అధికారులను ఒత్తిడి చేయడంతో ఉన్న ఇంటిని తొలగించుకొని ఇంటి పనులను మొదలు పెట్టారు. బిల్లులు త్వరగా వస్తాయన్న నమ్మకంతో అప్పు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొందరేమో డబ్బు లేక పనులు ఎక్కడికక్కడ నిలబెట్టారు. అధికారపార్టీ నేతలు శంకుస్థాపనలకే పరిమితం అధికార పార్టీ నేతలు శంకుస్థాపన మహోత్సవం పేరిట కార్యక్రమాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణ మంజూరు పత్రాన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చినట్లు డప్పు కొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ దశల్లో పూర్తయిన వాటికి చెల్లించాల్సిన మొత్తం రూ.1083.61లక్షలు. ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రూ.2.76కోట్లు రావాల్సిఉంది. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలు ప్రభుత్వం గృహాల బిల్లులు మంజూరు చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల స్టీల్ ధరలు జనవరి నెలకు ఇప్పటికి టన్నుకు రూ.13వేలు పెరిగాయి. ఇసుక ట్రాక్టర్ రూ.2,800లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక క్వారీలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో ఉన్నాయి. దీంతో పేదలకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. సిమెంటు ఇటుకలు వెయ్యి రూ.3,300 నుంచి రూ.4,500లకు పెరిగాయి. సిమెంట్ బస్తా ధర రూ.70 పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.2.50 లక్షల సబ్సిడీతోనే ఇళ్లు నిర్మించు కోవడం సాధ్యం కావడంలేదు. ప్రభుత్వం మొత్తం ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో రూ.2.50 లక్షలు సబ్సిడీ పోను లబ్ధిదారుడి వాటాగా రూ.25 వేలు పెట్టుకుంటే రూ. 75 వేలు బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తానన్న ప్రభుత్వం చెప్పింది. రూ.75 వేలు రుణం కావాలంటే లబ్ధిదారుడు తన ఇంటిని మార్టుగేజ్ చేయించి తీసుకోవాలని ఇప్పుడు మాట మార్చింది. దీంతో ఆ డబ్బు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. నిర్మాణాన్ని నిలిపేశాం పునాదుల వరకు వేసి పనులు నిలిపేశాం. ఇప్పటి వరకు ఒక్క బిల్లు ఇవ్వలేదు. బాడుగ ఇంటిలో ఉండి చేనేత పనులు చేసుకుంటున్నాం. బిల్లులు వేయకుండా మాతో పనులు ఎందుకు మొదలు పెట్టించారు. – షేక్ ఖాజా, రామేశ్వరం, ప్రొద్దుటూరు. ఎందుకు ఒత్తిడి తెచ్చారు.. ఉన్న కొట్టంలో బాడుగ లేకుండా కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాం. ఇళ్లు వచ్చింది..పనులు మొదలు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేశారు. రూ.1.50 లక్షలు అప్పుతెచ్చి పునాదులు వేశాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. బాడుగ ఇంటిలో ఉంటున్నాను. పని చేసుకొని జీవనం సాగించే పరిస్థితిలో అప్పునకు వడీ ఎలా చెల్లించాలి. – వంకా రామయ్య, 27వ వార్డు రామేశ్వరం డీఈ ఏమంటున్నారంటే... ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు రూ.2.70 కోట్ల బిల్లులు రావాలి. అన్ని దశలకు సంబంధించి గృహాల జియోట్యాగ్ చేసి ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపాం. త్వరలో బిల్లులు వస్తాయి. – సుందరరాజు, హౌసింగ్ డీఈ, ప్రొద్దుటూరు -
గూడుకు పైసల్లేవ్
సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు విడతల వారీగా చెల్లించాల్సిన బిల్లులు ఆగిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులు ఎప్పుడిస్తారో తెలియక లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో బిల్లులు వచ్చే సూచనలు కనిపించడం లేదని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు అటకెక్కినట్టే. బి.కొత్తకోట: జిల్లాలో 2016–19 ఆర్థిక సంవత్సరానికి 54,010 ఎన్టీఆర్ ఇళ్లను గ్రామీణ, పట్టణ పథకాల కింద మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు ఇస్తారు. నిర్మాణం ప్రారంభమయ్యాక సిమెంటు విలువతో కలిపి తొలివిడత రూ.15వేలు, రెండో విడత రూ.25వేలు, మూడో విడత రూ.40వేలు, నాలుగో విడత రూ.12వేలు చొప్పున బిల్లులను లబ్ధిదారుల ఖాతాలకు చెల్లిస్తారు. మిగిలిన రూ.58వేలకు సంబంధించి ఉపాధి పథకం ద్వారా కూలీలు, ఇటుకల కోసం చెల్లిస్తారు. జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లొచ్చి 50రోజులైంది.. లబ్ధిదారులకు బిల్లు మంజూరై 50 రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మంగళవారం వరకు అంటే 50 రోజులుగా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. ఫివ్రబరి 12 నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లు కోసం సంబంధిత డీఈ, ఈఈలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. వీటిని పరిశీలించి ఉన్నతాధికారులు తక్షణమే బిల్లులు మంజూరు చేస్తూ చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 2 నాటికి (సోమవారం) అధికారిక లెక్కల ప్రకారం లబ్ధిదారులకు అందాల్సిన బిల్లుల నగదు రూ.34,07,61,940. ఈ మొత్తం చెల్లింపులు ఆగిపోవడంతో పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటిని ఎప్పుడు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పులతో పనులు.. నిర్మాణాలు పూర్తి చేయించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల వెంట పడుతున్నారు. దాంతో బిల్లులు అందకపోయినా అప్పులు చేసి లబ్ధిదారులు పనులు చేయిస్తున్నారు. బిల్లులు వస్తాయన్న ఆశతో రుణాలపై ఆధారపడ్డారు. ఇప్పుడు బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే ఆన్లైన్లో బిల్లు జనరేట్ చేశాం.. వచ్చేస్తుంది.. అన్న సమాధానం ఇస్తున్నారే కాని స్పష్టంగా చెప్పడం లేదు. అవును బిల్లులు ఆగాయి.. జిల్లాలో ఫిబ్రవరి 12 నుంచి ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. శాఖ ప్రధాన కార్యాలయం నుంచే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతుంది. దీనిపై మాకు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఏమీలేదు. –ధనుంజయుడు, ప్రాజెక్టు డైరెక్టర్, చిత్తూరు -
గిరి పుత్రిక.. ప్రోత్సాహం అందక.
కర్నూలు(అర్బన్):రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గిరి పుత్రిక కల్యాణ పథకానికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం గిరిజన సామాజిక వర్గానికి చెందిన కొత్త జంటలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి. 2015 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న గిరిజన యువతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కో జంటకు ఏకమొత్తంలో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి నిధులను విడుదల చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ–12 జారీ చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 106 గిరిజన జంటలు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. ఆ తర్వాత ప్రోత్సాహకం అందించేందుకు బిల్లులు సిద్ధం చేసి ట్రెజరీకి పంపారు. అలాగే ఇతర కులాల వారు ఎవరైనా గిరిజనులను వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఐదు జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయింది. వీరికి రూ.2.50 లక్షలు విడుదల చేయాలంటూ అధికారులు ట్రెజరీకి బిల్లులు పెట్టారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులు మంజూరు చేయకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ విధించింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు బిల్లులు కూడా ఆగిపోయాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే బిల్లులు మంజూరు కాకుంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. విద్యుత్ బిల్లులదీ ఇదే తీరు.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత 0 నుంచి 75 యూనిట్లలోపు గిరిజనుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. జిల్లాలో 20,117 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి రూ.41 లక్షల బిల్లులను ఆ శాఖకు చెల్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. అవి కూడా ఫ్రీజింగ్లో పడ్డాయి. ఈ నెలాఖరు నాటికి బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కనెక్షన్లు కట్ చేస్తామని విద్యుత్ శాఖ హెచ్చరించే ప్రమాదముంది. గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పలు ఎస్టీ కాలనీలు, తండాల్లో నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఫ్రీజింగ్ వెంటనే ఎత్తేయాలి ఏడాది క్రితం వివాహం చేసుకున్న గిరిజన వర్గాలకు చెందిన దంపతులు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇచ్చే రూ.50 వేలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరం. విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను కూడా వెంటనే ఇవ్వాలి. లేదంటే గిరిజనులు ఇబ్బంది పడే అవకాశముంది.– ఆర్.యోగేష్‌నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి యువజన విభాగం అధ్యక్షుడు మంజూరయ్యే అవకాశాలున్నాయి జిల్లా ట్రెజరీలో ఫ్రీజింగ్ కారణంగా ఆగిన పలు బిల్లులు త్వరలోనే మంజూరయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 30 మందికి మాత్రమే ప్రోత్సాహకం అందించాలనే లక్ష్యం ఉంది. అయినప్పటికీ అదనంగా బడ్జెట్ తెప్పించుకున్నాం. ఎస్టీ సబ్‌ప్లాన్ బడ్జెట్ బిల్లులు కూడా త్వరలోనే మంజూరవుతాయి. – హెచ్.సుభాషణరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి -
బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారయ్యా!
చీరాల టౌన్ : ‘వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ అప్పులు చేసి మరీ సొంత గృహాన్ని నిర్మించుకున్నా. ఇంటికి మరుగుదొడ్డి లేకపోవడంతో ఇటీవల వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నా. కానీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు’ అని నాగులపాడు తూర్పువారివీధికి చెందిన మంగనూరు తులశమ్మ వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రైతులను ఆదుకోండి సార్.. చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు సకాలంలో సాగునీరు అందడంలేదని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వెంకటాపురానికి చెందిన భీమనాథం సుబ్బారెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తాను 12 ఎకరాలు పొగాకు సాగుచేస్తే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నానని వాపోయారు.